పచ్చబస్సు కోసం ఎన్నేళ్లు..?

పచ్చబస్సు కోసం ఎన్నేళ్లు..? - Sakshi


► 40 గిరిజన గ్రామాలకు బస్సు సౌకర్యం కరువు

► ఆటోలే దిక్కు

► గిరిజనులకు తప్పని ఇబ్బందులు




జియ్యమ్మవలసః నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మిపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాలలో చాలా గ్రామాలకు రహధారులు లేక మరికొన్ని గ్రామాలకు రహధారులున్నా పచ్చబస్సు యోగం లేదు. అప్పుడప్పుడూ వచ్చే ఆటోల్లో గ్రామీణులు ప్రమాదకర ప్రయాణం చేయాల్సిన పరిస్ధితి నెలకొంది. ప్రజాప్రతినిదులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బస్సు సౌకర్యానికి నోచుకోని గ్రామాల ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గంలో సుమారు 140 పంచాయితీలుండగా 40 గ్రామాలకు బస్సులు నడపడం లేదని అంటున్నారు. మండలంలో 31 పంచాయితీలున్నాయి. అందులో 5 పంచాయితీలు పూర్తిగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది.



దాదాపు అన్ని గ్రామాలకు తారు రోడ్లు ఉన్నాయి. కానీ బస్సులు మాత్రం రావు. మండలంలోని పిటిమండ, టికేజమ్ము, కొండచిలకాం పూర్తి అటవీ ప్రాంతం కాగా అందులో 10 గ్రామాలకు రహధారులు అంతగా లేవు. వాటికి ఆటోలు కూడా పోవు. తారురోడ్డు ఉన్నగ్రామాలకు కూడా బస్సు సౌకర్యం నిలిపివేసారు.కొండచిలకాం పంచాయితీలో ద్రాక్షణి,నిడగళ్లుగూడ,పిటిమండ పంచాయితీలో నడిమిసిరిపి, కొండసిరిపి, బాపన్నగూడ, దీశరగూడ, టికేజమ్ము పంచాయితీలో కొన్ని గ్రామాలకు రహధారి సౌకర్యం లేక బస్సులు రాకపోగా పాండ్రసింగి,పిటిమండ,టికేజమ్ము తదితర గ్రామాలకు తారురోడ్డు ఉన్నప్పటికి బస్సులు రావడం లేదని గిరిజనులు వాపోతున్నారు. వీరికి కాలినడకే దిక్కు. గతంలోపిటిమండ, కొండచిలకాం, టికేజమ్ము పంచాయితీ వరకు బస్సులు నడిచేవని ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు ఆపేసారు.మిగిలిన పల్లెలకు బస్సులే వెళ్లవు.



గిట్టుబాటు కాదట..: ఈ మార్గాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ విముఖత చూపుతోంది. ఈపీకే(ఎర్నింగ్‌ ఫర్‌ కిలోమీటరు) గిట్టుబాటు కాకనే తాము బస్సులను నడపడం లేదని అధికారులు తమతో అన్నట్లు గిరిజన నాయకులు అంటున్నారు. దానికి తోడు ఆటోలతో తమకు నష్టాలు తప్పవని అంటున్నారు. అన్నీ లాభాపేక్షతోనే చూస్తే ఇక ప్రభుత్వం దేనికని గిరిజనం ప్రశ్నిస్తున్నారు.



రైతులకు తప్పని ఇక్కట్లు: ఈ మార్గాల్లోని రైతులు పండించే పంటలను మార్కెట్‌కు తరలించడం కష్టంగా మారింది. దీంతో రైతులు వాణిజ్య పంటలకు స్వస్తిపలికారు. ఒకవేళ పండించినా కాలినడకనే జరుగుతుంది. ఆటోలు కూడా వెళ్లకపోవడం వలన నానా అవస్ధలు పడుతున్నారు. ఎవరికైనా అనారోగ్యం చేస్తే డోలీలపై వెళ్లాల్సిందేనని అంటున్నారు. అటవీ ప్రాంత గ్రామాల బాలికలను తల్లిదండ్రులు పాఠశాలలు,కళాశాలలకు సైతం పంపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఆలోచించి ఈ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని సంబంధిత గ్రామాల వారు కోరుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top