కుమారుని భవిష్యత్తుపై తల్లి ఆందోళన

కుమారుని భవిష్యత్తుపై తల్లి ఆందోళన

  •  పదో తరగతికి వచ్చినా స్కూల్‌కు సరిగా వెళ్లడం లేదని మనస్తాపం

  •  భర్త, కుమారుని ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం 

  •  నా వల్లే కదా ఇదంతా.. అని కుమారుడూ తాగిన పురుగుమందు

  •  ఇద్దరికీ చీరాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స

  • చీరాల రూరల్‌: పదో తరగతికి వచ్చినా కుమారుడు సక్రమంగా స్కూల్‌కు వెళ్లకపోవడంతో తల్లి మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన వల్లే తల్లి పురుగుమందు తాగిందని కుమారుడు కూడా తీవ్ర ఆందోళనతో తల్లి మిగిల్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

     

    ఇద్దరూ చీరాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన పర్చూరు మండలం దేవరపల్లిలో సోమవారం జరిగింది. బాధిత బంధువులు, 108 సిబ్బంది కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుజ్జర్లపూడి సునీత, ప్రసాద్‌ దంపతుల కుమారుడు వంశీ పర్చూరులోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. వంశీ తరచూ పాఠశాలకు డుమ్మా కొడుతుండటంతో తల్లిదండ్రులు బిడ్డ భవిష్యత్తుపై ఆందోళనగా ఉంటున్నారు. మూడు రోజులుగా స్కూల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తెలిసి తల్లి సునీత బిడ్డ భవిష్యత్తుపై తీవ్ర ఆవేదన చెందింది.

     

    ఇంట్లో భర్త, కుమారుడు ఎదురుగానే పొలాల్లో కలుపునకు ఉపయోగించే పురుగుమందు తాగింది. గమనించిన భర్త.. ఆమె చేతిలో ఉన్న డబ్బాను లాగి దూరంగా విసిరాడు. కుమారుడు వంశీ తత్తరపాటుకు గురై తన కోసమేకదా తన తల్లి పురుగుమందు తాగిందని గ్రహించి తండ్రి విసిరిన డబ్బాలో మిగిలి ఉన్న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమచారం అందించారు. సమాచారం అందుకున్న వాహన సిబ్బంది హుటాహుటిన వచ్చి తల్లీకొడుకును చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. l 

whatsapp channel

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top