ఎన్‌ఎంసీతో వైద్యరంగాభివృద్ధి ప్రశ్నార్థకమే


  • ఐఏఎస్‌లకు ఆ బాధ్యతలు బరువే

  • ఐఎంఏలో అవినీతి ఉంటే ప్రక్షాళన చేయాల్సిందే

  • నూతన కౌన్సిల్‌పై విభేదిస్తున్న వైద్యులు 

  • కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : 

    ఐఏఎస్‌లతో నిర్వహించే నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌తో వైద్యరంగం మరిన్ని సమస్యల్లో చిక్కుకోనుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఆస్పత్రులు, వైద్యవిధానంలోని సాధకబాధకాలు ఐఏఎస్‌లకు ఏం తెలుస్తాయని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ను ప్రభుత్వం రద్దుచేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని వైద్యులు  తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు వైద్యులు ‘సాక్షి’తో వారి ఆవేదన పంచుకున్నారు. ఐఎంసీలో అవినీతి పెరిగిపోయిం దంటూ ప్రభుత్వం ఎన్‌ఎంసీని ఏర్పాటు చేస్తున్నది.  వైద్యులు సభ్యులుగా ఉన్న ఐఎంసీ వల్ల కాకుండా కలెక్టర్లు నిర్వహించే ఎన్‌ఎంసీ వల్ల సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవని వైద్యులు అంటున్నారు. అవినీతిని ప్రభుత్వం ప్రక్షాళన చేయాలికానీ, ఎవరి లబ్ధి కోసమో ఎన్‌ఎంసీ ఏర్పాటు, ఆ కార్యవర్గంలో ఐఏఎస్‌లతో పాటు ఖాళీగా ఉన్న కొందరు రాజకీయనాయకులతో దీన్ని ఏర్పాటుచేయడం మరిన్ని సమస్యలు పెంచుతుందన్నారు. వైద్యరంగంలో అవకతవకల నిరోధానికి ఎన్‌ఎంసీ ఏర్పాటు మంచిదే అయినా జిల్లా సమస్యలతో సతమతమయ్యే ఐఏఎస్‌ల వల్ల వైద్య రంగంలో అభివృద్ధి అంతంత మాత్రమే ఉంటుందన్నది వైద్యుల వాదన. ఇటీవలి కాలంలో ఆస్పత్రులపై పెరిగిన దాడుల వల్ల వైద్యులు, రోగులూ సైతం నష్టపోతున్నారన్నారు.   వైద్యులకు, ఆస్ప త్రులకు రక్షణ కల్పించే విధానం రావాలని, దీనికి ప్రభుత్వం కఠినచట్టం తేవాలని, అలాగే వినియోగదారుల హక్కుల చట్టంలో కొంత వెసులు బాటు కల్పించాలని, పలు తప్పిదాల వల్ల వేసే జరిమానాలు రూ.కోట్లలో ఉంటాయని, జీవిత కాలం వైద్యం చేసినా వైద్యుడు అంత సంపాదించలేడని వారు పేర్కొన్నారు. పీసీపీఎన్‌డీ చట్టంలో విధించే శిక్షణలను రద్దుచేయాలని, ఒకోసారి చిన్నచిన్న అక్షర దోషాల వల్ల వైద్యులు బలవుతున్నారని, రిసెప్షన్‌ కౌంటర్‌లో సిబ్బంది అక్షరదోషం రాస్తే దానికి వైద్యులు బాధ్యులవు తున్నారన్నారు. ఆరు నెలల శిక్షణ పూర్తిచేసిన వ్యక్తి వైద్యుడెలా అవుతాడు, పదేళ్లపాటు ఎన్నో కష్టాలకోర్చి వైద్య విద్యనభ్యసిస్తే కేవలం ఆరునెలల వ్యవధిలో శిక్షణ పూర్తిచేసిన వారికి వైద్యునిగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. దీనివల్ల పలు నష్టాలకు దారితీస్తుందన్నారు. 

     

    ఐఏఎస్‌లకు ఏం తెలుసు మా కష్టాలు

    వైద్యవృత్తి కత్తిమీద సాములా తయారైంది. మా వృత్తిలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నాయి. ఐఎంసీని రద్దుచేసి ఎన్‌ఎంసీని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఏర్పాటుచేస్తోంది? మా కష్టాలు ప్రభుత్వానికి పట్టవా. ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా దీనిపై పోరాడతాం. 

    – డాక్టర్‌ గురుప్రసాద్, ఐఎంఏ కార్యదర్శి, శ్రీహిత ఆస్పత్రి. 

     

    రాజకీయనాయకులకు పనికొస్తుంది

    కొత్తగా పెట్టే ఎన్‌ఎంసీలో వైద్యుల స్థానంలో ఐఏఎస్‌లు, ఖాళీగా ఉన్న రాజకీయనాయకులు భర్తీ అవుతారు. దీంతో ఉన్న సమస్య తీరకపోగా కొత్త సమస్య వస్తుంది. ఏౖదైనా అవినీతి జరిగితే ప్రక్షాళన చేయాలికాని ఈ విధానం సరికాదు.

    – డాక్టర్‌ కర్రి రామారెడ్డి. ప్రముఖ మానసిక వైద్యులు. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top