చేంజ్‌..


సాక్షి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ బాధ్యతల నుంచి జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి రిలీవ్‌ అయ్యారు. జేసీ హోదాలో జిల్లా స్థాయిలో చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నందున మున్సిపాలిటీ విధుల నుంచి ఆయనను రిలీవ్‌ చేయాలని పురపాలకశాఖ డైరెక్టరేట్‌ (సీడీఎంఏ)కు కలెక్టర్‌ డాక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ లేఖ రాశారు. మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌గా హౌసింగ్‌ పీడీకి బాధ్యతలు అప్పగించాలని సైతం లేఖలో పేర్కొన్నారు. స్పం దించిన పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీదేవి కూడా కలెక్టర్‌ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఫ్యాక్స్‌ ద్వారా ఉత్తర్వులు పంపారు. ఈ మేరకు నారాయణరెడ్డి సోమవా రం మున్సిపాలిటీ అదనపు కమిషనర్‌ అరుణకుమారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ అయ్యారు. మరోవైపు పూర్తిస్థాయి ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌గా హౌ సింగ్‌ పీడీ రాజ్‌కుమార్‌ నేడో, రేపో బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.



7న లేఖ... 13న రిలీవ్‌

కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఈ నెల ఏడో తేదీన జేసీ నారాయణరెడ్డిని నల్లగొండ మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయాలని సీడీఎంఏకు లేఖ రాశారు. జాయింట్‌ కలెక్టర్‌ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, సమన్వయ బాధ్యతలతోపాటు అనేక శాఖలు, సంస్థల కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. రెవెన్యూ, పౌరసరఫరాలు, టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని వెల్లడించారు. గ్రేడ్‌–1 మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ పరిధిలో ప్రతి రోజూ నిర్వహించాల్సిన కార్యక్రమాలు కూడా అదే స్థాయిలో ఉండడంతో జేసీపై అదనపు పనిభారం పడుతోందని వివరించారు.



మున్సిపాలిటీలో జనన, మరణ «ధ్రువీకరణ పత్రాల జారీ నుంచి ఎల్‌ఆర్‌ఎస్, భవన నిర్మాణ, నల్లా అనుమతులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలను రోజువారీగా పర్యవేక్షించాల్సి ఉంటుందని, ఈ పనులు వాయిదా వేసేవి కావని లేఖలో వివరించారు. ప్రభుత్వ పథకాలను నిర్ణీత కాలంలో అమలు చేయాల్సిందేనని సీఎం కేసీఆర్‌ చెబుతున్న నేపథ్యంలో జిల్లాలోని రెవెన్యూ వ్యవహారాలు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల అమలు, పలు ప్రాజెక్టుల భూసేకరణ వ్యవహారాలను జేసీ చూసుకోవాల్సి ఉంటుందన్నారు.



ఇప్పటికే జేసీ నారాయణరెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థకు ఇన్‌చార్జి అధికారిగా, డాక్టర్‌ కేఎల్‌ రావ్‌ సాగర్, ఏఎమ్మార్పీ ప్రాజెక్టులకు భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కూడా లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో తాను జేసీని నల్లగొండ మున్సిపల్‌ బాధ్యతల నుంచి ఉపసంహరించుకుంటున్నానని ఈనెల 7న సీడీఎంఏకు లేఖ రాశారు. వెంటనే స్పందించిన పురపాలక శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌. టీకే.శ్రీదేవి కూడా కలెక్టర్‌ ప్రతిపాదనను ఆమోదిస్తూ ఫ్యాక్స్‌ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో జేసీ నారాయణరెడ్డి సోమవారం అధికారికంగా బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. పీడీ రాజ్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరించేంత వరకు మున్సిపాలిటీ అదనపు కమిషనర్‌ సీహెచ్‌.అరుణకుమారిని ఇన్‌చార్జిగా నియమించారు.  



చాలా తక్కువ సందర్భాల్లోనే..

జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలపై జిల్లా కలెక్టర్‌కు రాజ్యాంగపరమైన అధికారాలున్నా.. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న లేదా ఇన్‌చార్జి బాధ్యతలో ఉన్న అధికారులను ఆ బాధ్యతల నుంచి రిలీవ్‌ చేయడం, దాన్ని ఆమోదించాలని సదరు శాఖ డైరెక్టర్‌కు కలెక్టర్‌ లేఖ రాయడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంది. నల్లగొండ మున్సిపాలిటీ విషయంలో కూడా అదే జరిగింది. అయితే.. జేసీ నారాయణరెడ్డి జిల్లాలో బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే చురుకైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, ఉద్యోగుల సమన్వయం వంటి బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.  కలెక్టర్‌ ఉప్పల్‌ సైతం జెట్‌స్పీడ్‌తో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. కలెక్టర్, జేసీలు సమన్వయంతో నిర్వహించాల్సిన ప్రణాళికలు చాలా ఉన్నందున ఉప్పల్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అధికార వర్గాలంటున్నాయి.  

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top