కొత్త డీసీసీలు లేనట్లే

కొత్త డీసీసీలు లేనట్లే


► ఇక నియామకమే అన్న తరుణంలో వాయిదా వేసిన అధిష్టానం

► సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం తరువాతే అధ్యక్షుల నియామకం

► అప్పటిదాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా మహేశ్వర్‌రెడ్డి కొనసాగింపు




సాక్షి, నిర్మల్‌: జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తరువాత కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జిల్లాలకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ(డీసీసీ) నియామకంలో దోబూచులాట కొనసాగుతోంది. త్వరలో డీసీసీ, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీల నియామకం జరుగుతుందని చెప్పడం, ఆ తరువాత వాయిదా వేయడం జరుగుతూ వస్తోంది. ఇటీవల మాత్రం నియామకాలు దాదాపు ఖరారయ్యే దశకు వచ్చినట్లు పార్టీలో చర్చ సాగింది. దీంతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇలా డీసీసీలపై ప్రకటన ఎప్పుడు వెలువడుతుందని శ్రేణులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా అధిష్టానం ఈ ప్రక్రియను తాతాల్కికంగా వాయిదా వేసింది. దీంతో ఆశవాహుల పదవీ కాంక్షపై నీళ్లు చల్లినట్‌లైంది.



సభ్యత్వం, సంస్థాగత నిర్మాణం తరువాతే

కాంగ్రెస్‌ పార్టీలో సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం తరువాతే జిల్లాలకు డీసీసీలను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్‌ ఎం.రామచంద్రన్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం సభ్యత్వ నమోదు పూర్తి చేసి సంస్థాగతంగా నిర్మాణం చేయాలనే పార్టీ ఎన్నికల కమిటీ నిర్ణయం మేరకు అధిష్టానం ఈ చర్యలకు దిగినట్లు పేర్కొంటున్నారు.


సభ్యత్వ సేకరణ ఇదివరకే జరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 16 లక్షలు సభ్యత్వమే జరగడంతో దానిని మరింత పెంచాలని నిర్ణయించారు. అదేవిధంగా బూత్‌ లెవల్‌ నుంచి గ్రామ, మండల, బ్లాక్‌ కాంగ్రెస్, టీపీసీసీ, ఏఐసీసీ సభ్యుల నియామకాలు జరిపి సంస్థాగత నిర్మాణం చేసిన తరువాతే డీసీసీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానం నిర్ణయించినట్లు చెబుతున్నారు. సెప్టెంబర్‌ 20 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేసి డీసీసీలను నియమించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.



పలువురు ఆశవాహులు

ఉమ్మడి జిల్లాకు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లా ఇన్‌చార్జిగా సబితాఇంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత ఆయా జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో పార్టీ పరంగా గాంధీభవన్‌లో చర్చలు జరిగాయి. తెలంగాణ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో జిల్లాల వారీగా చర్చలు చేశారు. మొదట్లో డీసీసీ అ«ధ్యక్షుడిగా నియమితులయ్యే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని అధిష్టానం పేర్కొనడంతో పార్టీ నాయకుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.


కాగా, తాజాగా ఆ నిబంధన విషయంలో అధిష్టానం దిగివచ్చింది. డీసీసీ అధ్యక్షులు కూడా ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని ప్రకటించడంతో ఇప్పుడు జిల్లాల్లో పలువురు ప్రధాన నేతలు కూడా పదవిపై ఆశలు పెంచుకున్నారు. కాగా, అంతకుముందు పలువురు ఉమ్మడి జిల్లా నేతలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డినే ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించాలని అ«ధిష్టానాన్ని కోరారు.


అయితే జిల్లాల వారీగా ఎప్పటికైనా అధ్యక్షుల నియామకం చేయాల్సిందేనని, ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డిని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జిగా నియమించే విషయంలో అధిష్టానం వద్ద చర్చలు సాగినట్లు నాయకులు పేర్కొంటున్నారు. అదే సమయంలో నిర్మల్‌ జిల్లాకు రామారావుపటేల్, తక్కల రమణారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాకు భార్గవ్‌దేశ్‌పాండే, గండ్రత్‌ సుజాత, నరేశ్‌జాదవ్, మంచిర్యాల జిల్లాకు అరవిందరెడ్డి, ప్రేమ్‌సాగర్, కుమురంభీంకు ఆత్రం సక్కు, సిడాం గణపతి పేర్లు పరిశీలనకు వచ్చినట్లు తెలుస్తోంది.



ప్రస్తుతానికి మహేశ్వర్‌రెడ్డికే పగ్గాలు

సెప్టెంబర్‌ చివరిలో లేనిపక్షంలో అక్టోబర్‌లో కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు ఉమ్మడి జిల్లాలో మహేశ్వర్‌రెడ్డి చేతిలోనే పగ్గాలు ఉండనున్నాయి. ఇదిలాఉంటే జూన్‌లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలలో ఎవరైనా ఈ సభకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.


దీంతో ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ అధిష్టానం పాతకాపులపైనే నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా పరంగా ఇదివరకు నిర్మల్‌ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించే పర్యటనను విజయవంతం చేయడంతో పాటు ఆదిలాబాద్, నిర్మల్‌లో రైతులు, విద్యార్థుల కోసం నిరాహార దీక్షలు చేపట్టి భారీ సభలు నిర్వహించిన దృష్ట్యా మహేశ్వర్‌రెడ్డిపైనే భరోసా ఉంచి జిల్లా నుంచి సభకు పెద్ద ఎత్తున శ్రేణులను సమీకరించే బాధ్యత ఉంచినట్లు తెలుస్తోంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top