పాపం లక్ష్మవ్వ..

పాపం లక్ష్మవ్వ.. - Sakshi


80 ఏళ్ల వయసులో చేరదీసేవారు కరువు

సరైన గూడు లేదు.. తినడానికి పట్టెడన్నం లేదు.. ఒక్కగానొక్క కొడుకు రెక్కలొచ్చి పట్నం పోవడంతో తను ఒంటరి. ఎనిమిదేళ్లుగా అనాథగానే బతుకుతోంది. పరిగికి చెందిన లక్ష్మవ్వకు 80 ఏళ్లు. రెండేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. అప్పటి నుంచి కదల్లేదు. ఎవరైనా ముద్ద పెడితే తింటుంది.. లేకుండే పస్తుంటుంది. మంగళవారం రాత్రి జోరు వానకు ఉన్న చిన్నపాటి పాక పూర్తిగా కురిసింది. రాత్రంతా తడిసి ముద్దయిన ఈమెను చూసి చుట్టుపక్కల వాళ్లు చలించి సపర్యలు చేశారు. - పరిగి


లక్ష్మవ్వకు ఓ కుమారుడు, కూతురు ఉండగా.. కూతురు గతంలోనే కన్నుమూసింది. కొడుకు పెళ్లయిన కొన్నేళ్లకు భార్య, పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఎనిమిదేళ్లుగా నాఅన్న వాళ్లెవరూ చూసేందుకు రాలేదని చెబుతోంది లక్ష్మవ్వ. రెండేళ్లుగా పరిగిలోని బీసీ కాలనీలో ఉంటున్న ఆమెకు స్థానికులే తినేందుకే అదోఇదో ఇస్తుంటారు. వారిని నమ్ముకునే లక్ష్మవ్వ బతుకుతోంది. మంగళవారం రాత్రి పరిగిలో జోరువాన కురిసింది. ఆమె పాక పూర్తిగా తడిసి పోయింది. ఇంట్లోకి నీళ్లొచ్చాయి. దీంతో ఆమె తడిసి ముద్దయింది. వణుకుతూ పాక గడపపై కూర్చున్న ఆమె సాయం కోసం చూస్తుండగా ఆ వార్డు సభ్యుడు రాజు, ఎంపీటీసీ సభ్యుడు సమద్‌లు స్థానికులతో కలిసి ఆమెకు దుస్తులు మార్పించారు. భోజనానికి ఏర్పాట్లు చేశారు.


రెండేళ్ల క్రితం సచ్చి బతికిన లక్ష్మవ్వ!

రెండేళ్ల క్రితం లక్ష్మవ్వ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బంధువులు, కాలనీ వాసులు, తెలిసిన వాళ్లంతా వచ్చేశారు. ఆమెను ఖననం చేసేందుకు గోతి కూడా తవ్వారు. మ రో అరగంటలో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే బంధువులు మీద పడి ఏడుస్తున్న సమయంలో లక్ష్మవ్వ లేచి కూర్చుంది. అందరిలో ఆశ్చర్యం. తవ్విన గోతిని ఖాళీగా పూడ్చటం అరిష్టమని అందులో కోడిని వేసి పూడ్చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top