కొత్త జిల్లాలకు ఆర్టీసీ వీఎండీలు

కొత్త జిల్లాలకు ఆర్టీసీ వీఎండీలు

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, బస్సుల పంపకం పూర్తయింది. ఈమేరకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అవసరమైన ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్‌ నుంచి ఏర్పడుతున్న రెండు కొత్త జిల్లాలకు రీజినల్‌ మేనేజర్‌కు బదులుగా డివిజనల్‌ మేనేజర్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 11న వారు విధుల్లో చేరి బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. 

– మంకమ్మతోట

 

 

కరీంనగర్‌ నుంచి పెద్దపల్లి, జగిత్యాల రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు అవుతుండగా..  కొన్ని హుస్నాబాద్, హుజూరాబాద్‌ వంటి మండలాలు వేరే జిల్లాలో కలుస్తున్నాయి. జిల్లాల ఏర్పాటుతో ప్రస్తుతం కరీంనగర్‌ రీజియన్‌లో ఉన్న 11 ఆర్టీసీ డిపోలు విడిపోనున్నాయి. ప్రస్తుతం రీజియన్‌లో కరీంనగర్‌–1, కరీంనగర్‌–2, గోదావరిఖని, హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, మంథని, సిరిసిల్ల, వేములవాడ డిపోలతోపాటు ఆర్‌ఎం కార్యాలయాలు ఉన్నాయి. ప్రత్యేక జిల్లా కావడంతో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల డిపోలు జగిత్యాల జిల్లాలో ఉంటాయి. పెద్దపల్లి జిల్లాలో మంథని, గోదావరిఖని డిపోలు ఉండనున్నాయి. హుజూరాబాద్‌ ప్రాంతం వరంగల్‌ జిల్లాలో, హుస్నాబాద్‌ సిద్దిపేట జిల్లాలో కలవనున్నాయి. మిగిలిన కరీంనగర్‌ 1, కరీంనగర్‌ 2, సిరిసిల్ల, వేములవాడ డిపోలు మాత్రమే కరీంనగర్‌ జిల్లాలో ఉంటాయి. 

 

ఉద్యోగులు ఎక్కడి వారు అక్కడే...

కరీంనగర్‌ రీజియన్‌లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది ఎక్కడి వారు అక్కడే విధులు నిర్వహించనున్నారు. జిల్లా ఏర్పడినా అవసరం మేరకు ఉద్యోగులు, సిబ్బంది ఉన్నందున్న అక్కడే పనిచేయాలని ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం జిల్లాలో 4,708 మంది ఉద్యోగులు రీజియన్‌లో పనిచేస్తున్నారు. వీరిలో డ్రై వర్లు, కండక్టర్లు 3,656 మంది ఉండగా.. మిగతా వారు మెకానికల్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయం సిబ్బంది ఉన్నారు. కండక్టర్లు, డ్రై వర్లు కరీంనగర్‌ జిల్లాలోని నాలుగు డిపోల్లో 1400 మంది ఉంటారు. జగిత్యాల జిల్లాలో 976మంది, పెద్దపల్లి జిల్లాకు 765 మంది కండక్టర్లు, డ్రై వర్లు పనిచేస్తారు. ప్రస్తుతం  కొత్త జిల్లాల కారణంగా ఉద్యోగ బదిలీలు ఉండవని, ఎంత సీనియార్టీ ఉన్న ముందుగా విధుల్లో చేరిన తర్వాతనే అభ్యర్థనలు పరిశీలించనున్నారు. 

డీవీఎంలుగా సీటీఎం, సీఎంఈలు

రీజియన్‌లో పనిచేస్తున్న చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్, డెప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్, చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌తోపాటు ఈస్థాయి అధికారులు కొత్త జిల్లాలోని డిపోలకు ఆర్‌ఎంకు బదులుగా డివిజన్‌ మేనేజర్‌ విధులు నిర్వహిస్తారు. వీరు అక్టోబర్‌ 11న వారికి కేటాయించిన కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నాలుగు రీజియన్‌ల బాధ్యతలు నిర్వహించడానికి ఇక్కడ ఉన్న ఈడీ కార్యాలయాన్ని  కూడా తరలించనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున ఆయా జిల్లాల పరిధి, డిపోల సంఖ్య ఆధారంగా జోన్‌ ఏర్పాటుచేసి అక్కడ ఈడీ కార్యాలయం ఏర్పాటు చేస్తారు. 

 

బస్సుల పంపకం ఇలా..

కొత్త జిల్లాలో ఏర్పాటుతో బస్సులను ఆయా జిల్లాల వారీగా పంచున్నారు. కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌–1, కరీంనగర్‌–2, సిరిసిల్ల, వేములవాడ డిపోలకు 277 సంస్థ బస్సులు, 92 అద్దెబస్సులు, జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి డిపోలకు సంస్థ బస్సులు 183, అద్దె బస్సులు 70, పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని, మంథని డిపోలకు సంస్థ బస్సులు 146 సంస్థ బస్సులు, 46 అద్దె బస్సులు కేటాయిస్తారు. 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top