టార్గెట్ ఆనం

టార్గెట్ ఆనం - Sakshi


సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని టార్గెట్ చేశారు. కొద్దిరోజులుగా ఆనం వివేకానందరెడ్డి తన కుమారుడు రంగమయూర్‌రెడ్డి ద్వారా చేయిస్తున్న విమర్శలపై టీడీపీ నాయకులంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో భాగంగా సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఆనం, ఆయన వర్గీయుల తీరుపై చర్చించారు. గతంలో ఆనం వర్గీయులు టీడీపీ నేతల పట్ల  వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు.



మాజీ మంత్రి రమేష్‌రెడ్డి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అనూరాధ తమ పట్ల ఆనం వివేకా ప్రవర్తించిన తీరును జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పదవులు పోవటానికి దారి తీసిన సంఘటనలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరించినట్లు సమాచారం. అదేవిధంగా మేయర్ అబ్దుల్ అజీజ్ ఇప్పటికే ఆనం వర్గీయులపై ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. నగరపాలక సంస్థలో మేయర్‌కు వ్యతిరేక వర్గాన్ని తయారుచేయడం, టెండర్లలో తలదూర్చటం వంటి కార్యక్రమాలతో మేయర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో మేయర్ వర్గీయులు కూడా ఆనం వివేకా, కుమారుడు రంగమయూర్‌రెడ్డిపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలిసింది.



నగరపాలక సంస్థలో ఆనం చేయిస్తున్న కార్యక్రమాలను బీద రవిచంద్ర వద్ద ఫిర్యాదు చేశారు. ఇకపోతే నగరపార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇప్పటికే ఆనంను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సోమవారం కూడా తనదైన శైలిలో ఆనంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగరపార్టీ తరుపున ఆనం, ఆయన వర్గీయులపై పార్టీ పరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు తెలిసింది. అదేవిధంగా మిగిలిన మరి కొందరు ముఖ్యమైన నేతలు కూడా ఆనంపై ఫిర్యాదు చేశారు. టీడీపీలో చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనం చేస్తున్న వాటిని అధినేత చంద్రబాబు, మంత్రి నారాయణకు ఫిర్యాదు చేయాలని పట్టుబట్టారు. పార్టీ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇకపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం ఆపేయాలని బీద రవిచంద్ర గట్టిగా చెప్పినట్లు సమాచారం.

 

మూకుమ్మడి దాడి..

ఆనం సోదరులు టీడీపీలో చేరడాన్ని జిల్లా నేతలకు మొదటి నుంచి ఇష్టం లేదు. ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి తప్ప మిగిలిన వారంతా ఆనం వర్గాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారే. అధిష్టానానికి పలురకాలుగా ఫిర్యాదులు చేశారు. పార్టీ నాయకుల  మనోభావాలను పక్కనపెట్టిన అధినేత ఆనం సోదరులను పార్టీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కొద్దిరోజులపాటు ఆనం సోదరులు స్తబ్దుగానే ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు పెద్ద ఎత్తున మంజూరు కావడం, ఆ పనులకు సంబంధించి టెండర్లు పిలవటంతో రగడ రాజుకుంది. ఆనం వర్గీయులు టెండర్లు వేయటం, వాటిని మేయర్ నిలిపివేయడం వంటి చర్యలతో ఇరు వర్గాల మధ్య ఆగ్గి రాజుకుంది.



మేయర్‌ను ఎలాగైనా దింపే పథకం కూడా వేశారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మేయర్ వర్గం ఎదురుదాడికి దిగటంతో అగ్గి రాజకుంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. ఒకరు చేసిన తప్పులు ఒకరు బయటపెట్టుకున్నారు. ఇన్నాళ్లు గొప్పలు చెప్పుకున్న టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జిల్లాలో చర్చనీయాంశమైంది. టీడీపీకి ఓట్లేసిన వారు ‘ఛీ’ కొట్టటం ప్రారంభించారు. అభివృద్ధి పనులు చేసి జనం ఆదరణ పొందమని ఓటేస్తే డబ్బుల కోసం జనం సమస్యలను పక్కనపెట్టటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top