‘గుర్తింపు’లోనూ నిర్లక్ష్యమే!

‘గుర్తింపు’లోనూ నిర్లక్ష్యమే! - Sakshi


ధర్మవరం : కౌలు అధీకృత చట్టం ప్రకారం 2016–17 సంవత్సరానికి గాను జిల్లాలోని 63 మండలాల్లోని 1003 గ్రామ పంచాయతీల పరి«ధిలో గ్రామ సభలు నిర్వహించి, 29,383 మంది కౌలు రైతులను గుర్తించాలని ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు లక్ష్యం విధించింది. అయితే ఇప్పటి దాకా 2,264 మందిని మాత్రమే గుర్తించారు. లక్ష్యంలో కనీసం 10 శాతం కూడా పూర్తి చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ నెల ఆరంభంలో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా గ్రామసభలు నిర్వహించి కార్యక్రమాన్ని మమ అనిపించారు.


వివరాల వెల్లడికి ససేమిరా..


తమ భూమిని కౌలుకు ఇచ్చేందుకు, తమ భూమి వివరాలు ఇతరులకు వెల్లడించేందుకు రైతులు  ఒప్పుకోవడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, లిటిగెంట్‌ వ్యవహారాల నేప«థ్యంలో భూములను కౌలుకు ఇచ్చేందుకు అంగీకరించడం లేదంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి రాయితీ, వాతావరణ బీమా, ఇతరత్రా సబ్సిడీలు అన్నీ కౌలు రైతులకు దక్కితే తమకు నష్టం వాటిల్లుతుందని భావించిన రైతులు కౌలు పట్లు విముఖత చూపుతున్నారు.


ఇంట్లో వారే కౌలు రైతులు


కౌలు రైతులను గుర్తించేందుకు రెవెన్యూ సిబ్బంది కొత్త ఎత్తుగడ వేశారు. ఇంట్లో  తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటే తండ్రిపేరిట ఉన్న భూమిని కొడుకులిద్దరికీ కౌలుకు ఇచ్చినట్లు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. ఇలా అన్న పేరిట ఉన్న భూమిలో కొంత  తమ్మునికి, తల్లి పేరిట ఉన్న భూమిని తనయులకు ఇచ్చినట్లు గుర్తింపుకార్డులు ఇచ్చి తాము కూడా గుర్తించామని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక్క కౌలు రైతును కూడా గుర్తించని మండలాలు సగానికి పైగా ఉన్నాయి. ఒక్క ధర్మవరం మండలంలో మాత్రం 250 దాకా కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారు.


 


సహకరించని బ్యాంకర్లు


ఇదిలా ఉండగా కౌలు గుర్తింపు కార్డులు పొందిన రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు  బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదు. ముఖ్యంగా వరుసగా పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో కౌలురైతు కార్డు పొందిన వారికి ఎన్నో నిబంధనలు పెట్టి రుణాలు మంజూరు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కౌలు కార్డు పొందేందుకు రైతులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top