మద్యం టెండర్లకు కసరత్తు

మద్యం టెండర్లకు కసరత్తు - Sakshi


నేడో.. రేపో నోటిఫికేషన్‌



- ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

- 29, 30 తేదీల్లో లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు

- 75శాతం మేర తగ్గనున్న లైసెన్సు ఫీజు




మచిలీపట్నం : జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్‌ జారీ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్‌ విడుదలవుతుందని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. నోటిఫికేషన్‌ విడుదలైన నాటి నుంచి ఐదు రోజులపాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల మేర మద్యం దుకాణాలు ఉండకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నూతన మద్యం దుకాణాల విషయంలో అమలు చేస్తారు.



ఈసారి ముందుగానే...

ఈ ఏడాది జూన్‌ నెలాఖరుకు మద్యం దుకాణాల గడువు ముగియనుంది. జాతీయ, రాష్ట్ర రహదారులకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండకూడదనే సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వుల నేపథ్యంలో ఏప్రిల్‌ ఒకటో తేదీకే మార్పు చేసిన మద్యం విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు మచిలీపట్నం ఎక్సైజ్‌ ఈఎస్‌ తెలిపారు. జూన్‌ 30వ తేదీ వరకు మద్యం దుకాణాలకు పర్మిట్‌ ఉన్నా.. సుప్రీం ఆంక్షల నేపథ్యంలో ముందస్తుగానే దుకాణాలను కేటాయించనున్నారు.



తగ్గనున్న లైసెన్సు ఫీజు

గతంలో మండలాలు, నగర పంచాయతీలు, మునిసిపాల్టీలు, కార్పొరేషన్‌ల వారీగా మద్యం లైసెన్సు ఫీజులను నిర్ణయించారు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఒక్కో షాపునకు రూ.45 లక్షలు లైసెన్సు ఫీజుగా ఉంది. మారిన మద్యం పాలసీ ప్రకారం రూ.12.50 లక్షలు లైసెన్సు ఫీజు నిర్ణయించారు. మండలాల్లో ఒక షాపునకు గతంలో రూ.30 లక్షలు లైసెన్సు ఫీజుగా ఉంటే ప్రస్తుతం రూ.7.5లక్షలుగా ఉంటుంది. గతంలో జనాభా ప్రాతిపదికన వార్డు లేదా గ్రామాల్లో మద్యం దుకాణాలను కేటాయించేవారు.



ప్రస్తుతం జాతీయ రహదారులకు దగ్గరగా మద్యం దుకాణాలు ఉండకూడదనే కోర్టు ఉత్తర్వులతో మండలం, పురపాలక సంఘం, కార్పొరేషన్, నగర పంచాయతీలను ఒక యూనిట్‌గా పరిగణిస్తున్నారు. ఈసారి నోటిఫికేషన్‌లో ఏ ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయాలో సంబంధిత ప్రాంతాన్ని ప్రస్తావించరని ఎక్సైజ్‌ అధికారులు చెబుతున్నారు. మద్యం దుకాణాలకు పర్మిట్‌ రూమ్‌ అనుమతి కోసం రూ.5 లక్షలు, ఏడాది పూర్తయిన తరువాత రీ–రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. అధిక ధరకు మద్యం విక్రయిస్తూ పట్టుబడితే రూ.5 లక్షలు జరిమానా విధిస్తారు.



దరఖాస్తు ఫీజు రూ.5వేలు

మద్యం దుకాణాలకు రూ.5వేలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మండలంలో రూ.50వేలు, మునిసిపాల్టీలో రూ.75వేలు, కార్పొరేషన్‌లో రూ.లక్ష రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాలి. ఎక్సైజ్‌శాఖ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి దరఖాస్తుదారుడి ఆధార్‌ కార్డు, ఐటీ రిటర్న్స్‌ తదితర వివరాలను పరిశీలించి హాల్‌టికెట్‌ ఇస్తారు. ఈ హాల్‌టికెట్‌కు యూనిక్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉంటుంది. వీటిని సంబంధిత ఎక్సైజ్‌ సీఐ, సూపరింటెండెంట్‌ పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఈ హాల్‌టికెట్‌ యునిక్‌ కోడ్‌ సక్రమంగా ఉంటేనే దరఖాస్తుదారులు లాటరీ సమయంలో హాజరయ్యేందుకు అవకాశం ఇస్తారు.



మద్యం షాపుల కేటాయింపు, దరఖాస్తుల స్వీకరణ అంతా ఆన్‌లైన్‌లోనే ఉన్నా.. షాపుల కేటాయింపు మాత్రం దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ పద్ధతిలోనే నిర్వహిస్తారు. గతంలో జిల్లాలోని 334 మద్యం దుకాణాలకు 3,333 దరఖాస్తులు రాగా, రూ.12.57 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. ఈసారి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చి రూ.15 కోట్లు ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top