ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్‌లక్

ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్‌లక్


నారాయణ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య

ఏపీలోని రాజమండ్రిలో ఘటన

చెట్టుకు ఉరివేసుకొని మృతి

కాలేజీలో ఒత్తిడే కారణమంటున్న తల్లి


 

రాజమండ్రి క్రైం: ఆంధ్రప్రదేశ్‌లో నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థుల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న దాసరి నందిని(17) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నందిని స్వస్థలం ఒంగోలు. తండ్రి ప్రసాద్ గతంలోనే మృతి చెందాడు. దీంతో నందినిని, ఆమె చెల్లెలిని తీసుకొని వారి తల్లి నిర్మల తన పుట్టిల్లయిన రాజమండ్రికి వచ్చేసింది. నిర్మల ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది.

 

 నందిని స్థానికంగా ఓ బాలికల హాస్టల్‌లో ఉంటూ దానవాయిపేటలోని నారాయణ కాలేజీలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన త్రైమాసిక పరీక్షలు బాగా రాయలేదని స్నేహితుల వద్ద బాధపడింది. సోమవారం రాత్రి హాస్టల్ ఎదుట ఉన్న రావిచెట్టుకు చున్నీతో ఉరి వేసుకొంది. మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించా రు. మృతదేహాన్ని పోలీసులు  ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

 

 కాలేజీలో ఒత్తిడి తాళలేక ఆత్మహత్య: తల్లి నిర్మల ఆదివారం నందినిని బయటకు తీసుకెళ్లింది. ఆ సందర్భంగా నందిని తన గోడు వెళ్లబోసుకుంది. నారాయణ కాలేజీలో ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని, ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకూ 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తల్లికి చెప్పింది. కాలేజీలో ఒత్తిడికి తాళలేక తన బిడ్డ ఆత్మహత్య చేసుకుందని నిర్మల రోదించింది.

 

 ఐ మిస్ యూ..

 నందినికి సహ విద్యార్థినులు వనం దుర్గాభవాని, పోలిపల్లి దేవిక ప్రాణ స్నేహితులు. వారితో నాలుగు రోజుల క్రితం చిన్నపాటి స్పర్థ ఏర్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు వారినుద్దేశించి నందిని తన నోట్‌బుక్‌లో ఒక లేఖ రాసింది. ‘నాతో మాట్లాడరనుకున్నాను. మాట్లాడుతున్నందుకు సంతోషం. వచ్చే జన్మలో కూడా మీరే నా స్నేహితులుగా పుట్టాలి. ఐ విల్ మిస్ యూ.. మై బ్యాడ్‌లక్’ అని అందులో రాసింది. ఈ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top