కాలుతో కవిత్వం.. మాతృత్వపు పరిమళం

కాలుతో కవిత్వం.. మాతృత్వపు పరిమళం


సిరిసిల్ల :

చెట్టుకు కాయ భారం కాదు.. తల్లికి బిడ్డ భారం కాదు.. కానీ పుట్టుకతనే వైకల్యంతో బాధపడుతున్న చంటి బిడ్డకు అన్నీ తానై సాకింది ఆ అమ్మ. చంటిపాప అందరిలా నడువలేకపోయినా.. మాట్లాడలేక పోయినా గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని అన్నీ తానైంది. ఆ కంటిపాప పెరుగుతున్న కొద్ది నడువలేని స్థితిని గమనించి నేనున్నానమ్మా అంటూ అండగా నిలిచింది. సిరిసిల్లలోని సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి(36) పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఆమె తల్లి అనసూర్య రాజేశ్వరిని ఏడో తరగతి వరకు చదివించింది. సరిగా నడువలేని, మాట్లాడలేని రాజేశ్వరికి కవిత్వంపు అక్షరాలు జాలువారాయి. దివ్యాంగురాలైన ఆమె మొక్కవోని ధైర్యంతో అద్భుతమైన కవిత్వాన్ని అక్షీకరిస్తుంది. రాజేశ్వరి రాష్ట్ర స్థాయిలో కవయిత్రిగా గుర్తింపు సాధించేందుకు తల్లి అనసూర్య ప్రేరణ అయింది. అమ్మపై రాజేశ్వరి ‘అవనిపై ఆ దేవుని అద్భుత సృష్టి అమ్మ... అమృతం కన్న మధురం అమ్మ స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపం..అమ్మ‘.. అంటూ కాలుతోనే కవిత్వాన్ని, తన మనసులోని భావాలను పంచుతుంది.



రాష్ట్ర స్థాయి అవార్డులు..

రాజేశ్వరి కవిత్వాన్ని చదివిన ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తన తల్లిదండ్రుల పేరిట ప్రతిఏటా అందించే సుద్దాల హన్మంతు జానకమ్మ స్మారక అవార్డును 2016లో అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల నగదు పురస్కారాన్ని రాజేశ్వరికి అందించింది. రాజేశ్వరి ఇప్పటి వరకు 350 కవితలు, మూడు కథలు రాశారు. అమ్మపై ఆమె ఇరవై కవిత్వాలు రాశారు. రాజేశ్వరి వైకల్యంతో బాధపడుతున్నా... అమ్మపై ఆమెకున్న ప్రేమను అక్షీకరించారు. రాజేశ్వరికి బాధకలిగిన.. ఆనందం కలిగినా అమ్మతో పంచుకుంటుంది. కాలుతో కష్టతరమైన కవిత్వాన్ని రాస్తుంది. రాజేశ్వరి సాహిత్యసృజనను రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు పలు సందర్భాల్లో అభినందించారు.



ఆమెతోనే నాకు గుర్తింపు వచ్చింది..

నా బిడ్డ రాజేశ్వరి నరాల బలహీనతతో బాధపడుతుంది. అందరిలాగా నడువలేదు.. అందరిలా మాట్లాడలేదు. కానీ కవిత్వం రాస్తుంది. సుద్దాల అశోక్‌తేజ సార్‌ నా బిడ్డను గుర్తించడంతో నాకు గుర్తింపు వచ్చింది. ఇన్నేళ్లు నేను పడిన కష్టం.. ఇబ్బందులు మా రాజేశ్వరి కవిత్వాన్ని చూసి అందరూ మెచ్చుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది. నేను బతికుండగా... నా బిడ్డకు ఏ కష్టం రానివ్వ. ఎప్పుడు ఏదో ఒక్కటి చదువుతూ.. రాస్తూ.. ఉంటుంది. ఆమెకున్న అక్షర జ్ఞానమే రాజేశ్వరిని ఈ స్థాయికి తెచ్చింది.

  – బూర అనసూర్య



అమ్మతోనే నా లోకం..

నాకు అమ్మే లోకం.. మా నాన్న సాంబయ్య ఐదేళ్ల కిందట చనిపోయాడు. మా నాన్న దూరం కావడం ఎంతో బాధించింది. కానీ నాకు మాత్రం అన్నీ అమ్మే చేసింది. చిన్నప్పుడు బడికి వెళ్లినప్పటి నుంచి ఇప్పుడు నేను రాస్తున్న కవిత్వపు అక్షరాలన్నీ అమ్మ చేతి చలువే. ఆమెకు చదువు రాకపోయినా.. చదువు గొప్పదనాన్ని గుర్తించి నన్ను బడికి పంపింది. ఆ బడి బాటనే ఇప్పుడు కవిత్వాన్ని రాసేందుకు తోడయింది. ‘చెట్టుకు పువ్వు అందం... నుదుటికి బొట్టు అందం, ఇంటికి ఇల్లాలు అందం, నా కంటికి మా అమ్మ నవ్వు అందం’. అంటుంది.

–  కవయిత్రి, బూర రాజేశ్వరి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top