బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం..స్టైలో

బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం..స్టైలో - Sakshi


► బంజరు భూములు,పండ్లతోటల సాగుకు అనుకూలం

ఎకరం సాగులో 50 గొర్రెలకు,ఏడాది పాటు మేత

స్టైలో విత్తనాలకు 75 శాతం ప్రభుత్వ సబ్సిడీ




కొందుర్గు(షాద్‌నగర్‌): స్టైలో బహువార్షిక పప్పుజాతి పశుగ్రాసం సాగు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. బంజర భూములు, పండ్లతోటలు, తేలిక, ఇసుక నేలలు, వ్యవసాయానికి పనికిరాని పొలాల్లో దీన్ని సాగుచేసుకోవచ్చు. అత్యల్ప వర్షాలకు కూడా గడ్డి సాగు చేసుకోవచ్చు. బంజర భూములు, తోటలలో సాగుచేయడం వల్ల భూసారం పెరుగుతుంది.



స్టైలో రకాలు.. సాగు పద్ధతి

స్టైలో పప్పుజాతి గడ్డిలో స్టైలో హెమాటా, స్టైలో స్కబ్రా, స్టైలో జెనెసిన్‌ రకాలు ఉంటాయి. వర్షాధారం అయితే జూన్, జులై మాసాల్లో సాగు చేయాలి. నీటిపారుదలతో అయితే ఫిబ్రవరి, మార్చి మాసాల్లో సాగుచేసుకోవచ్చు. సాదారణ నేలలో అయితే ఎకరాకు 10 కిలోల విత్తనాలు, తోటలలో అయితే 4 నుంచి 5 కిలోల విత్తనాలు సరిపోతాయి. విత్తనాలు విత్తేముందు 85 డిగ్రీ సెంటిగ్రేట్‌ వేడి నీటిలో 5 నిమిషాలు ఉంచి ఆరబెట్టాలి. దుక్కిని చదునుచేసి నేలలో ఒక సెంటీమీటర్‌ లోతులోనే విత్తనాలు పడేట్లుగా ఎదచల్లాలి. అనంతరం విత్తనాలపై మట్టి పడేలా చేయాలి. స్టైలో పశుగ్రాసం సాగు చేయడానికి ఎరువులు అవసరం లేదు. ఎకరం సాగు చేస్తే ఏడాది వరకు 50 గొర్రెల మేతకు సరిపోతుంది.



ఏడాదిలో 8 నుంచి 10 కోతలు

స్టైలో విత్తనాలు సాగుచేసిన అనంతరం 50 రోజుల్లో మొదటిసారిగా కోతకొస్తుంది. ఏడాదిలో 8 నుంచి 10 కోతలు కోసుకోవచ్చు.ఒకసారి సాగుచేస్తే నాలుగు నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. వర్షాకాలంలో విత్తనాలు పొలంలో రాలే విధంగా గడ్డిని కోసుకుంటే మరుసటి ఏడాది గడ్డి విస్తారంగా పెరిగే అవకాశం ఉంటుంది.పాడిపశువులకు ఈ పశుగ్రాసాన్ని రోజుకు 2 కిలోల చొప్పున ఇతర మేతలతో కలిపి వేయాలి.


స్టైలో పశుగ్రాసంలో జీర్ణమయ్యే మాంసకృత్తులు 12.15 శాతం, శక్తినిచ్చే పోషకాలు 60 శాతం, కార్బోహైడ్రెట్స్‌ 2 శాతం ఉంటాయి. ఈ మేతతో గొర్రెలు, మేకలు, పాడిపశువులకు ఆరోగ్యకరంగా ఉంటుంది. పాడిపశువులు సమృద్ధిగా పాలిస్తాయి.ప్రభుత్వం స్టైలో విత్తనాలను 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తోంది. ఈ పశుగ్రాసం సాగు చేయడానికి ఇష్టపడుతున్న రైతుల వివరాలను నమోదు చేసుకుంటున్నాం. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, అటవీ భూములు, బంజరు భూముల వివరాలను సర్వే చేస్తున్నాం.

– డాక్టర్‌ విష్ణువర్ధన్‌గౌడ్, చౌదరిగూడ పశువైద్యాధికారి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top