అస్తమించిన పోరాట శిఖరం

రామకృష్ణ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న సీపీఐ నాయకులు


స్వాతంత్య్ర సమరయోధుడినిష్క్రమణం

భారతజాతి విముక్తికి పోరు




జైనథ్‌(ఆదిలాబాద్‌): ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల కేంద్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు నారకట్ల రామకృష్ణ(98) మంగళవారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా మంచానికే పరిమితమైన ఆయన సోమవారం నుంచి మాటపడిపోయింది. కాగా మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆయన తన తుదిశ్వాస విడిచాడు.



బతుకు పోరు..

నాడు భరత మాత సంకెళ్లు తెంచడం కోసం పోరాటం చేసిన ఆయన గత కొన్ని ఏళ్లుగా బతకడానికి పోరాటం చేశారు. భరతమాత బిడ్డలను బానిస బతుకుల నుంచి విముక్తి కలిగించడానికి జీవితాన్ని పణంగా పెట్టి ఎన్నో పోరాటాలు చేసి ఏళ్లుగా పెన్షన్‌ కోసం ఎదురుచూస్తూ అలసిపోయాడు. 1997 నుంచి స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగిన ఆయన గత కొన్ని నెలలుగా మంచానికే పరిమితమై లేవలేని పరిస్థితితుల్లో అతికష్టం మీద జీవితం వెళ్లదీసుకుంటూ వచ్చారు.



20 సంవత్సరాలుగా పెన్షన్‌ కోసం..

రామకృష్ణ గాంధీజీ ఆదర్శాలకు ప్రభావితమై స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తన యవ్వన దశలోనే పీడీఎస్‌లో చేరాడు. రజాకారుల అరాచారాలకు విసిగిపోయిన ఆయన వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఊరూరా తిరుగుతూ ప్రజల్లో స్వాంతంత్య్ర కాంక్షను నూరిపోయడం కోసం తీవ్రంగా శ్రమించాడు. 1947లో యావత్‌ భారత్‌ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ, రాజాకారుల పాలన వల్ల ఇంకా తెలంగాణ ప్రాంత ప్రజలో బానిసత్వంలో మగ్గుతున్న తరుణంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలనీ గట్టిగా పోరాడిన వారిలో రామకృష్ణ ఒకరు.



విలీనం అనంతరం తెలంగాణ ప్రాంతంలో ఊపిరిపోసుకున్న తెలంగాణ సాయుధ పోరాటంలో సైతం చురుగ్గా పాల్గొన్న ఈ సమర యోధుడికి ప్రభుత్వాదరణ కరువైంది. దీంతో ఏళ్లుగా ఆర్థిక ఇబ్బందులతో అతికష్టం మీద జీవిస్తున్నాడు. తన కుమారుల మీద ఆధారపడి జీవిస్తూ జీవితపు మలి సంధ్యలో సమరయోదుల పింఛన్‌ కోసం గత 20 ఏళ్లుగా ఎదురుచూస్తూ పింఛన్‌  అందకుండానే తుది శ్వాస విడిచాడు.



పలువురి శ్రద్ధాంజలి

నారకట్ల రామకృష్ణ పార్థివ దేహానికి మంగళవారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌ రెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు విలాస్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top