నాడా... దడ..?

నాడా... దడ..?

  • అన్నదాతల్లో ఆందోళన

  • అమలాపురం/ఉప్పలగుప్తం :

    ఖరీఫ్‌ కోతలు ముగుస్తున్న సమయంలో మారిన వాతావరణం అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘నాడా’తుపాను ప్రభావం తో జిల్లాలోనూ భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడం, అందుకు తగినట్టుగానే గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం మారిపోవడంతో అన్నదాతల గుండెల్లో గుబులు రేగుతోంది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావం లేకపోవడం వల్ల ఖరీఫ్‌కు భారీ వర్షాలు, తుపాను ముప్పుతప్పిందని రైతులు భావించారు. జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగితే ఇప్పటి వరకు సుమారు 70 శాతం పంట పొలాల్లో కోతలు పూర్తయ్యాయి. తూర్పు డెల్టాలో కరప, కాజులూరు, మధ్య డెల్టాలో ముమ్మిడివరం,  అమలాపురం, పి.గన్నవరం, రాజోలు సబ్‌ డివిజ¯ŒSల్లో కేవలం 50 శాతం మాత్రమే కోతలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తి కావాల్సి ఉంది. ఆసలు అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు కోతలు, నూర్పుడులు పూర్తి కావాల్సి ఉండగా, పెద్ద నోట్ల రద్దుతో ఆలస్యమైంది. రైతులకు చిల్లర దొరక్కపోవడం, పెద్దనోట్లు ఇచ్చుకునేందుకు కూలీలు ముందుకు రాకపోవడం వంటి కారణాల వల్ల కోతలు ఆలస్యమయ్యాయి. చాలాచోట్ల కోతలు కోయించిన రైతులు పంటను పనల మీదనే ఉంచారు. ఈ సమయంలో ‘నాడ’ తుపాను వల్ల వాతావరణం మారిపోయింది. తుపాను ప్రభావం తమిళనాడుపై ఉన్నా దీని కారణంగా కోస్తాంధ్రాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కర్షకులను ఉరుకులుపరుగులు పెట్టిస్తోంది. దీంతో చాలా మంది రైతులు పనలను ఒబ్బిడి చేసే పనిలో పడ్డారు. మరికొంతతమంది ధాన్యాన్ని కల్లాల్లో భద్రపరుస్తున్నారు.

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top