అటకెక్కిన ఆశయం

అటకెక్కిన ఆశయం


– నీరుగారుతున్న సాక్షర భారత్‌ పథకం

– కేంద్రాల్లో కనిపించని సామగ్రి

– పట్టించుకోని జెడ్పీ సీఈవో




చిత్తూరు(ఎడ్యుకేషన్‌): నిరక్షరాస్యతను నిర్మూలించాలని, వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాక్షర భారత్‌ కార్యక్రమం నీరుగారిపోతుంది. ఎక్కడా ఈ కేంద్రాలు సక్రమంగా అమలు జరుగుతున్న దాఖలాలు కన పడటం లేదు.  దీంతో సాక్షర భారత్‌ పథకంపై నిర్వాహకుల్లో, వయోజనుల్లో ఆందోనళన నెలకొంది. అయితే  సాక్షర భారత్‌ కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న బీరువాలు, పుస్తకాలు, కుర్చీలు, కుట్టుమిషన్లు మాయమవుతున్నాయి. దీంతో సంబంధిత అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జెడ్పీ సీఈవోగా ఉన్న వేణుగోపాలరెడ్డి పథకం అమలుతీరుపై నెలకొకసారి రివ్యూ సమావేశాలు నిర్వహించి పర్యవేక్షించేవారు. ఆయన బదిలీ అయినప్పటి నుంచి పథకం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ప్రస్తుతం ఉన్న సీఈవో పెంచలకిషోర్‌ పథకం అమలుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.



మాయమైపోతున్న సామగ్రి

సాక్షర భారత్‌ కేంద్రాలకు ప్రభుత్వం బీరువా, పుస్తకాలు, కుర్చీలను, ట్యాబ్‌లను సరఫరా చేసింది. కొన్ని కేంద్రాల్లో అవి ఏమయ్యాయో కూడా తెలియని దుస్థితి ఏర్పడింది. దీంతో  సాక్షరభారత్‌ అధికారుల్లో ఆందోళన నెలకొంది. తనిఖీల కోసం అధికారులు వస్తే  ఏం చెప్పాలోనని  వారు తలలు పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో సామగ్రిని కార్యాలయంలోనే ఉంచాలని ఆదేశాలున్నాయి. అయితే చాలా మంది వాటిని తమ ఇళ్లలో పెట్టుకునట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.



నీరుగారిన ఆశయం

 సాక్షర భారత్‌ కేంద్రాలకు రోజూ ఏవేని రెండు దినపత్రికలు రావాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు.  అంతే కాక వయోజనులకు పంపిణీ చేసిన వివి«ధ పుస్తకాలు కూడా  కేంద్రాల్లో కనబడటంలేదు. దీంతో వయోజనులు  కేంద్రాలకు వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు.  ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సాక్షరభారత్‌ అమలు తీరును ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది.



కొరవడిన పర్యవేక్షణ

 సాక్షరభారత్‌  కేంద్రాల నిర్వహణ పై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. వయోజనులకు కనీసం రాయడం, చదవడం నేర్పాలనే కనీస బాధ్యతను విస్మరిస్తున్నారు. దీంతో చాలా మంది నిర్లక్షరాస్యులు గానే మిగిలిపోతున్నారు.  సాక్షర భారత్‌ కేంద్రాలను అసలు తెరవడంలేదని స్వయంగా మండల జెడ్పీటీసీ సభ్యులే చెబుతున్నారు. కేంద్రాల సమన్వయ కర్తలు నెలకు జీతాలు తీసుకుంటున్నారు తప్పితే వారి విధుల పట్ల కొంచెం కూడా శ్రద్ధ వహించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top