‘అమ్మ’ భారమైంది!

‘అమ్మ’ భారమైంది! - Sakshi


నవమాసాలు మోసి జన్మనిచ్చిన అమ్మే వారికి భారమైంది. ఆమెను పోషించడం తమ వల్ల కాదని కర్కశంగా వారు చెప్పేచేశారు. మూడురోజులుగా ముద్ద ముట్టని ఆమెను కాశిరెడ్డినాయన ఆశ్రమానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఆమె స్వగ్రామానికి తీసుకెళ్లారు. వివరాలు ఇవీ.. కొత్తపల్లె మండలం ఎదురుపాడుకు చెందిన బిజ్జమ్మకు కుమారుడు శంకర్ రెడ్డితో పాటు కుమార్తె ఉంది. దాదాపు మూడు సంవత్సరాల క్రితం శంకర్‌రెడ్డి తన తల్లి బిజ్జమ్మ కాశిరెడ్డినాయన ఆశ్రమంలో వదిలేశారు.



దీంతో ఆశ్రమవాసులు ఆమెకు అన్నం పెట్టేవారు. ఆశ్రమంలో ఒక మూలన కూర్చొని తనకు పట్టిన దుస్థితికి చింతిస్తూ  ఆమె కాలం వెల్లదీస్తుండేది. అయితే తనకు మరణం ఎంతకీ రావడం లేదని అప్పుడపుడు అక్కడున్న వారికి చెబుతూ దుఃఖిస్తూ ఉండేది. ఈ క్రమంలో మూడు రోజుల నుంచి ముద్ద అన్నం కూడా ముట్టడం లేదు. ఎంత బతిమాలినా మౌనంగా వద్దని చెప్పేది. దీంతో పూర్తిగా నీరసించి సొమ్మసిల్లి పడిపోయింది.



ఆమె కుటుంబ సభ్యులు కొత్తపల్లె మండలం ఎదురుపాడులో ఉన్నట్లు గుర్తించారు. ఆమె కుమారుడికి ఫోన్‌చేసి పరిస్థితని వివరించారు. ఆమెను తీసుకెళ్లాలని కుటుంబీకులకు తెలిపారు. అయితే తల్లిని తీసుకెళ్లడానికి కుమారుడు అంగీకరించలేదు. మళ్లీ ఫోన్‌చేసినా స్పందన లేదు. దీంతో ఆశ్రమంలో ఉంటున్న కృష్ణయ్య..ఆదివారం ఆటోలో వృద్ధురాలిని తరలించడానికి ఓంకార క్షేత్రం నుంచి బండిఆత్మకూరుకు వచ్చాడు.



ఆమె నీరసించి బస్టాండులోని కటిక నేలమీద ఉండడం చూసి స్థానికులు తరలించారు. మహిళలు, హోటల్ నిర్వాహకులు వచ్చి నీరసించిన అమ్మకు పండ్లు, పానియాలు ఇప్పించారు. ఆ తర్వాత తలా ఒక చేయివేసి ఆత్మకూరు బస్సుకు ఎక్కించి పంపించారు. కృష్ణయ్య బస్సులో ఆమె పక్కనే ఉండి జాగ్రత్తగా స్వగ్రామమైన ఎదురుపాడుకు తీసుకెళ్లారు.

                         - బండి ఆత్మకూరు

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top