బీజేపీతో పొత్తు ఉండదు..

బీజేపీతో పొత్తు ఉండదు.. - Sakshi


మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి  

112 అసెంబ్లీ, 16 ఎంపీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పోటీ  

ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానం ఎంఐఎంకు..




సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌:  రాష్ట్రంలో ఏ ఎన్నికల్లో కూడా బీజేపీతో తమకు పొత్తు ఉండదని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత, మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌లోని తన స్వగృహంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 112అసెంబ్లీ, 16 పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందని అన్నారు. మిగతా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్‌ స్థానం ఎంఐఎంకు కేటాయించనున్నట్లు తెలిపారు. గంగ, యమున తహజీబ్‌ మాదిరిగా ఎంఐఎంతో మాత్రమే తమపార్టీ పొత్తు ఉంటుందని చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అంశాల వారిగానే తమ పొత్తు ఉంటోందని అన్నారు. 



ఇక.. టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలోకి ఏ ఒక్క నాయకుడు కూడా చేరబోరన్నారు. కేవలం మీడియాను అడ్డుపెట్టుకుని బీజేపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందన్నారు. అదే విధంగా పాలమూరు జిల్లాలో అఖిలపక్షం పేరిట అన్నిపార్టీలు కలిసి చేసిన ధర్నాలో అర్థంలేదని ఎద్దేవా చేశారు. పనిలేని వారంతా కలిసి ప్రజల్లో లేనిపోని అపోహలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి నుంచి డిండికి 0.5టీఎంసీ నీటి తరలింపు వల్ల పాలమూరు ఆయకట్టుకు ఎలాంటి నష్టం ఉండదని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7.5లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి తీరుతామన్నారు. అభివృద్ధి సూచీలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన ర్యాంకింగ్‌లో 20.7శాతంలో మొదటి స్థానంలో నిలిచినట్లు వివరించారు. రెండో స్థానంలో నిలిచిన ఛత్తీస్‌గఢ్‌ కేవలం 10.6శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదు చేసిందన్నారు.  



అన్యాయాన్ని చక్కదిద్దుతున్నాం  

60ఏళ్లుగా జిల్లాకు జరిగిన అన్యాయాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. సమైక్య పాలకుల హయాంలో ఉమ్మడి పాలమూరులో లక్ష ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరిచ్చారని చెప్పారు. తమ ప్రభుత్వం కేవలం మూడున్నర ఏళ్లకాలంలోనే పాలమూరు ఆయకట్టును 4.5లక్షల ఎకరాలకు తీసుకెళ్లామన్నారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నిర్దేషిత కాలంలో పూర్తి చేసి 7.5లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామన్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రాజెక్టుల టెండర్లలో అవకతవకలు జరిగితే తన వద్ద ఉన్న ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చన్నారు. కానీ రైతుల పేర్లు చెప్పుకుంటూ కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టు పనులకు అడ్డు తగులుతున్నారని విమర్శించారు.



75 సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాం..

దేశ చరిత్రలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో 75సంక్షేమ పథకాలను సీఎం అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షోభం నుంచి వ్యవసాయరంగాన్ని గట్టెక్కించడం కోసం ప్రాజెక్టుల నిర్మాణం, పెట్టుబడి, ధాన్యానికి మద్దతు ధర అనే మూడు అంశాలతో ముందుకెళ్తున్నామన్నారు. వచ్చేసీజన్‌ నుంచి రైతన్నకు ప్రభుత్వమే పెట్టుబడి ఇస్తుందన్నారు. అందుకోసమే భూసమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌ 15నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వే కోసం జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరూ 3 గ్రామాలను తీసుకొని పర్యవేక్షించనున్నారని తెలిపారు. దీనిద్వారా బినామీ ఆస్తులన్నీ బయటపడతాయన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top