'కేసీఆర్, హరీష్ నియోజక వర్గాలకేనా నీళ్లు'

'కేసీఆర్, హరీష్ నియోజక వర్గాలకేనా నీళ్లు' - Sakshi


- రీడిజైనింగ్ పేరిట లక్ష కోట్లు వృథా

- వాగ్దానాల అమలులో కేసీఆర్ వైఫల్యం

- డీసీసీ జిల్లా అధ్యక్షుడు మృత్యుంజయం




సుల్తానాబాద్ (కరీంనగర్): ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల కోసమే కాళేశ్వరం వద్ద ప్రాజెక్టు శంకుస్థాపన చేస్తున్నారని డీసీసీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లు తరలిస్తామని చెప్పి ఓట్లు వేయించుకునే కుట్రలో భాగమే ఈ ప్రాజెక్టు హడావుడి శంకుస్థాపన అని చెప్పారు. మ్యాప్‌కో సంస్థ సర్వే చేసి నివేదిక ఇచ్చి రీడిజైనింగ్ చేయాలని చెప్పిందనడంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు. మహారాష్ట్రతో ఒప్పందంతో పాటు 30 రకాల అనుమతులు రాకుండానే శంకుస్థాపన హడావుడి ఎందుకని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తున్నప్పటికి వాగ్దానాల అమలులో వైఫల్యం చెందారని చెప్పారు. ముస్లింలకు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఆచరణలో వైఫల్యం చెందారని చెప్పారు.



గోదావరి నీళ్లను జిల్లాలో చెరువులు, కుంటలు నింపకుండా సీఎం సొంత జిల్లా మెదక్‌లోని తడకపల్లికి 50 టీఎంసీల నీరు తరలిస్తున్నారని చెప్పారు. హరీశ్‌రావు నియోజకవర్గం సిద్దిపేట, సీఎం నియోజకవర్గం గజ్వేల్‌కు ఇక్కడి నుంచి నీరు తీసుకెళ్తున్నారే తప్ప ఇక్కడి ప్రజలకు నీరు అవసరం లేదనుకున్నారా ఏంటి? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.35వేల కోట్ల నుండి 80వేల కోట్లకు పెంచడంలో మతలబు ఉందన్నారు. యూనివర్సిటీలో 90 శాతం ఖాళీలు ఉన్నాయని వాటిపైదృష్టి సారించాలని కోరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పటి వరకు 600 కూడా నిర్మించలేదని, జిల్లాలో 300ల ఎకరాలు దళితులకు కేటాయించలేదని చెప్పారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top