ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్య

ఇద్దరు బిడ్డలు సహా తల్లి ఆత్మహత్య - Sakshi

- పారుమంచాలలో దారుణం

- ఘటనపై పలు అనుమానాలు

- మృతదేహాలను పరిశీలించిన పోలీసులు

జూపాడుబంగ్లా: ఇద్దరు బిడ్డలు సహా బావిలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పారుమంచాల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందిన నాగశేషులు, శ్యామలమ్మ దంపతులకు రేణుకమ్మ(30), వెంకటేశ్వర్లు ఇద్దరు సంతానం. రేణుకమ్మను పదేళ్లక్రితం నాగరాజు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు రాకేష్‌(7), ఇందు(5), కావేరి(16నెలలు) సంతానం. నాగరాజు కర్నూలులోని మున్సిపల్‌ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మానసిక సమస్య కారణంగా మూడు నెలల నుంచి రేణుకమ్మ పారుమంచాల గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.

 

మూడు రోజుల క్రితం నాగరాజు..గ్రామానికి వచ్చి కుమారుడు రాకేష్‌ను కర్నూలుకు తీసుకెళ్లాడు. సోమవారం కట్టెలను తెచ్చుకునేందుకు రేణుకమ్మ తల్లిదండ్రులు శ్యామలమ్మ, నాగశేషులు పొలానికి వెళ్లారు. రెండో కుమార్తె ఇందు కాలికి దెబ్బతగలటంతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వద్దకు రేణుకమ్మ తన ఇద్దరు బిడ్డలను తీసుకొని ఉదయం 8.30గంటల ప్రాంతంలో వెళ్లింది. డాక్టర్లు రాలేదని ఆసుపత్రి సిబ్బంది తెలపటంతో ఆమె ఇద్దరి పిల్లలతో కలిసి గ్రామంలోని బైరెడ్డినగర్‌(అలగనూరుకు వెళ్లేదారి)కు వెళ్లేదారి వెంట వెళ్లింది. అక్కడ జనాలు ఎక్కువగా ఉండటంతో వెనక్కివచ్చి చెరువుకు వెళ్లే మలుపు వద్ద ఉన్న రఘునాథరెడ్డి బావిలో తన ఇద్దరి పిల్లలతో కలిసి దూకింది.

 

ఉదయం 10గంటల ప్రాంతంలో పొలం వద్దనున్న మోటారు వద్ద దుస్తులు శుభ్రం చేసుకునేందుకు వచ్చిన షబ్బీర్‌ బావిలో మృతదేహాలను చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ విజయ్‌కుమార్‌ పోలీసులకు సమాచారం అందించాడు. నందికొట్కూరు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, జూపాడుబంగ్లా ఏఎస్‌ఐ గోపాల్‌ వారి సిబ్బందితో సంఘటనా ప్రాంతానికి చేరుకొని నీటిపై తేలాడుతున్న కావేరి, రేణుకమ్మ మృతదేహాలను గ్రామస్తుల సహకారంతో ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలను చూసి శ్యామలమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇందు(5) మృతదేహం బయటపడకపోవటంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. 

 

ఘటనపై పలు అనుమానాలు

ఘటన జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉదయం 8.30గంటల ప్రాంతంలో రేణుకమ్మ ఆమె ఇద్దరు కుమార్తెలతో బావిలో పడితే కేవలం 1.30గంటల వ్యవధిలోనే నీటిలోంచి మృతదేహాలు ఎలా బయటపడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రాణం తీసి నీటిలో పడేసినట్లయితే మృతదేహాలు వెంటనే తేలాడుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అలాకా కుండా ప్రాణమున్న వ్యక్తి నీటిలో పడి ఆత్మహత్యచేసుకున్నట్లయితే వారి మృతదేహాలు నీటిపై తేలేందుకు కనీసం ఐదారుగంటల సమయం పడ్తుందని వైద్యులు తెలుపుతున్నారు. రేణుకమ్మ, కావేరి మృతదేహాలు బయటపడి రెండోకుమార్తె ఇందు మృతదేహం బయటపడకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే మృతురాలి ఒంటిపైనున్న చీరపూర్తిగా తొలగిపోయి ఉంది. రేణుకమ్మ, ఆమె పిల్లల మృతిపై  పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  

 

ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ, సీఐ

 విషయం తెలుసుకున్న ఆత్మకూరు డీఎస్పీ వినోద్‌కుమార్, ఇన్‌చార్జి ఆత్మకూరు సీఐ కృష్ణయ్య ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించారు. బావిని పరిశీలించి మృతురాలి తల్లిదండ్రులను అడిగి వివరాలు సేకరించారు. మృతురాలి తల్లిదండ్రుల వివరాల మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, సీఐ కృష్ణయ్య తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top