స్నేహితుడే నాకు ప్రేరణ


తొలి ప్రయత్నంలోనే విజయం వచ్చేలా కష్టపడాలి

యువతకు కమిషనర్ హరినారాయణన్ సూచన

 

 సీతంపేట:  ‘నా స్నేహితుడు చెప్పిన మాటలే నేను ఐఏఎస్ అవడానికి ప్రేరణ నిలిచాయి’ అని జీవీఎంసీ కమిషనర్ ఎం.హరినారాయణన్ అన్నారు. సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో ‘యువతకు అవకాశాలు- సవాళ్లు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.

 

మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలన్న పట్టుదలతో కృషి చేయాలని, రెండోసారి ప్రయత్నిద్దామన్న ఆలోచన ఉండకూడదని ఆయన అన్నారు. తన తండ్రి ఆర్కిటెక్ట్ చదవమని కాలేజ్‌లో చేర్పించారని, అది నాకు ఇష్టం లేక ఐఏఎస్ చదువుతానని తన తండ్రిని కోరానన్నారు. అయితే ఒక్క చాన్స్ మాత్రమే ఇస్తానని, సెలెక్ట్ కాకుంటే అంతటితో ఐఏఎస్ వదిలిపెట్టేయాలని త న తండ్రి షరతు పెట్టారన్నారు.

 

పట్టుదలతో తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ కాగలిగానన్నారు. ఐఏఎస్ కావాలంటే 16 గంటలు, 18 గంటలు చదవాలని ఏమీ లేదన్నారు. ఎంతసేపు  చదివామన్నది కాకుండా క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ముఖ్యమన్నారు.

 

లక్ష్యం కోసం యువత సినిమాలు, షికార్లు, స్నేహితులతో ముచ్చట్లు వంటి చిన్నచిన్న సరదాలు వదులుకోనక్కరలేదన్నారు. ఎవరితోనూ పోల్చుకోవద్దని హితవు పలికారు. ఏ ఇద్దరి సామర్ధ్యాలు ఒక్కలా ఉండవన్నారు. ఇంటర్వ్యూల్లో  నిజాయితీగా సమాధానాలు చెప్పాలన్నారు. అనంతరం విద్యార్ధులు నగరంలో ఫ్లైవోవర్, వాటర్, శానిటేషన్‌పై అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో సెంటర్ ఫర్ పాలసీ డెరైక్టర్  ఎ.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top