గాడి తప్పిన దర్యాప్తు !

గాడి తప్పిన దర్యాప్తు !

శ్రీగౌతమి మరణం కేసులో జవాబులేని ప్రశ్నలు ఎన్నో

పోలీసుల తీరుపై అనుమానం

ఫొటోలు, బిల్లులు మాయం చేశారా?

అధికార పార్టీ నేతకు సాగిలపడ్డారా?

 

 

 

సాక్షి ప్రతినిధి, ఏలూరు, నరసాపురం : 

రోడ్డు ప్రమాదంలో మరణించిన నరసాపురం పట్టణానికి చెందిన విద్యార్థిని శ్రీగౌతమిది హత్యా? ఆమెను పథకం ప్రకారమే హత్య చేశారా? ఈ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రమేయం ఉందా? పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టించారా? ప్రమాదం జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు, మృతురాలి చెల్లెలు ప్రత్యక్ష సాక్షి పావని కథనం చూస్తే అవుననే సమాధానం వస్తోంది.  ఈ ఉదంతంలో జవాబులేని ప్రశ్నలెన్నో ఈ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి.  

అసలేం జరిగిందంటే 

ఈనెల 18న బుధవారం రాత్రి 8.30 గంటలు దాటిన తరువాత పాలకొల్లు రూరల్‌ పరిధిలోని దిగమర్రు కొత్తోట పంచాయతీ పరిధిలో నరసాపురంపాలకొల్లు రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసాపురానికి చెందిన శ్రీగౌతమి మరణించింది. అప్పటి నుంచి ఈ ప్రమాదం వెనుక ఏదో రహస్యం దాగిఉందనే ప్రచారం జరిగింది. పోలీసుల దర్యాప్తు తీరుపై కూడా అనుమానాలకు తావిచ్చింది.  ఘటన జరిగి నాలుగు రోజులు దాటినా ఇంత వరకూ పోలీసులు ఈ మిస్టరీని ఛేదించ లేకపోవడం, అంతా గోప్యంగా ఉంచడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. అసలు ప్రమాద దర్యాప్తు పూర్తిగా గాడి తప్పిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రి పనిపై పాలకొల్లు వెళ్లిన అక్కా, చెల్లి శ్రీగౌతమి, పావని స్కూటర్‌పై నరసాపురం వస్తుండగా, వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శ్రీగౌతమి అక్కడిక్కడే దుర్మరణం పాలైంది. పావని నరసాపురంలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొంది ఆదివారమే డిశ్చార్జి అయ్యింది. తొలుత ఈ ప్రమాదంపై భిన్నకథనాలు వినిపించాయి. మద్యం మత్తులో టీజ్‌ చేస్తూ,  వెంబడించి మరీ కారుతో ఢీకొట్టి చంపేశారనే వార్తలు వచ్చాయి. అయితే కారులో డ్రైవర్‌తోపాటు కొందరు ఉన్నారని , కారు స్కూటర్‌ను ఢీకొట్టిన తర్వాత కాలువలోకి దూసుకెళ్లిందని, కారులో ఉన్నవారు  ఈదుకుంటూ అవతలి వైపునకు వెళ్లిపారిపోయారని ప్రచారం జరిగింది. ప్రాథమిక దర్యాప్తు మేరకు కారులో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడని పోలీసులు తేల్చడం అనుమానాలను మరింత పెంచింది. 

 

 జవాబులేని ప్రశ్నలు...

ప్రమాదంలో మృత్యువు నుంచి త్రుటిలో బయటపడిన పావని  మీడియా ముందు మాట్లాడుతూ తమను కారులో కొందరు వెంబడించాని, కారు స్కూటర్‌ను ఢీకొట్టిన తరువాత తాను కారుపై పడ్డానని, కొంతదూరం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారని చెప్పింది. దీంతో కారులో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నాడని పోలీసులు దాదాపుగా నిర్ధారణకు రావడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాదానికి కారణమైన కారు, విశాఖపట్నానికి చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. భీమవరం కిరాయికి వచ్చాడని చెబుతున్నారు. భీమవరం కిరాయికి వచ్చిన వ్యక్తి, నరసాపురం వైపు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనే దానిపై స్పష్టతలేదు. కారులో మిగిలిన వ్యక్తులు ఏమయ్యారనే విషయాన్ని కూడా గాలికొదిలేశారు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు ఐతే (కారులో మరికొందరు ఉన్నా.. డ్రైవర్‌ ఒక్కడే ఉన్నా)  యాక్సిడెంట్‌ చేసి ఏలా పరారయ్యారనేది మరో ప్రశ్న. నిత్యం ప్రమాదం జరిగిన రహదారి రద్దీగా ఉంటుంది. అదీ పండగరోజుల్లో రాత్రి 9 గంటలలోపు ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా మద్యం మత్తులో ఉంటే వారిని , జనం పట్టుకోవడం పెద్దకష్టం కాదు. దీనిని బట్టి చూస్తుంటే పథకం ప్రకారం అక్క చెల్లెళ్ళ కదలికలు చూసి వెంబడించి హత్య చేశారా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి కారణమైన కారు వైజాగ్‌కు చెందినది. శ్రీగౌతమి విశాఖపట్నంలోనే సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటుంది. ప్రమాదానికి కారణమైన కారు, ఆప్రాంతానికే చెందినది కావడం యాదృచ్ఛికమేనా? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. తమను హత్య చేయాలని చూశారని పావని చేసిన ఆరోపణలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 

టీడీపీ నేత కుటుంబ ప్రమేయం!

ఈ కేసులో స్థానిక తెలుగుదేశం నాయకుడి భార్యకు సంబంధం ఉందని మృతురాలి చెల్లెలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. పావని చెబుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేత సజ్జా బుజ్జి  శ్రీగౌతమిని పెళ్లి చేసుకున్నాడా లేదా అన్న అంశం పక్కన పెడితే అతని కారణంగానే శ్రీగౌతమి హత్య జరిగిందన్నది స్పష్టంగా కనపడుతోంది. పావని పోలీసులకు ఇచ్చినట్లు చెబుతున్న సజ్జా బుజ్జి, గౌతమిల పెళ్లి ఫొటోలు, ఆస్పత్రి బిల్లులను మాయం చేసి ఈ కేసును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఘటనలో బుజ్జి ప్రమేయం లేకపోయినా, అతని భార్య వల్ల తాను ఇరుక్కునే అవకాశం ఉండడంతో పైస్థాయిలో పెద్దఎత్తున ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం హత్య జరిగిందా? , ఇక్కడివారు వైజాగ్‌కు చెందిన కిరాయి హంతకులను పురమాయించారా? లేక అక్కడివారే హత్య చేశారా? అనే విషయాలను పోలీసులే తేల్చాలి. మరి పోలీసులు ఈ కేసును ప్రమాదంగా చూపించి మూసేస్తారా? లేక హంతకులను గుర్తిస్తారా అన్నది వేచి చూడాలి.  

 

 

 

 

 

 

 

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top