బ్లడ్‌ బ్లాంక్‌!

బ్లడ్‌ బ్లాంక్‌!


► సాయంత్రం 4 దాటితే రోగులకు కష్టాలు



నెల్లూరు(అర్బన్‌): సాయంత్రం 4 గంటలు దాటిందా.. ఇక నెల్లూరు పెద్దాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో భూతద్దం పెట్టి వెతికినా డాక్టర్‌ కనిపించరు. నిబంధనల ప్రకారం ఒక డాక్టర్, ఒక టెక్నీషియన్, నర్సింగ్‌ సిబ్బంది తప్పనిపరిగా 24 గంటల పాటు అందుబాటులో ఉండాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. దీంతో పొరపాటున ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే దానికి బాధ్యులెవరన్నది ప్రశ్నగా మిగులుతోంది.  పైగా రోగులకు రక్తం అవసరమైతే రీప్లేస్‌ ఇస్తేనే రక్తం ఇస్తామని డాక్టర్లు రోగి బంధువులను పీడిస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.



నిబంధనలు ఏమంటున్నాయంటే..: రక్తం ఇవ్వాలంటే రోగి రక్తాన్ని, దాత రక్తంతో క్రాస్‌ మ్యాచింగ్, హెచ్‌ఐవీ, మలేరియా, కామెర్లు, హెపటైటిస్‌ బి లాంటి పరీక్షలన్నీ టెక్నీషియన్‌ మాత్రమే చేయాలి. బ్లడ్‌బ్యాంక్‌కు ఇన్‌చార్జ్‌లుగా ప్రతి రెండు నెలలకు ఇద్దరు డాక్టర్లను నియమిస్తున్నారు. కొంత మంది డాక్టర్లు నిజాయితీగా పనిచేస్తే కొంతమంది ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తూ బ్లడ్‌బ్యాంక్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నారు.



గతంలో బలిపశువైన నర్సు: గతంలో దాతలిచ్చిన రక్తాన్ని బయట అమ్ముకోవడంలో నర్సును బలిపశువును చేశారు. ఇప్పుడు కూడా జరగరానిదేమైనా జరిగితే బలయ్యేది మొదట నర్సే. అసలు నిబంధనల ప్రకారం డాక్టర్, టెక్నీషియన్‌ను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని రోగులు డిమాండ్‌ చేస్తున్నారు.



పీడిస్తున్న డాక్టర్లు: గతంలో బ్లడ్‌ బ్యాంకు ఇన్‌చార్జిగా డాక్టర్‌ కృష్ణమూర్తి ఉన్నప్పుడు రక్తం యూనిట్లు సమృద్ధిగా ఉండేవి. నేడు అరకొరగా మాత్రమే ఉంటున్నాయి. క్యాంపులు సరిగా నిర్వహించడం లేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే నిరుపేద రోగి బంధువులనే రక్తం రీప్లేస్‌ ఇవ్వాలని పీడిస్తున్నారు. కలెక్టర్‌ ఇటీవల బ్లడ్‌ బ్యాంక్‌ను తనిఖీ చేసి నిల్వలు అధికంగా ఉండాలని ఆదేశించడంతో రోగుల బంధువులనే పీడిస్తున్నారు. ప్రస్తుతం 74 రక్తం యూనిట్లు నిల్వ ఉన్నాయి. అయినా రోగులకు సక్రమంగా ఇవ్వడం లేదు.



రెండు ఉదాహరణలు..: ఇటీవల  నెల్లూరు గాంధీనగర్‌కి చెందిన నిరుపేద గిరిజనుడు సుబ్రహ్మణ్యం తనతో పాటు మరో బంధువుని తీసుకెళ్లి రెండు ప్యాకెట్లు రక్తం రీప్లేస్‌మెంట్‌  ఇస్తేగాని రక్తం ఇవ్వలేదు. ప్రస్తుతం మహిళా సర్జికల్‌ వార్డులో అడ్మిట్‌ అయిన ఆరో నంబర్‌ బెడ్‌ బంధువులు రెండు ప్యాకెట్లు రక్తం రీప్లేస్‌ ఇచ్చి తరువాత బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి రక్తాన్ని తెచ్చుకున్నారు. అయినా ఆమెకు రక్తం సరిపడా లేదనే నెపంతో పది రోజులుగా ఆపరేషన్‌ వాయిదా వేసుకుంటూ వస్తున్నారు.



ఏం జరుగుతోందంటే..: సాయంత్రం 4 గంటల తర్వాత బ్లడ్‌బ్యాంకులో డాక్టర్‌ ఉండటం లేదు. మూడు నెలల క్రితం వరకు రాత్రి పూట కూడా టెక్నీషియన్‌ ఉండేవారు కాదు. దీంతో చాలా రోజుల పాటు ఆందోళన గురైన నర్సులు పోరాడి ఇటీవల రాత్రి పూట పని చేసేందుకు ఒక టెక్నీషియన్‌ను నియమించుకున్నారు. ఆ వ్యక్తే ప్రతి రోజూ రాత్రి డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో నైట్‌ డ్యూటీ చేసే టెక్నీషియన్‌ సెలవులు పెట్టినా, ఆఫ్‌ తీసుకున్నా మళ్లీ నర్సులే టెక్నీషియన్‌గా మారుతున్నారు. నర్సులు.. డోనార్‌ కేర్, ఫారమ్‌ నింపడం, వస్తువులను శుభ్రంగా ఉంచుకోవడం, రక్తం ఇచ్చిన దాతలకి కళ్లు, తల తిరిగినట్టు అనిపిస్తే సేవలు చేయాలి. నర్సులు తమ పనులతో పాటు టెక్నీషియన్‌ పనులు చేయాల్సి రావడంతో ఏదైనా జరిగితే తామెందుకు బాధ్యత వహించాలని ప్రశ్నిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top