సడలని దీక్ష...

సడలని దీక్ష... - Sakshi

  • రాత్రివేళ కిర్లంపూడిలో ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

  • రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు విరమించేదిలేదు

  • కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ

  • వైద్యపరీక్షలు జరిపించేందుకని వివరణ

  • బాగానే ఉన్నా... పరీక్షలొద్దన్న ముద్రగడ

  • కిర్లంపూడిలో కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు

  • వెల్లువలా సంఘీభావం, జోరుగా పరామర్శలు

  • భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు

  • గ్రామగ్రామాన మార్మోగుతున్న ఖాళీ ప్లేట్ల చప్పుళ్లు

  • రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమవుతున్న ఉద్యమం

  •  

    కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అడుగుడుగునా పోలీసుల పహారా... గ్రామ జనాభాను మించిన సంఖ్యలో రక్షక భటులు... వారి బూట్ల చప్పుళ్లతో పాటు అదరగొట్టే అదిలింపులు బెదిరింపులు... పోలీసులు నిలువరిస్తున్నా ప్రాధేయపడుతూ.. బైఠాయిస్తూ.. తగవుపడుతూ ముందుకే సాగుతున్న జనం... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శనివారంనాటి దృశ్యాలివి....  కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండోరోజుకు చేరుకుంది.


    ముద్రగడ దంపతులను చూడడానికి, పరామర్శించడానికి, సంఘీభావం తెలపడానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘మా ప్రాణాలు పోయినా పర్లేదు. ప్రభుత్వం మా డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించేవరకు దీక్ష విరమించేది లేదు’ అని ముద్రగడ స్పష్టం చేశారు.

     

    వైద్యపరీక్షలు చేయించుకోవడానికి ఆయన అంగీకరించలేదు. శనివారం రాత్రి ముద్రగడ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో కొద్దిసేపు కలకలం చెలరేగింది. బలవంతంగా వైద్యపరీక్షలు జరిపించేందుకు ప్రయత్నించారని, తలుపులు తెరవకపోవడంతో వెనుతిరిగారని తేలింది. మరోవైపు రాష్ర్ట వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉధృతమవుతోంది. ఉభయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ, గుంటూరు, కర్నూలు తదితర జిల్లాలలో పలు రూపాలలో నిరసన ప్రదర్శనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనేక గ్రామాలలో ఖాళీ ప్లేట్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి.

     

    ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు

    రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు ముద్రగడ ఇంటిని చుట్టుముట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీక్షలో ఉన్న ముద్రగడ దంపతులను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తున్నారన్న  ప్రచారంతో కార్యకర్తలు, కాపు ఉద్యమ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి తరలి వచ్చారు. పోలీసుల కంటే ముందుగా దీక్ష చేస్తోన్న గది దగ్గరకు వెళ్లిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ముద్రగడతో మాట్లాడేందుకు ప్రయత్నించారు.

     

    అయితే తలుపులు తీయకపోవడంతో బయట నుంచే మాట్లాడారు. దయచేసి వైద్య పరీక్షలకు సహకరించాలని జేసీ కోరారు. అందుకు ముద్రగడ నిరాకరించారు. తమ ఆరోగ్యం బాగానే ఉందనీ, ఎలాంటి వైద్య పరీక్షలు వద్దని బదులిచ్చారు. దీంతో జేసీ వెనుదిరిగి వెళ్లారు. అనంతరం కొద్దిసేపుటికి సుమారు వందమందికి పైగా పోలీసులు ఒక్కసారిగా వరండాను చుట్టుముట్టారు.

     

    దీన్ని గుర్తించిన ముద్రగడ తలుపులతో పాటు కిటికీలు కూడా మూసేశారు. అరగంట పాటు అక్కడే గడిపిన పోలీసులు చేసేది లేక వెనుదిరిగారు. శనివారం మద్యాహ్నం నుంచి వైద్యపరీక్షలను ముద్రగడ నిరాకరిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్య బృందంతో ఆయన మాట్లాడారు. ‘పొట్టి శ్రీరాములు చాలా రోజులు దీక్ష చేపట్టారు. నాకు ఒక్క రోజులోనే ఏమీ కాదు’ అని వైద్యులతో అన్నారు.

     

    ఆయనకు నచ్చజెప్పేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. చివరకు వైద్య పరీక్షలు చేయకుండానే వెనుదిరిగారు. వైద్యబృందంతో కలిసి పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు సాయంత్రం 3.30 గంటలకు ముద్రగడ వద్దకు మరోమారు వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే ముద్రగడ అంగీకరించలేదు. కాగా ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోందని, 36 గంటలుగా ఆహారం తీసుకోకపోవడంతో బీపీ, సుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని వైద్యులంటున్నారు.

     

    అరెస్ట్ చేయాలని కాదు.. వైద్య పరీక్షల కోసం..

    ముద్రగడను అరెస్ట్ చేసేందుకు లోనికి వెళ్లలేదనీ, వైద్య పరీక్షలు జరిపించేందుకు మాత్రమే  పోలీసులు లోనికి ప్రవేశించారని ఎస్పీ రవిప్రకాశ్ శనివారం రాత్రి మీడియాకు వివరణ ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టి దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారన్న విషయంలో వాస్తవం లేదన్నారు.


    ముద్రగడ దంపతుల ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యుల ద్వారా తెల్సుకున్న తాము వైద్య పరీక్షలు జరిపించాలనుకున్నామని వివరించారు. ఆదివారం ఉదయం వరకూ చూశాక ఆపైన వైద్య పరీక్షలు చేయించుకోకపోతే చట్టప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం రాత్రి ఒక అంబులెన్సును, తహశీల్దార్, ఓ డాక్టర్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు.

     

    క్షీణించిన పద్మావతి ఆరోగ్యం

    ముద్రగడ సతీమణి పద్మావతి (56) ఆరోగ్య పరిస్థితి శనివారం క్షీణించింది. ఆమెకు గతంలో వెన్నెముక శస్త్రచికిత్స జరిగింది. ఉదయం నుంచీ ఆమె పడుకునే దీక్ష కొనసాగించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆమె బరువు 74 కిలోలు, బీపీ 180/110, సుగర్ 121 ఉన్నాయి.


    శుక్రవారం ఆమెకు ప్రతి మూడు గంటలకోసారి మొత్తం నాలుగుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రానికి సుగర్ తగ్గుతూ వచ్చింది. రెండో రోజు ఉదయం 9 గంటలకు వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. సుగర్ 103, బీపీ 140/90 ఉందని వైద్యులు తెలిపారు.

     

     పెద్ద ఎత్తున మహిళల సంఘీభావం

    ముద్రగడ దంపతులను పరామర్శించేవారి సంఖ్య శనివారం బాగా పెరిగింది. ప్రధానంగా డ్వాక్రా మహిళలు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి తరలి వచ్చి పద్మనాభం దంపతులకు సంఘీభావం తెలిపారు. పరిసర గ్రామాల నుంచి వెయ్యిమందికి పైగా మహిళలు కిర్లంపూడి చేరుకున్నారు. దీక్షలో ఉన్న ముద్రగడ సతీమణి పద్మావతిని పలుకరించి వారు కన్నీరు పెట్టుకున్నారు.  

     

    కాగా కిర్లంపూడికి చెందిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో  వచ్చి పద్మావతికి సంఘీభావం తెలిపారు. అయితే ర్యాలీగా వస్తున్న మహిళలను పోలీసులు తొలుత స్థానిక ఏనుగు వీధి సెంటర్‌లో అడ్డగించడంతో వారు రోడ్డుపై బైఠాయించారు. ముద్రగడ సతీమణికి ఏదైనా జరిగితే తాము ఆత్మహత్యకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఐదుగురు చొప్పున దీక్షా శిబిరం వద్దకు వెళ్లేందుకు అనుమతించడంతో మహిళలు శాంతించారు.

     

    మంత్రుల రాకపై ప్రచారం

    దీక్షలో ఉన్న ముద్రగడతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు కిర్లంపూడి వస్తున్నారని ఉదయం నుంచీ ప్రచారం జరిగింది. బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం దీనిని ధ్రువీకరించారు. అయితే సాయంత్రం 7 గంటల వరకూ వారు రాలేదు. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న కాపు నేతలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top