మొక్కుబడి విధులు!

మొక్కుబడి విధులు! - Sakshi


మిడ్జిల్‌ మండలంలో సర్కార్‌ చదువుకు సుస్తీ

తేటతెల్లం చేసిన వల్లభ్‌రావుపల్లి పాఠశాల ఘటన..

సమయపాలన పాటించని ఉపాధ్యాయులు

నిరుపేద పిల్లల దృష్టి ప్రైవేట్‌ పాఠశాలల వైపు

•  అధికారులు నిఘా పెట్టాలంటున్న తల్లిదండ్రులు




ఐదవ తరగతి అంటే ఆ విద్యార్థి స్పష్టంగా ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో రాయరావాలి. అనర్ఘళంగా చదవాలి. కానీ మిడ్జిల్‌ మండలం వల్లభ్‌రావుపల్లి ప్రాథమిక పాఠశాలలో కనీసం పేరు రాయరాకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్‌కే ఈ ఘటన ఎదురవడం గమనార్హం. దీనికి ఎవరు బాధ్యులనేది పక్కనపెడితే.. సర్కారు పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మిడ్జిల్‌ : నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే మండలంలో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కుబడి విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు చాలారోజులుగా ఉన్నాయి. మిడ్జిల్‌ మండలంలో 22 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 4 ఉన్నత పాఠశాలలు, ఒక కస్తూర్భా విద్యాలయం ఉంది. ఇందులో రెండు సక్సెస్‌ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 2,592మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1114 మంది బాలురు, 1478 మంది బాలికలు ఉన్నారు. మండలంలోని మొత్తం 34 పాఠశాలల్లో ఇంతమంది ఉంటే.. మండల కేంద్రంలోని మూడు ప్రైవేట్‌ పాఠశాలల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు ఉన్నారు. వీరే కాక ప్రతిరోజూ జడ్చర్ల, మహబూబ్‌నగర్‌కు వందలాది మంది విద్యార్థులు వెళ్తున్నారు.



తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య

మిడ్జిల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మర్లబావితండాలో  మంగళవారం ఉదయం 9.30 అవుతున్నా  ఓ ఉపాధ్యాయురాలు విధులు హాజరుకాలేదు. విద్యార్థులు గదిలో ఖాళీగా కూర్చున్నారు. ఇలా సర్కారు బడులలో పనిచేసే చాలామంది ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యబోధన చేయకపోవడంతో పాటుగా కాలయాపనకే పరిమితం కావడంతో, రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. చాలామంది టీచర్లు సొంత వ్యాపాకాలలో మునిగి తేలుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని వల్లభ్‌రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు ఉండగా, దాదాపు 90మంది విద్యార్థులు ఉన్నారు. అందులో దాదాపు  75శాతం మంది విద్యార్థులు వారిపేర్లు, తల్లిదండ్రుల పేర్లు రాయరాని పరిస్థితుల్లో ఉన్నారు.


ఇటీవల ఇదే మండలంలోని కస్తూర్బా పాఠశాలలో డీఈఓ సోమిరెడ్డి తనిఖీ చేసి విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. చాలామంది సమాధానం చెప్పకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలని ఆదేశించారు. మండలంలో దాదాపు 50శాతం పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నా.. పట్టించుకునే వారు కరువవడంతో కూలీ నాలిచేసే తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని ప్రైవేట్‌  పాఠశాలలో చదివించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ ఐదవ తరగతిలో కూడా పేరు కూడా రాయరాని పరిస్థితులు ఉండడంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రాథమికస్థాయినుంచి ఇంగ్లిష్‌ మీడియంలో ఉంచేందుకు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు.



నా ఇద్దరి పిల్లలకు  అక్షరాలు నేర్పించలేదు

నా ఇద్దరు కొడుకులు శివకుమార్‌ ఐదవ తరగతి, బాలిశ్వర్‌ రెండవ తరగతి చదువుతున్నారు. ఇద్దరికి కూడా వారి పేర్లు రాయారాని పరిస్థితి ఉంది. పాఠశాలలో పనిచెసే ఉపాధ్యాయులు వారి కొట్లాటలకే పరిమితమవుతున్నారు. వారి మధ్య ఆధిప్యత పోరు నడుస్తున్నది. మధ్యలో పిల్లలను వదిలేశారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాను. – మైబు, విద్యాకమిటీ

చైర్మన్, వల్లభ్‌రావుపల్లి పాఠశాల



ఆ..ఐదుగురికి సస్పెన్షన్‌ ఆర్డర్ల అందజేత

మిడ్జిల్‌ మండల పరిధిలోని వల్లభ్‌రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు సైతం తమ పేరు రాయలేని పరిస్థితికి బాధ్యులైన ఐదుగురు ఉపాధ్యాయులకు సస్పెన్షన్‌ ఆర్డర్లను మంగళవారం అందించారు. కలెక్టర్‌ తనిఖీలో విద్యార్థులు కనీసం పేర్లు కూడా రాయలేదు. దీంతో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఆగ్రహంవ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు రాజలక్ష్మి, శ్వేత, భానుప్రకాష్, సతీష్‌కుమార్, విదాయతుల్లాఖాన్‌లను సస్పెండ్‌ చేయాలని అక్కడే ఉన్న డీఈఓను ఆదేశించిన విషయం తెలిసిందే. జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి సంబంధిత సస్పెన్షన్‌ ఆర్డర్లు మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయానికి వచ్చాయి. పాఠశాలకు వచ్చిన ఆ..ఐదుగురు ఉపాధ్యాయులకు కార్యాలయం సీఆర్‌పీ సస్పెన్షన్‌ ఆర్డర్లు అందజేశారు. ఆర్డర్లు తీసుకున్న ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోయారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top