కేసీకి నీటి విడుదలలో నిర్లక్ష్యం

కేసీకి నీటి విడుదలలో నిర్లక్ష్యం

పగిడ్యాల: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోయి రైతులు అల్లాడుతున్నా కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయడంలో కలెక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. వైస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ రమాదేవి గృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వరి పంట ఎండిపోతోందని.. కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరితే వరి పంట సాగు చేయమని ఎవరి చెప్పారని ప్రశ్నించడం విచారకరమన్నారు. కేసీ ఆయకట్టు కింద కలెక్టర్‌ చెప్పిన పంటలే వేసుకోవాలనే కొత్త సంప్రదాయానికి టీడీపీ ప్రభుత్వం తెరదీయడం సిగ్గుచేటన్నారు.  రాష్ట్ర మంత్రివర్యులైన అచ్చెన్ననాయుడుకు  గ్యాంగ్‌స్టర్‌ నయూమ్‌ సంబంధాలు ఉండడం శోచనీయమన్నారు. నయూమ్‌తో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడిన టీడీపీ నేతలు ఆ గండం నుంచి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. రాజధాని నిర్మాణ బాధ్యతలను స్విస్‌ చాలెంజ్‌ కంపెనీకి ఇవ్వడాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టి టెండర్‌లను రికాల్‌ చేయాలని ఆదేశాలు ఇవ్వడం చంద్రబాబు తప్పిదాలకు పరాకాష్ట అన్నారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసి కేసీ కాలువకు సాగునీరు విడుదల చేయిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ మాటలు నిరర్థకంగా మారాయన్నారు.

ప్రభుత్వం విఫలం..

 వరుస కరువుతో అల్లాడుతున్న అన్నదాతను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని  వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌ రెడ్డి  అన్నారు. గత ఏడాది ప్రకటించిన కరువు మండలాలల్లో పంట నష్టం సర్వే చేసినా ఇప్పటి వరకు ఒక్క పైసా పరిహారం రైతులకు ఇవ్వలేదని ఆవేదన వెలిబుచ్చారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు జగదీశ్వరరెడ్డి, మిడుతూరు జెడ్పీటీసీ యుగంధర్‌రెడ్డి, దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు రమణయ్యశెట్టి, నాయకులు రమాదేవి, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top