ఇక బాదుడే..!

ఇక బాదుడే..!

తణుకు: మందుబాబులూ జర జాగ్రత్త... ఇకపై మద్యం తాగి వాహనం నడుపుతూ తనిఖీల్లో పోలీసులకు చిక్కారో వాళ్లు వేసే జరిమానాలకు తాగిన మందుకు ఎక్కిన మత్తు దిగిపోవడం ఖాయం. మీ ఇంట్లో పిల్లలకు మైనార్టీ తీరకుండానే వాహనం చేతికిచ్చారో మీరు బుక్కవుతారు. ఎందుకంటే మైనార్టీ తీరకుండా వాహనం నడిపితే పోలీసులు వేసే జరిమానాలు భారీగానే ఉండబోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం త్వరలో కొత్త మోటారు వాహన చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే చట్టం అమల్లోకి వస్తే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాల నుంచి తప్పించుకోలేరు. జిల్లాలో ఇప్పటికే రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తూ భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో సరాసరి నెలకు 45 వేల కేసులు నమోదవుతుండగా సుమారు రూ.కోటి వరకు జరిమానాల  రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వస్తే జరిమానాల ద్వారా వచ్చే ఆదాయం రెట్టింపవుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో వాహన ప్రమాదంలో మృతి చెందిన బాధితులకు మాత్రం ప్రస్తుతం అందుతున్న పరిహారం రూ.25 వేల నుంచి రూ.2 లక్షలకు చేరనుంది. ఈ చట్టం ద్వారా 2020 నాటికి యాభైశాతం రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

భారీమొత్తంలో జరిమానాలు

ఇటీవలకాలంలో పెరుగుతోన్న రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మోటారు వాహనాల సవరణల బిల్లు2017 రాజ్యసభలో ఆమోదించడానికి కృషి చేస్తోంది. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొంది అమల్లోకి వస్తే ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు, శిక్షలు అమలు కానున్నాయి. తాజా చట్టం ప్రకారం ఇకముందు భారీ జరిమానాలతో వాత పెట్టనున్నారు. ప్రస్తుతం మందుతాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు, కేసుల నమోదుతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు. అయితే తాజా చట్టం ప్రకారం ప్రకారం ప్రస్తుతం ఉన్న రూ.2 వేల జరిమానా కనీస మొత్తంగా రూ.10 వేలకు పెరగనుంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపేవారికి ప్రస్తుతం విధిస్తున్న రూ.వెయ్యి ఇకపై రూ.5 వేలు కానుంది. డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే ఇప్పుడు రూ.500 జరిమానా విధిస్తున్నారు. రాబోయేరోజుల్లో రూ.5 వేలు వడ్డన తప్పదు. అతివేగంతో వాహనం నడిపితే విధించే రూ.400 జరిమానా రూ.2 వేలకు పెరగనుంది. వాహనం నడుపుతూ సెల్‌ మాట్లాడితే ఇకపై రూ.5 వేలు జరిమానా చెల్లించాల్సి రానుంది. 

సాయం అందిస్తే పారితోషికం

రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులకు సాయం అందించిన పాపానికి ఇన్నాళ్లు వారిని సాక్ష్యం పేరుతో పోలీసుస్టేషన్, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి ఉండేది. కొత్త చట్టంలో వారికి ఉపశమనం కల్పించారు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చే గుడ్‌ సమారిటన్‌లకు అభయం చేకూర్చేలా వారికి పారితోషికం అందించేలా సవరణలు చేశారు. వారితో కేసులకు సంబంధం లేకుండా చూస్తారు. ప్రమాదంలో సాయం చేసిన వారు ఎవరనేది పోలీసులకు లేదా వైద్య సిబ్బందికి వెల్లడించడం గుడ్‌సమరిటన్‌ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మరోవైపు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 2 లక్షల పరిహారం అందించనుంది. ఇప్పటి వరకు రూ. 25 వేలు ఇస్తుండగా ప్రమాదంలో బాధితులకు ఆసరాగా నిలిచేందుకు మోటారు వాహనాల ప్రమాద నిధిని ఏర్పాటు చేయనున్నారు. ప్రమాద బాధితులకు గరిష్టంగా ఆర్నెల్ల లోపు బీమా సొమ్ము అందించాల్సి ఉంటుంది. ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం పెరిగే అవకాశమూ ఉంటుంది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్‌కు, డ్రైవింగ్‌ లైసెన్సు పొందడానికి ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేయనున్నారు. మరోవైపు డ్రైవింగ్‌ లైసెన్సు కాలపరిమితి ముగిసిన తర్వాత నెలలోపు మాత్రమే దాన్ని రెన్యువల్‌ చేయించుకోవాల్సి వచ్చేది. ఈ గడువును ఏడాది వరకు పొడిగించనున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top