‘నవోదయం’ ఎప్పుడో..!

‘నవోదయం’ ఎప్పుడో..! - Sakshi

జంగారెడ్డిగూడెం రూరల్‌: జవహర్‌ నవోదయ విశ్వవిద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 8న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఫలితాల కోసం విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నవోదయ పాఠశాలల్లో ప్రవేశం లభిస్తే ఇంటర్‌ వరకు ఉచితంగా చదువుకునే వీలుంటుంది. దీంతో ఈ ప్రవేశ పరీక్షకు తీవ్ర పోటీ ఉంటోంది. జిల్లాలో 80 సీట్లకు 3 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

 

పరీక్ష నిర్వహించి ఐదు నెలలకు పైగా అయినా ఇప్పటి వరకు ఫలితాలు విడుదల కాలేదు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పరీక్ష రాసిన విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలో చేరాలా లేదా ఫలితాల వచ్చేంత వరకూ వేచి ఉండాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ ప్రైవేట్‌ స్కూళ్లలో చేరిన తర్వాత నవోదయలో సీటు వస్తే ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యానికి చెల్లించిన ఫీజులు వృథా అవుతాయని ఆవేదన చెందుతున్నారు.

 

నవోదయలో సీటు లభిస్తే జిల్లాలోని పెదవేగిలో ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసిస్తారు. ఫలితాల విడుదలపై పెదవేగి జవహర్‌ నవోదయ విద్యాలయ వైస్‌ ప్రిన్సిపల్‌ను వివరణ కోరగా ఫలితాల విడుదలపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయని చెప్పారు. 

 

ఎదురుచూస్తున్నాం

జనవరిలో జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష రాశాను. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం.  విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. నవోదయలో సీటు వస్తుందనే ఆశతో ఉన్నా. –రూపా మహిమాన్విత, విద్యార్థి, చింతలపూడి

ఫలితాలు విడుదల చేయాలి

ఈ ఏడాది జనవరి 8న జరిగిన జవహర్‌ నవోదయ ప్రవేశ పరీక్ష రాశాను. సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్నాను. ఫలితాలు త్వరగా విడుదల చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.–పార్ధు, విద్యార్థి, చింతలపూడి
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top