వియ్‌ వాంట్‌ సెల్ఫీ!

నంద్యాలలోని మారుతీనగర్‌ కాలనీలో వైఎస్‌ జగన్‌తో విద్యార్థినుల సెల్ఫీ - Sakshi


పోటీ పడ్డ వందలాది మహిళలు

వర్షంలోనే ముందుకు సాగిన జననేత వైఎస్‌ జగన్‌

అడుగడుగునా వెల్లువెత్తిన అభిమానం




నంద్యాల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘జగనన్నా.. వియ్‌ వాంట్‌ సెల్ఫీ.. వియ్‌ వాంట్‌ సెల్ఫీ...’ అంటూ గురువారం నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో వందలాది మంది మహిళలు, యువతులు హోరెత్తించారు. ఓపిగ్గా అందరితోనూ సెల్ఫీలు దిగుతూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదిలారు. దారి పొడవునా ఇదే తరహాలో సెల్ఫీల కోసం ముందుకొచ్చిన వారికి ఆప్యాయంగా సహకరించారు. ఓ వైపు వర్షం కురుస్తున్నా తన రాక కోసం వేచి చూస్తున్న అభిమానులను నిరాశ పర్చకుండా అందరితో మాట్లాడుతూ ముందుకు సాగారు. గురువారం గడప గడప ప్రచారంలాగే సాగింది. జగన్‌కు వస్తున్న స్పందన చూసి కొన్ని చోట్ల మురికి వాడల్లో జనం లేకుండా ప్రత్యర్థులు తరలించే యత్నం చేశారు.



ఏకలవ్యనగర్‌లో జగన్‌ కోసం వెల్లువెత్తిన జనాభిమానాన్ని చూసి హడలి పోయిన టీడీపీ నేతలు.. తమ వెంట వస్తే ఒక్కొక్కరికి రూ.300 ఇస్తామని చెప్పి లారీల్లో తీసుకెళ్లారు. కానీ మహిళలు మాత్రం డబ్బులకు ఆశ పడకుండా జగన్‌ను చూడ్డానికే మొగ్గు చూపారు. లారీల్లో వెళుతున్న వారు సైతం జగన్‌ కాన్వాయ్‌ ఎదురు పడగానే కేకలు వేస్తూ ఫ్యాన్‌ గుర్తుకు సంకేతంగా చేత్తో సంజ్ఞలు చేస్తూ వెళ్లారు. ఇలా తీసుకెళ్లిన వారిని టీడీపీ కార్యాలయం వద్దకు తరలించారు. భోజన సదుపాయం కల్పించి వారిని సాయంత్రం వరకూ (జగన్‌ రోడ్‌షో ముగిసే వరకూ) అక్కడే కూర్చోబెట్టి ఆ తర్వాత వదలి పెట్టారు.





రాజస్థాని ఛాయ్‌.. భళా..

నూనెపల్లి ఫ్లైఓవర్‌ కింద జిలేబి సెంటర్‌ వద్ద ప్రచారం సాగుతున్నపుడు రాజా టీస్టాల్‌ (రాజస్థానీ ఛాయ్‌) యజమాని రాజా కాన్వాయ్‌ వద్దకు వచ్చి మా షాపులో టీ తాగండి సార్‌.. అని జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఎలాంటి సంకోచం లేకుండా జగన్‌ షాపు వద్దకు వెళ్లి శొంఠి టీ తాగారు. చాలా బాగుందని చెప్పడంతో రాజా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఓ అవ్వ ఒడిలో ఉన్న మనుమరాలు జగన్‌ను చూడాలనే తాపత్రయంతో దగ్గరికి వెళ్లి ‘మామయ్యా... చాక్లెట్‌ తీసుకోండి’ అని అందజేసినపుడు ఆమెను ముద్దాడి దీవించారు. కొలిమిపేట ప్రాంతంలో ఓ వృద్ధురాలు ఆవేదనతో జగన్‌ను చూసి ‘ఎందుకు నాయనా ఇలా తిరుగుతున్నావు... మొహం చూడు ఎంత నల్లబడిందో...’ అన్నపుడు జగన్‌ ఆమెకు చిరునవ్వుతో సమాధానమిచ్చారు.



జగన్‌.. సాదిక్‌ నగర్‌ ప్రాంతం చేరుకునేటప్పటికి వర్షం ప్రారంభమైంది. వర్షం ఎక్కువ కావడంతో అక్కడ కొద్దిసేపు ఆగారు. వర్షంలో సైతం తన కోసం ఎదురు చూస్తున్న వారి కోసం ఆయన అలాగే ముందుకు సాగారు. షఫీ అనే అభిమాని వర్షంలోనే జగన్‌కు శాలువా కప్పి సన్మానం చేసి సెల్ఫీ దిగారు. ముస్లింలు అధికంగా ఉన్న ఆ ప్రాంతంలో వర్షంలో సైతం తమ చిన్నారులను జగన్‌ వద్దకు పంపి ఆయన తాకితే చాలని పలువురు కోరుకున్నారు.   


Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top