అంతా ఆన్‌లైన్ చెలా‘మనీ’


విజయనగరం అర్బన్: నోట్ల కొరత నేపథ్యంలో ఏర్పడిన ఇబ్బందులను పోగొట్టుకోవడానికి నగదు రహిత లావాదేవీలే శరణ్యమని, దాన్ని ప్రతి ఒక్కరి చేతా అలవాటు చేయించాలన్న సీఎం ఆదేశాలు ఇక్కడి బ్యాంకర్లు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. జిల్లాలోని పలు బ్యాంక్‌ల్లో బుధవారం అరకొర నగదు ఉన్నప్పటికీ నగదు రహిత లావాదేవీలనే అందించడం కనిపించింది. ప్రధానంగా ఎస్‌బీఐ శాఖల్లోనే ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. ఇప్పటికే  రూపేకార్డు పొందిన ఖాతాదారుడు నగదు కోసం పట్టణంలోని ఒక జాతీయ బ్యాంక్‌కు వస్తే ఆయనకు నగదు లేదని చెప్పి, స్వైపింగ్ మెషీన్ ద్వారా  లావాదేవీలను చేరుుంచారు. విత్‌డ్రా చేస్తున్న ఖాతాదారుని అవసరాన్ని తెలుసుకొని నగదు ఇవ్వాలని, ఆ మేరకు నోట్ల కొరతను తీర్చుకుంటూ నగదు రహిత లావాదేవీలను అలవాటు చేయించాలని తమకు ఆదేశాలొచ్చినట్టు బ్యాంక్ మేనేజర్ తెలిపారు. రూపే కార్డులేని వారికి తక్షణమే మంజూరు చేస్తున్నామని తెలిపారు. 

 

 బిజినెస్ కరస్పాండెంట్లు

 జిల్లాలో బ్యాంక్‌లు అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాల్లో సమీప బ్యాంక్‌లు ఇప్పటికే బిజినెస్ కరస్పాండెంట్లను ఏర్పాటు చేసి వారి ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారుు. తాజా పరిస్థితులకు అనుగుణంగా వారికి ’రూపేకార్డుల వినియోగం, మొబైల్ బ్యాంక్, ఆన్‌లైన్ బ్యాంకింగ్...’ వంటి సేవలపై శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఎస్‌బీఐకి దాదాపు 1,350 మంది బిజినెస్ కరస్పాండెంట్లు విధులు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పైనా విసృ్తతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇదిలా ఉండగా జిల్లాకు ఇంకా రూ. 500ల నోట్లు రాలేదు. దీనివల్ల ఇక నగదు లావాదేవీలకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. 

 

 కొందరికే బ్యాంకు ఖాతాలు

 జిల్లాలో 14,53,543 మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. వీటిలో తాజా లెక్కల మేరకు 83 శాతం ఖాతాదారులకే రూపే కార్డులున్నాయి. ఇవికాకుండా జన్‌ధన్ యోజనలో 5.69 లక్షల ఖాతాల్లో 3.84 లక్షల మందికి రూపేకార్డులు ఇచ్చారు. వీటితో లావాదేవీలకు విధిగా ఆధార్ సీడింగ్ ఉండాలి. ఇందులో అయితే 20వేల మంది జన్‌ధన్ ఖాతాదారులకు ఆధార్‌సీడింగ్ పూర్తికాలేదు. వీరిలో దాదాపు 80 శాతం మంది నిత్యవసరాల కోసమే నగదు విత్‌డ్రా చేస్తారు. ఈ నేపధ్యంలో బ్యాంకుల్లో నోట్లు ఇవ్వకపోడంపై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top