రైతు నోట్లో మట్టి!

రైతు నోట్లో మట్టి! - Sakshi


ఫార్మాకు ‘ఓంకారేశ్వర’ భూములు

389 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు నిర్ణయం

టీఎస్‌ఐఐసీకి దేవాదాయ శాఖ ప్రతిపాదన

రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్లు తొలగింపు

లబోదిబోమంటున్న బాధితులు

జిల్లా కలెక్టర్‌ను కలవనున్న కౌలు రైతులు




ఆలయ భూమి                            1,289  ఎకరాలు

కౌలుకు తీసుకుంటున్న రైతులు         250 మంది

ఫార్మాకు ఇవ్వనున్న భూమి             389  ఎకరాలు

రైతుల పేర్లు తొలగించిన సర్వే నంబర్లు   201, 204, 211

ఫార్మాకు అమ్మితే వచ్చే ఆదాయం        రూ.4కోట్లు




ఇప్పటి వరకు దేవాలయ భూములను కౌలుకు తీసుకొని కుటుంబాలను పోషించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆ భూముల మీదే ఆధారపడ్డారు. కానీ, ఇప్పుడు వాటిలో కొంత భూమిని ఫార్మాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో ఆ కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టినట్టయింది. తమ బాధలను కలెక్టర్‌కు విన్నవించేందుకు వారు సిద్ధమవుతున్నారు.                 –



యాచారం(ఇబ్రహీంపట్నం):  యాచారం మండలం నందివనపర్తి ఓంకారేశ్వర ఆలయ భూములను ఫార్మాసిటీకి తీసుకోనున్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల ప్రతిపాదనల మేరకు భూములను టీఎస్‌ఐఐసీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆలయ పరిధిలో 1,289 ఎకరాల భూములు ఉన్నాయి. నందివనపర్తికి చెందిన పప్పు వెంకయ్య 1910లో పింగళి వెంకటరమణారెడ్డి (అప్పట్లో కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌) వద్ద కొనుగోలు చేసి 1956లో ఓంకారేశ్వర ఆలయానికి అప్పగించారు.



అప్పట్నుంచి ఓంకారేశ్వరాలయ ఆధీనంలో ఉన్న భూములకు పప్పు కుటుంబ సభ్యులు ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు. ఈ భూముల్లో ఆయా గ్రామాలకు చెందిన దాదాపు 250 మంది రైతులు కొన్నేళ్లుగా సాగు (కౌలు) చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. కౌలు రైతులతో పాటు దేవాలయ ఉత్సవాల్లో  శ్రమించే వివిధ కులవృత్తుల వారు కూడా సాగులో ఉన్నారు. కౌలు రైతుల నుంచి వచ్చే ఆదాయంతో ఓంకారేశ్వరుడికి నిత్యం ధూప, దీప, నైవేద్యాలు, ఏటా ఆలయ ఉత్సవాలకు వెచ్చించాలనే నిబంధన ఉంది.



ఈ క్రమంలో ఆలయ అభివృద్ధికి ఆర్థిక వనరుల కోసం ఆలయ భూములను ఫార్మాకు విక్రయించాలని అధికారులు టీఎస్‌ఐఐసీ శాఖకు ప్రతిపాదనలు పంపారు. సర్వే నంబరు 201, 204, 211లలోని సుమారు 389 ఎకరాల భూములను ఫార్మాకు ఇవ్వనున్నారు. భూములను ఫార్మాకు విక్రయిస్తే వచ్చే రూ.4 కోట్లతో ఆలయాన్ని సుందరంగా అభివృద్ధి చేయడం, మిగిలిన డబ్బులను బ్యాంకులో జమ చేసి ప్రతి నెలా వచ్చే వడ్డీతో ఓంకారేశ్వరుడికి నిత్యం ధూప, దీప, నైవేద్యాలు, ఉత్సవాలు జరపాలని అధికారులు యోచిస్తున్నారు.   



రెవెన్యూ రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్ల తొలగింపు

నస్దిక్‌సింగారం, నందివనపర్తి, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల్లో 148 నుంచి 551 వరకు ఉన్న సర్వే నంబర్లలో దాదాపు 800 ఎకరాల్లో రైతులు ఏళ్లుగా కౌలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. రాళ్లు, రాప్పలు తొలగించి ఆ భూములను సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు. అయితే రైతులు సక్రమంగా కౌలు చెల్లించడం లేదనే సాకుతో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు రికార్డుల్లోంచి కౌలు రైతుల పేర్లను తొలగించాలని రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పెట్టారు.



దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారుల సూచన మేరకు రైతు సమగ్ర సర్వేలో కూడా కౌలు రైతుల పేర్లను నమోదు చేయలేదు. తమకు మళ్లీ ఆ భూములపై సర్వ హక్కులు కల్పించాలని రైతులు రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావును కోరనున్నట్లు తెలిసింది. ఇదే విషయమై నందివనపర్తి ఓంకారేశ్వరాలయ ఈఓ శశిధర్‌ను సంప్రదించగా 389 ఎకరాల ఆలయ భూములను ఫార్మాసిటీకి విక్రయించడానికి నిర్ణయించింది వాస్తవమేనని అన్నారు.





భూములు లాక్కుంటే ఆత్మహత్యలే శరణ్యం

ఏళ్లుగా ఓంకారేశ్వరాలయ భూముల్లోనే సాగుచేసుకుని జీవనోపాధి పొందుతున్నాం. మా బతుకులకు ఆ భూములే ఆధారం. కౌలు చట్టం ప్రకారం భూములు  మాకే దక్కుతాయని అనుకున్నాం. కానీ రెవెన్యూ రికార్డుల్లోంచి మా పేర్లను పూర్తిగా తొలగించడం అన్యాయం. ఆ భూములు తీసుకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం.  కౌలు చెల్లిద్దామన్నా అధికారులు రావడం లేదు.      – దార నర్సింహ, కౌలు రైతు నస్దిక్‌సింగారం



ఆ భూములెప్పటికీ ఓంకారేశ్వరుడివే

మా తండ్రి పప్పు వెంకయ్య 1910 లో కొనుగోలు చేసి దేవాలయానికి చెందేటట్లుగా 1956లో వీలునామా రాశారు. రైతులు కౌలు చేసుకుని జీవనోపాధి పొందడమే కానీ ఆలయ భూములు వారికి చెందవని నింబంధన ఉంది. రైతులు సక్రమంగా కౌలు చెల్లించడం లేదు. అప్పులు చేసి ఏటా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఉంది.

– పప్పు కృష్ణమూర్తి, ఓంకారేశ్వరాలయ ధర్మకర్త



రైతుల పేర్లు తొలగింపు నిజమే

దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రతిపాదనలు.. రెవెన్యూ శాఖ ఆదేశాల మేరకు ఓంకారేశ్వరాలయ భూములపై రికార్డుల్లో ఉన్న కౌలు రైతుల పేర్లను తొలగించింది వాస్తవమే. రైతుల పేర్లు తొలగించి ఓంకారేశ్వరస్వామి అని నమోదు చేశాం. సర్వే నంబరు 210, 204, 211లలోని దేవాలయ భూమిని ఫార్మాసిటీకి తీసుకోవడానికి టీఎస్‌ఐఐసీ అధికారులు పరిశీలించినట్లు సమాచారం ఉంది.

– పద్మనాభరావు, తహసీల్దార్‌ యాచారం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top