పని చేస్తేనే ఉపాధి కార్డులు

పని చేస్తేనే ఉపాధి కార్డులు - Sakshi


జిల్లాలో మొత్తం జాబ్‌కార్డులు3.32 లక్షలు

వినియోగంలో ఉన్నవి 1.28 లక్షలు

ప్రభుత్వ నిర్ణయంతో రద్దయ్యేవి  సుమారు 2 లక్షలు

15 రోజుల్లో కొత్త కార్డులు




ఖమ్మం మయూరిసెంటర్‌ : ఉపాధి హామీ పథకంలో ఇక నుంచి పనిచేసే వారికే జాబ్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పనిచేయని వారి కార్డులను తొలగించనుంది. అర్హులందరికీ పని కల్పించేందుకు ఈ ప్రక్రియ చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. సుమారు పదిహేను రోజుల్లో కొత్త కార్డులు ఇవ్వనుంది. జాబ్‌కార్డు పొందినవారిలో సగం మంది పనులకు హాజరుకావడం లేదు. ఈ క్రమంలో పనిచేసేవారికే జాబ్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.



జిల్లాలో  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి 3.32 లక్షల జాబ్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 1.28 లక్షల కార్డులు మాత్రమే అత్యధిక పనులు చేసిన జాబితాలో ఉన్నాయి. మొత్తం 7.75 లక్షల మంది కూలీలుగా నమోదు చేసుకోగా 2.28 లక్షల మంది మాత్రమే ఉపాధి పనికి హాజరవుతున్నారు. దీంతో ఉపాధి పనిని వినియోగించుకునేవారికి కార్డులు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.  సుమారు 2 లక్షల కార్డులు రద్దు కానున్నాయి.



పథకాల కోసమే కార్డులు

ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకునేందుకే జిల్లాలో జాబ్‌ కార్డులను ఉపయోగించుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల్లో రాయితీ కల్పిస్తుండడంతో పాటు టాయిలెట్ల నిర్మాణం, ఇంకుడు గుంటలు, పొలంలో నాటేందుకు టేకు మొక్కలు వంటివి కార్డుదారులకు అందిస్తున్నారు. దీంతో చాలా మంది వీటికోసం కార్డులు తీసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న పనికి వెళ్ళడం లేదు. కొందరు ఒకరిపై కార్డు తీసుకొని ఇంకొకరు పనికి వెళ్తున్నారు. వీటన్నింటికి చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయంతీసుకుంది.  ప్రస్తుతం కొనసాగుతున్న కార్డులను రద్దు చేసి ప్రభుత్వం నూతన కార్డులు ఇవ్వనుంది.

మూడు రకాలుగా ఆదివాసీలకు గ్రీన్‌కార్డు, వికలాంగులకు లైట్‌బ్లూ, సాధారాణ కూలీలకు బ్లూ కార్డులు ఇవ్వనుంది. ప్రభుత్వం కల్పిస్తున్న పని రోజుల్లో సగానికి పైగా పని దినాలు ఉపయోగించుకుంటేనే కార్డులు ఇవ్వనున్నారు. జాబ్‌కార్డులు రాగానే పనులు ప్రారంభించేందుకు యంత్రాం గం ప్రణాళికలు రూపొందించింది.



అర్హులకు మాత్రమే కార్డులు

ఉపాధి పథకాన్ని వినియోగించుకుని పని చేసే కూలీలకు మాత్రమే జాబ్‌కార్డులు అంది స్తాం. 2015–16 సంవత్సరంలో 45 లక్షల పనిదినాలకు 43.5 లక్షల పని దినాల పని జరిగింది. ప్రతి కూలికీ వంద రోజుల పని కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. పని చేయని వారి కార్డులను రద్దు చేస్తాం. – మురళీధర్‌రావు, డీఆర్‌డీఓ



పని చేసేవారికి ఇస్తేనే ప్రయోజనం

పని చేసేవారికే జాబ్‌కార్డు విధానం మంచిది. ఈ నిర్ణయంతో అర్హులకు కార్డుతో పాటు 100 రోజుల పని లభిస్తుంది. కూలీలు కూడా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకొని అవకాశం ఉంటుంది. నూతన విధానాలతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు.

– మరికంటి నరేష్, ఉపాధి మేట్‌ 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top