ఓ వైపు మోదం.. మరోవైపు ఖేదం


  • ఖేడ్‌ డివిజన్‌గా ఏర్పాటుపై సంతోషం

  • నాగల్‌గిద్దపై శీతకన్నుతో కినుక

  • పేట జిల్లా మారడంతో జనంలో ఆందోళన

  • నారాయణఖేడ్‌: జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియ ముసాయిదాను ప్రభుత్వం విడుదల చేసిన దరిమిళా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని ప్రజల్లో ఓవైపు మోదం.. మరోవైపు ఖేదం అన్న పరిస్థితి నెలకొంది. కొంత సంతోషం ఉన్నా మరికొంత బాధనూ ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


    ప్రభుత్వం ప్రాభీష్టానికే పెద్దపీట వేస్తూ విభజన ప్రక్రియ చేపడుతున్నా ఇందులో రాజకీయ కోణమూ నెలకొందంటూ ఓ మండల వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన పునర్వభజన ముసాయిదా ప్రకారం పరిశీలిస్తే.. సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్‌ నియోజకవర్గాన్ని కలుపుతూ రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.


    ఈ డివిజన్‌ కింద నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, మనూరు.. కొత్తగా ఏర్పాటు అవుతున్న సిర్గాపూర్‌ మండలాలను కలుపుతూ డివిజన్‌ ఏర్పాటు కాబోతోంది. కాగా పెద్దశంకరంపేట మండలం నియోజకవర్గంలో ఉండగా దీన్ని విడదీసి మెదక్‌ జిల్లాలో కలుపుతున్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు కేవలం సంగారెడ్డి జిల్లానే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది.


    విద్య, వైద్య, వ్యాపారం, రవాణా, నివాసాల పరంగా సంగారెడ్డితోనే ప్రాంత ప్రజలకు సంబంధాలు ఉన్నాయి. చాలా మంది సంగారెడ్డిలో నివాసాలు సైతం నిర్మించుకున్నారు. తమ పిల్లలను సంగారెడ్డిలో చదివిస్తున్నారు. హైదరాబాద్‌ సైతం దగ్గర కావడం, రవాణా పరంగా అనుకూలంగా ఉంది. కానీ ఈ మండలాన్ని మెదక్‌ నియోజకవర్గంలో కలుపుతున్నారు.


    ఈ మండల ప్రజలకు ఈ నిర్ణయం గొంతులో వెలక్కాయ పడ్డ చందంగా మారింది. సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం, తమకు అనుకూలంగా లేని మెదక్‌లో విలీనం వల్ల అభివృద్ధి పరంగా వెనుకబడి పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేట మండలం మెదక్‌ నియోజకవర్గంలో కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఖేడ్‌లో కలిపారు.


    రాజకీయంగా ఆ మండల వాసులు ఎదిగేందుకు ఖేడ్‌లో ఉంటే అనుకూలం కాదని, మెదక్‌లో ఉంటే భవిషత్‌లో నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు అయితే పదవి పొందేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారని, ఈ కారణంగానే పేటను మెదక్‌లో కలిపారని ఆ మండలానికి చెందిన పలువురు ఆక్రోశిస్తున్నారు.


    ఇదిలా ఉంటే మనూరు మండలం తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మండలం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద రెండో మండలంగా కొనసాగింది. మన రాష్ట్రంలో అతిపెద్ద మండలంగా ఉన్న మనూరులో 45 గ్రామాలు, 90 గిరిజన తండాలు ఉన్నాయి. 56 వేల పైగా జనాభా ఉంది. ఈ మండలంలో నాగల్‌గిద్దను మండలంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఏళ్ళుగా ఉంది.


    ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు సైతం మండలం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ డ్రాఫ్ట్‌లో నాగల్‌గిద్దకు చోటు లేకపోవడంతో ఈ మండల వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జనాభా తగ్గుతుందన్న వంక చూపుతూ నాగల్‌గిద్దను మండలం చేయడంలేదని, కానీ అసలు కారణం వేరే ఉందని కొందరు గుస గుసలాడుతున్నారు.


    మండలానికి అనుకూలంగా ఉన్న ఇతర మండలంలోని ఒకటి రెండు గ్రామాలను తీసుకొని నాగల్‌గిద్దను మండలంగా చేసేందుకూ వీలు ఉందని పేర్కొంటున్నారు. మనూరు మండలం పునర్విభజన అవసరం. ఇక రేగోడ్‌ను ఖేడ్‌ డివిజన్‌లో విలీనం చేస్తారని ముందు భావించినా ఆ మండలం మెదక్‌ డివిజన్‌లోకి వెళ్ళిపోయింది. మొత్తం మ్మీద నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కావడం ప్రాంత వాసుల్లో సంతోషాన్ని వెల్లివిరుస్తుంది. నాగల్‌గిద్దను మండలం చేయడంతోపాటు, పేటను సంగారెడ్డి జిల్లాలో ఉంచాలన్న డిమాండ్‌ జనాల నుంచి వ్యక్తమవుతోంది.

     

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top