హోటల్ డీల్ రూ.5 కోట్లు!

హోటల్ డీల్ రూ.5 కోట్లు! - Sakshi


నయీం నగరంలో కాలుమోపింది ఆ దందాతోనే

ఓ స్టార్ హోటల్ అమ్మకంలో కీలక పాత్ర

రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల క్యాంటీన్లూ విశాఖ వాసివే

అనపర్తి టీడీపీ నేతకు అతను దగ్గరి బంధువు

అతని వెనుక ఉన్నదీ నయీమే

హోటల్ యజమానిని ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు

 

విశాఖ నగరంలో గ్యాంగ్‌స్టర్ నయీం దందాల గుట్టు వీడుతోంది. ఒక్కొక్కటిగా ఆయన వ్యవహారాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా ఓ భారీ డీల్ సెటిల్ చేయడానికే ఆయన నగరానికి రాకపోకలు సాగించాడని తాజాగా వెల్లడైంది. ఇందులో అతనికి రూ.5 కోట్లు ముట్టాయని సమాచారం. మరోవైపు నయీం అండతో రాష్ట్రంలోని మెజారిటీ సినీ థియేటర్ల క్యాంటీన్లు నిర్వహిస్తున్న వ్యక్తి విశాఖ నగరానికే చెందినవాడని.. అతగాడు తూర్పు గోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఓ టీడీపీ ప్రజాప్రతినిధికి స్వయానా బావ కావడం కలకలం రేపుతోంది.

 

విశాఖపట్నం: నయీం గ్యాంగ్ విశాఖలో పలు సెటిల్‌మెంట్లు చేశారని, నయీం కూడా స్వయంగా నగరానికి వచ్చి వాటిలో పాల్గొన్నాడని సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారుల బృందం ఏ కోణాన్నీ విడిచిపెట్టకుండా పరిశోధిస్తోంది. ఆ ప్రయత్నంలో ఇప్పటికే చాలా ముందుకు వెళ్లింది. దాదాపు రెండు నెలల క్రితం నగరానికి నయీం వచ్చాడని సోదాల్లో లభించిన రైల్వే టిక్కెట్ల ద్వారా తెలుసుకున్న సిట్ అధికారులు అతను ఎందుకు వచ్చాడనే విషయంతో లోతుగా అధ్యయనం చేశారు.

 

 కీలక సమాచారం రాబట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ద్వారకానగర్ ప్రాంతంలో ఉన్న ఓ థియేటర్ యజమాని ఆరేళ్ల క్రితం సిరిపురం ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ నిర్మించారు. దానికోసం కొంత సొమ్ము ఫైనాన్సర్ నుంచి అప్పుగా తెచ్చుకున్నారు. అయితే ఆ హోటల్ ఆర్ధిక నష్టాల్లో కూరుకుపోవడం తో అప్పు తీర్చలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ ఇచ్చిన వారు తమ సొమ్ము రాబట్టుకోవడానికి నయీంను ఆశ్రయించారు.

 

 అతను ముందుగా తన గ్యాం గ్‌ను విశాఖ పంపించాడు. వారి ద్వారా అన్ని వివరాలు సేకరించి, సెటిల్‌మెం ట్‌కు ఏర్పాట్లు చేసుకున్నాడు. తర్వాత అతనే స్వయంగా నగరానికి వచ్చాడు. థియేటర్, హోటల్ యజమానిని వ్యక్తిని అప్పు తీర్చాలని బెదిరించాడు. తన వద్ద సొమ్ము లేదని అతను చేతులెత్తేయడంతో హోటల్‌ను విక్రయించడానికి ఒప్పించాడు. తనే మరో పార్టీని చూపించి హోటల్‌ను కొనిపించాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఫైనాన్స్ వ్యాపారుల నుంచి రూ.5 కోట్లు కమిషన్‌గా తీసుకున్నాడు.

 

 ఈ విషయాలు తెలుసుకున్న సిట్ అధికారులు ఆ హోటల్ యజ మానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని ద్వారా నయీం, అతని గ్యాంగ్ వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో క్యాంటీన్లను నయీం అనుచరులే నడుపుతున్నారనే వాదనలకు బలం చేకూరుస్తూ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధి బావ విశాఖలోని గణేష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా 60 నుంచి 70 థియేటర్లలో క్యాంటీన్లు ఉన్నాయని తెలుస్తోంది.

 

 వాటిని నయీం అండతోనే ఆయన నడుపుతున్నాడని అనుమానిస్తున్నారు. థియేటర్ల నిర్మాణానికి, పాత వాటిని ఆధునీకరించడానికి, అప్పుల్లో ఉన్నవాటిని ఆదుకోవడానికి డబ్బులు ఇచ్చి ఆ థియేటర్లలో క్యాంటీన్లు చేజిక్కించుకోవడం నయీం వ్యవహారాల్లో భాగం. దీని కోసం నమ్మకమైన వారిని నియమించుకుని, నిర్వహణ బాధ్యతలను పెద్దలకు అప్పగించేవాడు. అలాంటి పెద్దల్లో టీడీపీ నేత బంధువు కూడా ఒకరని సమాచారం. దీనిపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. అయితే నయీంను టీడీపీ పెంచి పోషించిందని తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలు బలం చేకూర్చుతున్నాయి. ఇవే ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top