హత్య కేసు నిందితుడి అరెస్టు


అగళి(మడకశిర): అగళి మండలం ఆర్‌.జి.పల్లిలో గొల్ల రంగమ్మ(35)ను హత్య చేసిన కేసులో అనుమనపల్లికి చెందిన పూజారి రంగప్పను మంగళవారం అరెస్టు చేసినట్లు సీఐ దేవానంద్‌ తెలిపారు. అగళి, రొళ్ల ఎస్‌ఐలు రాంబాబు, నాగన్న, అగళి ఏఎస్‌ఐ ఖలీల్‌బాషాతో కలసి నిందితుడ్ని మీడియా ఎదుట హాజరుపరిచారు. గొల్ల రంగమ్మను ఈ నెల 16న అత్యంత దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. హత్యకు గల కారణాలను నిందితుడు తమ విచారణలో అంగీకరించాడని సీఐ తెలిపారు. ఆయన కథనం ప్రకా రం... రంగమ్మ భర్త మైసూర్‌లో గొర్రెల కాపరిగా పనికి కుదిరాడు. వారి కుమారుడు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లాడు.



ఒంటరిగా ఉంటున్న రంగమ్మ సైతం ఇటుకల తయారీకి వెళ్లేది. ఈ క్రమంలో అనుమనపల్లికి చెందిన పూజారి రంగప్పతో పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే కొన్నాళ్ల తరువాత మనసు మార్చుకున్న ఆమె అతన్ని దూరం ఉంచుతూ వచ్చింది. ఇక నుంచి రావొద్దంటూ ఆమె ఈ నెల 16న గట్టిగా చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయిన రంగప్ప బండరాయితో హత్య చేశాడు. ఆ తరువాత ఇంటిలోని బీరువాలో నుంచి రూ.30 వేల నగదు, చెవి కమ్మలను ఎత్తుకెళ్లాడు. హతురాలి కుమారుడు ఉమేశ్‌ ఫిర్యాదు మేరకు రంగప్పపై దృష్టి పెట్టిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆ హత్య తానే చేశానంటూ అంగీకరించాడని సీఐ తెలిపారు. నిందితుడ్ని కోర్టులో హాజరుపరచగా, 15 రోజుల పాటు రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని వివరించారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top