వెలవెలబోయిన గ్రీవెన్స్‌సెల్‌

వినలుతు స్వీకరిస్తున్న జేసీ–2 రజనీకాంతారావు


శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఈవారం గ్రీవెన్స్‌సెల్‌కు వినతులు తక్కువగా వచ్చాయి.  ఖరీఫ్‌ పనులు, ఎండలు, పుష్కరాల ప్రభావం గ్రీవెన్స్‌సెల్‌పై పడింది. జిల్లా గ్రీవెన్స్‌ను సోమవారం జాయింట్‌ కలెక్టర్‌–2 పి.రజనీకాంతారావు నిర్వహించారు. ఆయనతో పాటు సెట్‌శ్రీ సీఈఓ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

– నకిలీ గిరిజన ధ్రువ పత్రాలతో సంక్షేమ శాఖతో ఉద్యోగం సంపాదించిన కుమార్‌ నాయక్‌పై పలుమార్లు దర్యాప్తులో తేలినా, మరలా కొనసాగిస్తున్నారని కుల నిర్మూలన పోరాట సమితి ప్రతినిధులు బెలమర ప్రభాకర్, తదితరులు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులకు ఉద్యోగులు వత్తాసు పలికి నకిలీలను అదుకుంటున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

– అగ్రీగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని, ఏడాదిగా ఉద్యమాలు, వినతులు ఇచ్చినప్పటికి ఇప్పటివరకు ఆ సంస్థలో పనిచేసిన సిబ్బందికి, సంస్థపై నమ్మకంతో దాసుకున్న ఖాతాదారులకు న్యాయం చేయలేదని, ఇప్పటికైనా నగదు ఇప్పించాలని జయసింహ, గోవిందరావు, రఘునాథ్‌ తదితరులు కోరారు.

– ఎచ్చెర్ల మండలంలోని వైశాఖి బహో హేచరీ కంపెనీలో పది సంవత్సరాలుగా పనిచేస్తున్న భగీరథపురం గ్రామస్థులను తొలగించారని, వారిని విధుల్లోకి తీసుకోవాలని ఎం.మన్మథరావు, టి.వేణుగోపాలరావు, రామారావు, ఎంపీటీసీ జి.మల్లేసు కోరారు.

– సారవకోట మండలం అర్లి పంచాయతీ సానిమెల్లగెడ్డలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, వీటిని రెవెన్యూ అధికారులు దగ్గరుండి కట్టిస్తున్నారని, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన డి.ఆనందరావు, వనజాక్షి, రమణమూర్తి తదితరులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

– శ్రీకాకుళం మండలంలోని లంకాం గ్రామంలో గతంలో వేసిన మెటల్‌ రోడ్డు పూర్తిగా పాడయ్యిందని, సీఎస్‌పీ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని సర్పంచ్‌ ప్రతినిధి చిట్టి రవికుమార్‌ ఫిర్యాదు చేశారు. రోడ్డు నిర్మాణానికి 2014లో నిధులు మంజూరైనా, తరువాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

– సంక్షేమ వసతి గృహాల్లో అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న కుక్, కమాటీ, వాచ్‌మెన్‌ ఉద్యోగులకు బకాయి జీతాలు చెల్లించాలని, వేసవి, దసరా, సంక్రాంతి సెలవుల్లో జీతాలు చెల్లించాలని ఉద్యోగులు ఎంఏ నాయుడు, రాంబాబు, బాలకృష్ణ తదితరులు కోరారు.

– మూడు చక్రాల వాహనం ఇప్పించాలని జి.సిగడాం మండలం గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన బర్రి నీలయ్య కోరారు. లావేరు మండలంలోని గుమడాం పంచాయతీ నాగంపాలెం గ్రామానికి చెందిన జగ్గురోతు సూరమ్మ పింఛను మంజూరు చేయాలని కోరారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top