‘ముల్కనూర్‌’కు స్వర్ణోత్సవ శోభ


  • 60వ వసంతంలోకి అడుగిడుతున్న బ్యాంక్‌ 

  • రూ.270 కోట్ల ఆర్థికలావదేవీలు 

  • ఉత్తమ సేవలకు అవార్డులు

  • ఈనెల 28న మహాసభ

  • భీమదేవరపల్లి : మెట్టప్రాంత రైతులకు భరోసానిస్తూ..నేనున్నానంటూ అండగా నిలుస్తుంది ముల్కనూర్‌ సహకార గ్రామీణ బ్యాంక్‌. ప్రభుత్వ రుణాలతోపాటు బ్యాంక్‌ తరఫున రైతులకు ప్రత్యేకంగా రుణాలు అందిస్తూ ఆర్థికంగా అండగా నిలుస్తూ పలువురి మన్ననలు అందుకున్న బ్యాంక్‌ 59 సంవత్సరాలు పూర్తి చేసుకుని 60 వసంతంలోకి అడుగిడుతుంది.  పంట రుణం కావాలంటే పట్టాదారు బుక్కుతోనే ఎకరాకు రూ.24వేల ఇచ్చి ఆదుకుంటుంది. రూపాయి ఖర్చుతో దరఖాస్తు చేసుకుంటే చాలు ప్రభుత్వ రుణాలు అందించేందుకు బ్యాంకు అన్నీ తానై చూసుకుంటుంది. ఈ స్వర్ణోత్సవ వేళ ప్రత్యేక కథనం.

     

    1956లో 373 మంది రైతులతో..

     1956లో భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో 373 మంది రైతులు, రూ.2300 వాటాధనం, ఒకే ఒక ఉద్యోగితో ప్రారంభమై..అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు 7629 మంది రైతులు.. రూ.16కోట్ల వాటాధనం..127 మంది ఉద్యోగులతో విజయవంతంగా పయణిస్తుంది. రూ.270కోట్ల ఆర్థిక లావదేవీలతో ఈ ఏడాది రూ.4.27కోట్ల లాభాన్ని గడించింది. 

    రూ. కోటి ఉపకరవేతనాలు

    బ్యాంక్‌ సభ్యుల పిల్లలకు ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు అందిస్తోంది. 10 వేల మంది విద్యార్థులకు రూ.కోటి ఉపకర వేతనాలు అందించింది. రైతుల కోసం ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తుంది. హన్మకొండ శరత్‌ లేజర్‌ నేత్ర వైద్యశాల ఆధ్వర్యంలో 658 మంది రైతులకు రూ.74లక్షలతో నేత్ర శస్త్ర చికిత్సలు చేయించింది. రైతుల సౌకర్యార్ధం బ్యాంక్‌ సూపర్‌బజార్‌ ఆవరణలో ప్రత్యేక నేత్ర వైద్యశాలను ఏర్పాటు చేశారు. సభ్యులు మరణిస్తే కుటుంబానికి ఆర్థికసాయంతోపాటు బీమా సౌకర్యం కల్పిస్తుంది. రైతుల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు ముల్కనూర్‌లో ఏకేవీఆర్‌ కళాశాలలను నెలకొల్పి ఇంటర్, డిగ్రీ విద్యను అందుబాటులో తెచ్చింది.

    వివిధ సేవలు

    రైతులకు స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక రుణాలు అందిస్తుంది. వ్యవసాయబావుల తవ్వకానికి, విద్యుత్‌ మోటార్‌ కొనుగోలు, పైపులైన్‌ నిర్మాణం, స్ప్రింక్లర్లు, డ్రిప్‌ ఇరిగేషన్, గొర్రెలు, మేకలు, ట్రాక్టర్, హార్వెస్టర్, వంట గ్యాస్, కోళ్ల పరిశ్రమ, పాడి పశువుల పెంపకం, పండ్ల తోటల పెంపకానికి రుణాలు అందిస్తుంది. భూగర్భజలాల పెంపునకు నాబార్డు సహాయంతో రూ.2.50కోట్ల వ్యయంతో 2,831 హెక్టార్ల భూమిలో వాటర్‌షెడ్‌ పథకాలు అమలు చేస్తుంది. వంగర, ముస్తఫాపూర్, నరహరితండాలో వాటర్‌షెడ్‌ కార్యక్రమాలు అమలు చేస్తుంది.  

    వైఎస్‌ సందర్శన

    ప్రథమంగా సీఎం హోదాలో బ్యాంక్‌ 50 వసంతాల వేడుకలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006 మార్చి 19న ముల్కనూర్‌ బ్యాంక్‌ను సందర్శించారు. అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ సైతం సందర్శించారు. వివిధ దేశాల ప్రతినిధులు, రాష్ట్ర మంత్రులు, పలువురు ఐఏఎస్‌ అధికారులు, ఇతర సహకార సంఘ రైతుల సందర్శనలతో బ్యాంక్‌ సందడిగా ఉంటుంది. 

    ఉత్తమ సహకార సంఘం

    బ్యాంక్‌ సభ్యులకు అందిస్తున్న సేవలకు గతేడాది జాతీయస్థాయిలో ఉత్తమ సహకార అవార్డు లభించింది. బ్యాంక్‌ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి సైతం ఉత్తమ సహకారవేత్త అవార్డు అందుకున్నారు.  బ్యాంక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్గిరెడ్డి కాశీరెడ్డి విశ్వనాథరెడ్డి మరణానంతరం సభ్యుల ప్రోద్బలంతో అధ్యక్షుడిగా విశ్వనాథరెడ్డి తనయుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. రైతులతో చర్చిస్తూ వారి ఆలోచనకనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ బ్యాంక్‌ను అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నారు.  

    రైతులకు సేవచేయాలని

    రైతులకు సేవ చేయాలని ముందుకెళ్తున్నాను. రైతుల సమష్టి కృషితో బ్యాంక్‌ లాభాల బాటలో పయనిస్తుంది. బ్యాంక్‌ 60వ వసంతలోకి అడుగిడుతుంది. ఈ సందర్భంగా పలు తీర్మానాలతో పాటుగా బ్యాంక్‌ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాన్ని సభ్యులకు బోనస్‌గా అందిస్తాం. రైతుల సమష్టి కృషితో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. 

    – అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బ్యాంక్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top