వరంగల్‌లో ప్రతిభకు కొదువ లేదు..


‘సైయంట్‌’ రాకతో మరిన్ని కంపెనీలు

ఐటీ సంస్థ ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి




మడికొండ : వరంగల్‌ జిల్లాలో ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఉద్యోగులకు కొదువ లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా మడికొండలోని ఇంక్యుబేషన్‌ సెంటర్‌లో ఏర్పాటుచేసిన సైయంట్‌ ఐటీ సెజ్‌ కార్యాలయాన్ని ఆదివారం శ్రీహరి ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటయ్యాక హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకు ఐటీ కంపెనీలను విస్తరించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు వరంగల్‌ జిల్లాకు సైయంట్‌ సంస్థను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సంస్థను బ్రాండ్‌ అంబాసిడర్‌గా చూపిస్తూ మరికొన్ని కంపెనీలు ఇక్కడ బ్రాంచ్‌లు ఏర్పాటుచేసేలా కృషి చేయనున్నట్లు వెల్ల డించారు. తద్వారా రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ప్రస్తుతం సైయంట్‌ సంస్థలో వంద మంది కి ఉపాధి కల్పిస్తుండగా, రానున్న రెండేళ్లలో వేయి మందికి ఉపాధి కల్పిస్తారని వెల్లడించారు. వరంగల్‌లో మొదటి దశలో రూ.10 కోట్లతో 45 ఎకరాల స్థలంలో ఐటీ సెజ్‌కు ఏర్పాటుచేయనుండగా..  రెండో దశలో రూ.6కోట్లను ఖర్చు చేయనున్నట్లు శ్రీహరి తెలిపారు.



కల నెరవేరింది..

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌కు ఐటీ కంపెనీలు వస్తాయని గత ప్రభుత్వాల ప్రకటనలు నెరవేరకపోగా.. ప్రస్తుతం సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవతో ఈ కల నెరవేరుతోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌తెలిపారు. సైయంట్‌ సంస్థ ప్రస్థుతం 70శాతం స్థానికులకే ఉద్యోగావకాశం కల్పించనుందని చెప్పారు. సైయంట్‌ సంస్థ ఫౌండర్‌ బీవీఆర్‌.మోహన్‌రెడ్డి, మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 24వ కేంద్రం, దేశంలో 12వ కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటుచేసిందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దల పద్మ, నగర మేయర్‌ నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, సీపీ సుధీర్‌బాబు, కార్పొరేటర్‌ జోరిక రమేశ్, టీపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ రాథోడ్, సైయంట్‌ సంస్థ వైస్‌ చైర్మన్లు సునీల్‌కుమార్, నర్సింహన్, నాయకులు ఎల్లావుల లలితాయాదవ్, బైరి కొమురయ్య, మద్దెల నారాయణస్వామి, రవి, శివ, వీరేశ్, రవీందర్, దేశిని హన్మంతరావు, వనంరెడ్డి, బుద్ద వెంకన్న, శంకర్, వినోద్‌ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top