పనులు సరే.. వేతనాలు ఎప్పుడు?

పనులు సరే.. వేతనాలు ఎప్పుడు? - Sakshi


► ఆరు నెలలుగా ఉపాధి వేతనాలు లేవు

► నియోజకవర్గంలో ఉపాధి వేతనదారుల అగచాట్లు

► సమాధానం చెప్పని అధికారులు....




పాలకొండ రూరల్‌: రెక్కాడితేగాని డొక్కాడని వేతనదారులకు ఉపాధి సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో వందలాది వేతనదారులు ఉసూరుమంటున్నారు. దాదాపు 5 నెలలుగా తమ వేతనాలు అందటం లేదని వాపోతున్నారు. 2016 డిశంబర్‌ నుండి ప్రస్తుత వేసవి వరకు దాదాపు వేతనాలు అందటం లేదని చెబుతున్నారు. వేసవిలో ఎండలో మండిపోతూ రెక్కలు ముక్కలు చేసుకుని జాతీయ ఉపాధిహామీ పనులు చేస్తున్నా అధికారులు స్పందించకపోవటంపై విమర్శలు గుప్పిస్తున్నారు.



లక్షల్లో బకాయిలు...: పాలకొండ నియోజకవర్గంలో ఉపాధి వేతనాలు లక్షల్లో బకాయిలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 శాతం ఉపాధి పనులపై ఆధారపడుతున్నారు. ఒక్కో మండలంలో 4 నుండి 5వేల మందికి జాబ్‌కార్డులు ఉండగా మొత్తంగా 4 మండలాల్లో సుమారు మండలానికి వంద వంతున చెరువులు, కాలువలు, రహదారుల పనులు జరుగుతున్నాయి. వీటి సంబంధించి వేతనాలు లేవు. దీనికితోడు ఇటీవల రోడ్ల ప్రక్కన వేసిన మొక్కలకు, వాటికి అమర్చిన ట్రీ గార్డులకు, నిత్యం అందించిన నీటి వసతులకు సంబంధించిన వేతనాలు అందించకపోవటంతో లక్షల్లో వేతనాలు బకాయిలు ఉన్నాయి.



పాలకొండ మండలంలో 5 వేల మంది వేతనదారులకు 38 పనులకు సంబంధించి రూ.63 లక్షలు, ఏజెన్సీ సీతంపేటలో రూ.19 లక్షల 5వేలు, భామినిలో రూ.11లక్షల 50 వేలు, వీరఘట్టంలో దాదాపు రూ.11 లక్షలవరకు బకాయిలు ఉన్నట్లు వేతనదారులు చెబుతున్నారు. వేతనాలకోసం సీఎఫ్‌ల వద్ద వేతనదారులు ప్రస్తావిస్తే వారు సరైన సమాధానం చెప్పకపోగా కసురు కోవటంతో మండల ఉపాధి కార్యాలయాల చుట్టూ వేతనదారులు తిరుగుతున్నారు. గతంలో ఇచ్చిన స్లిప్‌లు కూడా ఇవ్వకపోవటంతో తాము 5 నెలలు ఎంతపని చేశామో, ఎంత వేతనం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల పనులు నిలిపేశారు.



నగదు లావాదేవీల్లో..: గత కొద్ది రోజులుగా ట్రజరీ, బ్యాంకుల ద్వారా నగదు లావాదేవీలు సక్రమంగా జరగకపోవటం, ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవటంతో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య నెలకొంది. ఉపాధి వేతనాల నగదు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాలేదని, పోస్టల్, బ్యాంకులకు జమ చేసినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా వేతనదారుల ఖాతాలకు జమకాలేదని ఉపాధి అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా తాము కష్టిస్తున్న పనికి వేతనాలు తక్షణం చెల్లించాలని, తమ సమస్యలు గుర్తించాలని వేతనదారులు కోరుతున్నారు.

–ఐదు నెలలుగా: ఐదు నెలలుగా వేతనాలు లేవు. బతకటం ఎలా. సీఫ్‌కు అడిగితే కసురుకుంటుంది. తినడానికి తిండి లేని పరిస్థితి. పిల్లలకు ఫీజులు చెల్లించలేకపోతున్నాం. నరకం చూస్తున్నాం. అధికారులు స్పందించాలి. ---వావిలపిల్లి సూరమ్మ, అట్టలి,పాలకొండ మండలం...



–వలసపోవాలి: కష్టపడుతున్నా వేతనం లేదు. ఉపాధిపనులు నమ్ముకుని బతుకుతున్నాం. ఇన్నాళ్లు వేనాలు చెల్లించకపోతే కుటుంబాలను ఎలా నెట్టుకొస్తాం. అధికారులు స్పందించుట లేదు. వేతనాల కోసం మండల కేంద్రాల్లో బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ---పార్వతి, ఉపాధి వేతనదారు. పాలకొండ మండలం...



పట్టించుకోవటం లేదు:  అసలే దివ్యాంగుడిని. అటుపై ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాను. గడిచిన ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. నాబాధ చెప్పుకోలేను. మూగవాడిని కావడంతో ఇబ్బంది పడుతున్నాను. --- జగన్, దివ్యాంగ వేతనదారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top