సిబ్బంది నిర్లక్ష్యం... రోగిని కొరుక్కుతిన్న ఎలుకలు

సిబ్బంది నిర్లక్ష్యం... రోగిని కొరుక్కుతిన్న ఎలుకలు


-ప్రాణాపాయస్థితిలో రోడ్డుపై బాధితుడి ఆర్తనాదాలు

-పోలీసుల చొరవతో తిరిగి ఆస్పత్రికి



నెల్లూరు : నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో మానవత్వం మంటకలిసింది. ఆస్పత్రిలో ఉన్న రోగికి సపర్యలు చేయాల్సి వస్తుందని భావించిన కొందరు సిబ్బంది రోగిని రోడ్డుపై పడేశారు. నడవలేని స్థితిలో రెండు రోజులుగా డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్న రోగి కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ప్రాణాపాయస్థితిలో సదరు రోగి ఆర్తనాదాలు చేస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల చొరవతో ఆ రోగిని ఆస్పత్రిలో చేర్పించారు.  ఈ హృదయ విదారక సంఘటనకు జిల్లా ప్రభుత్వ బోధనాస్పత్రి వేదికైంది. వివరాలు ఇలా ఉన్నాయి....



ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు కాళ్లు చచ్చుబడిపోయి తీవ్ర అనారోగ్యంతో నెల్లూరు చెరువు వద్ద పడి ఉండడాన్ని 108 సిబ్బంది గుర్తించారు. ఈ నెల 25వ తేదీన అతడ్ని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేర్పించారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని రెండురోజులుగా ఆ రోగి ఆస్పత్రి బయట (మెటర్నిటీ హాస్పిటల్‌కు వెళ్లే గేటు సమీపంలో) డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్నాడు. కాలువ పక్కనే పడి ఉండటంతో అతని కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కు తిన్నాయి. దీంతో వేళ్లలోని కండరాలు బయటకు వచ్చాయి.



శనివారం వేసవి వేడికి అతడు  బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు ఈ విషయాన్ని గమనించి ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఎస్‌ఐ జగత్‌సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో వెంటనే అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు.



అతనికి నా అనే వారు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. దీంతో అతనికి అన్ని సేవలు వైద్యసిబ్బందే చేయాల్సి ఉంది. మూత్ర, మల విసర్జన సైతం బెడ్‌పైనే. దీంతో ఇవ్వన్నీ చేయలేకనే మానవత్వం మరచిన వైద్య సిబ్బంది స్థానిక సెక్యూరిటీ గార్డుల సాయంతో రాత్రికి రాత్రే రోగిని ఆస్పత్రి బయట వదిలివేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండురోజులుగా సదరు రోగి రోడ్డుపైనే నరకయాతన పడుతున్నా ఎవరికీ కనికరం కలగలేదు.



ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అటువైపుగా నిత్యం రాకపోకలు సాగిస్తున్నా కనీసం పట్టించుకొన్న దాఖలాలు లేవు. చివరకు స్థానికులు స్పందించి పోలీసుల చొరవతో రోగిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై వైద్యసిబ్బంది మాత్రం మరోలా చెబుతున్నారు. సదరు రోగికి మతిస్థిమితం లేదనీ... దీంతో అతడు తరచూ ఆస్పత్రిలోనుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయేవాడని ... తాము పలుమార్లు అతడిని పట్టుకొచ్చినా ఫలితం లేకుండాపోయిందని చెబుతున్నారు.



రెండు కాళ్లు చచ్చుబడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి నడుచుకుంటూ ఎలా వెళుతాడని ప్రశ్నించగా దానిపై మాత్రం ఆసుపత్రి సిబ్బంది సమాధానం దాటేశారు. అక్కడున్న కొందరు రోగులు మాత్రం రెండురోజులు కిందటే ఆస్పత్రి సిబ్బందే అతడ్ని బయట పడేశారని చెబుతున్నారు. ప్రభుత్వ బోధానాస్పత్రిలో ఇలాంటి ఘటనలు షరా మామూలేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో మృతి చెందిన ఘటనలు లేకపోలేదు. కొందరు చివరి పరిస్థితుల్లో బతుకు జీవుడా అంటూ ప్రైవేటు హాస్పిటల్స్‌కు తరలివెళుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణం పరిశీలిస్తే నిత్యం ఎంతో మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి బయటే పడుకొని ఉండటం దర్శనమిస్తుంది. వారికి కనీస వైద్యసేవలు అందించాలన్న చిత్తశుద్ధి అటు వైద్యుల్లో... ఇటు సిబ్బందిలో కొరవడింది.




Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top