చంపుతాడనుకుని చంపేశాం..

చంపుతాడనుకుని చంపేశాం.. - Sakshi


చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు నగరంలోని ఆషాడం వీధిలో పది రోజుల క్రితం హత్యకు గురైన వేలూరు యువకుడు అఫ్రోజ్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులు పి.రాజ (26), కె.శరవణ (35), ఆర్‌.బాలాజి (42)ని స్థానిక టూటౌన్‌ పోలీసులు శుక్రవారం తోటపాళ్యం వద్ద అరెస్టు చేశారు. డీఎస్పీ ఎన్‌.సుబ్బారావు, సీఐ కె.వెంకటప్ప విలేకరులకు వివరాలు వెల్లడించారు. వేలూరుకు చెందిన అఫ్రోజ్‌ గత నెల చిత్తూరుకు వచ్చి వెల్డింగ్‌ పనులు చేస్తున్నాడు. రంగాచ్చారివీధిలో కాపురముంటున్న విజయ్, అఫ్రోజ్‌ స్నేహితులు. ఓ రోజు విజయ్‌ తన భార్య శిరీషను కొడుతుండగా పక్కింట్లో ఉన్న రాజా అడ్డుకున్నాడు.



దీంతో అఫ్రోజ్‌ తనకొచ్చిన చేతబడి ద్వారా చంపేస్తానంటూ రాజాను పలుమార్లు బెదిరించాడు. రాజా ఇంటి ముందు నిమ్మకాయలు విసరడం లాంటివి చేశాడు. దీంతో తనను అఫ్రోజ్‌ చంపేస్తాడోనని భావించిన రాజా తన స్నేహితులైన సత్యనారాయణపురానికి చెందిన శరవరణ, రంగాచ్చారివీధికి చెందిన బాలాజీతో కలిసి అఫ్రోజ్‌ను హత్య చేయాలని పథకం పన్నారు. ఈ నెల 9వ తేదీన వాహనంలో వెళుతున్న అఫ్రోజ్‌ను ఆషాడం వీధి వద్ద ఆపి కత్తితో పొడిచి హత్య చేసి పారిపోయారు. తనను గుర్తుపట్టకుండా ఉండటానికి రాజా తిరుమల వెళ్లి గుండు గీయించుకున్నాడు. పోలీసులు వీరి కదలికలపై నిఘా ఉంచి అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు రవిప్రకాష్‌రెడ్డి, ఉమామహేశ్వర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top