సాఫీగా సాగిపోవాలి

సాఫీగా సాగిపోవాలి - Sakshi


ట్రాఫిక్ చిక్కులు లేకుండా మెట్రో ఆర్‌ఓబీల నిర్మాణం

శరవేగంగా అసెంబ్లీ, నాంపల్లి మెట్రో స్టేషన్ల నిర్మాణం

ఖైరతాబాద్ స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్‌దారుల రీడిజైన్‌కు ఆదేశాలు..


 సాక్షి, హైదరాబాద్ :  నగరంలో రైలు ఓవర్‌బ్రిడ్జీలు నిర్మిస్తున్న ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా 17 అడుగుల మేర రహదారి ఉండేలా ఏర్పాట్లు చేయాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి,ట్రాఫిక్ డీసీపీ జితేందర్ ఆదేశించారు.  మంగళవారం మలక్‌పేట్ వద్ద ఆర్‌ఓబీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నాంపల్లి, లక్డికాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మెట్రో నిర్మాణం పనులు, ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించారు.


మెట్రో నిర్మాణం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఇనుప రేకులతో బార్‌కేడింగ్ చేయాలని, పైనుంచి నిర్మాణ సామాగ్రి జారి రహదారిపై పడకుండా పడకుండా జాలీని ఏర్పాటు చేయాలని సూచిం చారు. మెట్రో పనుల కారణంగా దెబ్బతిన్న రహదారులను 15 రోజుల్లోగా పునరుద్ధరించాలన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణం నేపథ్యంలో స్థానిక ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కున్న పార్కింగ్ ఏరియాను తక్షణం ఖాళీ చేయాలని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి కోరారు. పుత్లీబౌలి జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ లోనికి, బయటికి వెళ్లే దారుల పనులు జరుగుతున్నందున ఈ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు.


నాంపల్లి తాజ్ ఐస్‌క్రీం జంక్షన్ వద్ద ఎలిఫెంట్ నాలాను దారిమళ్లించి మెట్రో పిల్లర్ నిర్మాణాలను చేపట్టాలని, నాంపల్లి మెట్రో స్టేషన్ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేయాలని ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సూచించారు.


నాంపల్లి వద్ద ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలగకుండా పనులు నిర్వహించాలన్నారు.


పబ్లిక్‌గార్డెన్ ఎదురుగా నిర్మించనున్న అసెంబ్లీ మెట్రో స్టేషన్ నిర్మాణానికి మిగిలిన రెండు పిల్లర్ల నిర్మాణం పనులను తక్షణం పూర్తిచేయాలని ఎల్‌అండ్‌టీని ఆదేశించారు. ఈ స్టేషన్ నిర్మాణం పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించాలన్నారు.


లక్డికాపూల్ మెట్రో స్టేషన్ వద్ద నిల్వ ఉంచిన నిర్మాణ సామాగ్రిని తక్షణం తొలగించాలని, బార్‌కేడింగ్ ప్రాంతాన్ని తగ్గించడం ద్వారా ట్రాఫిక్ చిక్కులు తొలగించాలన్నారు.


ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లోనికి చేరుకునే ఎంట్రీ,ఎగ్జిట్ మార్గాలను రీడిజైన్ చేయాలని ఆదేశించారు.  ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద వర్షపునీరు నిలవకుండా వరదనీటి కాల్వను నిర్మించాలని, సీవర్ లైన్‌ను దారిమళ్లించాలని ఆదేశించారు.


 కార్యక్రమంలో మెట్రో ప్రాజెక్టు డెరైక్టర్ ఎంపీనాయుడు, జియాఉద్దీన్, మున్నాకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top