కంచికి చేరని కరెన్సీ కష్టాలు

కంచికి చేరని కరెన్సీ కష్టాలు


ఐదు నెలలు దాటినా తీరని వెతలు

మళ్లీ నవంబర్‌ నాటి పరిస్థితులు

ఏటీఎంలలో నో క్యాష్‌ బోర్డులు

బ్యాంకుల్లో అడుగంటిన నగదు నిల్వలు

మళ్లీ పడిపోతున్న వ్యాపారాలు




పెద్ద నోట్ల రద్దు.. ప్రజలెవ్వరూ ఊహించని పరిణా మం. ఆర్థిక వ్యవస్థ మూలాలనే కదిలించిన నిర్ణయం. నెలలు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడంలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు పేరుతో మార్చిలో బ్యాంకులు విధించిన ఆంక్షలు.. ఏప్రిల్‌లో కూడా కొనసాగిస్తుండడంతో కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏ ఏటీఎం వద్దకెళ్లినా నోక్యాష్‌ బోర్డులు దర్శనమిస్తుంటే.. అడుగంటిన నగదు నిల్వల కారణంగా బ్యాంకుల్లో సైతం ఆర్థిక లావాదేవీలు తగ్గిపోయాయి. మళ్లీ నవంబర్‌ నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి.



విశాఖపట్నం/విశాఖ సిటీ : జిల్లాలో ప్రతిరోజు కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు కనీసం రూ.50కోట్ల మధ్య లావేదేవీలు జరగని పరిస్థితి కన్పిస్తోంది. జిల్లాలో 1100 ఏటీఎంలుండగా.. వాటిలో కనీసం వంద ఏటీఎంల్లో కూడా డబ్బుల్లేని పరిస్థితి. గడిచిన 20 రోజుల్లో ఆర్‌బీఐ నుంచి జిల్లాకు రూ.350 కోట్ల కరెన్సీ వచ్చింది. ఈ మొత్తంలో 70 శాతం ఏటీఎంలకు తరలించగా.. 30 శాతం మాత్రమే బ్యాంకుల్లో ఉంచారు. ఏటీఎంల్లో క్యాష్‌ దాదాపు పూర్తి కావడంతో అన్ని నో క్యాష్‌ బోర్డులతో వెక్కిరిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు అడుగంటడం, డిపాజిట్లు పెద్దగా లేకపోవడంతో నగదు చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్నారు.



రూ.పది వేలు అడుగుతున్న వారికి ఐదువేలు.. ఐదు వేలు అడుగుతున్న వారికి రెండు వేలతో సరిపెడుతున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందు జిల్లాలో 10 నుంచి 15 శాతం మాత్రమే ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగేవి. ప్రస్తుతం ఆన్‌లైన్‌ లావాదేవీలు 40 శాతం పెరిగాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా మాత్రం 25 శాతం మించి జరగడం లేదు. ఏటీఎం కార్డుపై నగదురహిత లావాదేవీలు చేసేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడతున్నారు. ఉన్నత విద్యావంతులు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కాస్తో కూస్తో ఆన్‌లైన్‌ లావాదేవీలతో బండినెట్టుకొస్తున్నా.. చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నరకయాతన పడుతున్నారు. ఆన్‌లైన్‌ చెల్లింపులు ఎలా చెయ్యాలో తెలీక.. సరైన సమయానికి డబ్బులు అందక వేలాది మంది మనోవేదనకు గురవుతున్నారు. సాంకేతిక లోపాల కారణంగా చెల్లింపులు జరిగినట్టుగా మెస్సేజ్‌ రావడం.. తీరా అవతల ఖాతాలకు జమ కాకపోవడంతో డబ్బు ఏమైయ్యాయో తెలియక గగ్గోలు పెడుతున్నారు.



తగ్గిన స్వైపింగ్‌ వినియోగం

పెద్దనోట్ల రద్దుకు ముందు 6,084 స్వైపింగ్‌ మెషిన్లు జిల్లాలో ఉండేవి. ఆ తర్వాత వాటి సంఖ్య 9 వేలకు చేరినప్పటికి ప్రస్తుతం వినియోగంలో 4 వేలకు మించిలేవు. వేలిముద్ర ద్వారా నగదు చెల్లింపుల కోసం ఇటీవల ప్రారంభించిన ‘భీమ్‌యాప్‌’డివైస్‌లకు డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పటి వరకు 600 వరకు మాత్రమే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. స్వైపింగ్‌ మెషిన్ల స్థానే వీటిని తీసుకురావాలంటే కనీసం 40 వేల డీవైఎస్‌లు అవసరమని అంచనా వేస్తున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్‌లలో దాదాపు 80 శాతం మేర పడిపోయిన వ్యాపారాలు.. జనవరిలో కాస్త గాడిలో పడ్డాయి. ప్రస్తుతం 50 నుంచి 60 శాతానికి మించి వ్యాపార లావాదేవీలు జరగడం లేదని వ్యాపారవర్గాలు వాపోతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top