ఆ ఉత్సాహానికి వందనం

ఆ ఉత్సాహానికి వందనం - Sakshi


నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన శతాధిక వృద్ధురాలు

పార్వతీపురం: ముగ్గుబుట్ట వంటి తల..లోతుకు పోయిన కళ్లు..కీళ్లు కదిలి..ఏళ్లు ముదిరిన  వయసులో ఉన్నప్పటికీ   నేటి బిజీ ప్రపంచంలో నిస్సత్తువగా జీవితాలు గడుపుతున్న జనంలో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది  ఓ శతాధిక వృద్ధురాలి నూతన సంవత్సర వేడుక. 105 ఏళ్లు పూర్తి చేసుకున్న అన్నాబత్తులు నారాయణమ్మ అనే బామ్మ ఆదివారం స్థానిక  వివేకానంద కాలనీలో ఆనందంగా  నూతన సంవత్సరం–2017 వేడుకలు జరుపుకున్నారు.  ఆ కాలనీ పిన్నా పెద్దలను పిలిచి కేక్‌  కట్‌ చేసి 2017 కొత్త సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శతాబ్ది వయసు దాటాక  ఇలా కొత్త జనరేషన్‌తో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. తన భర్త అన్నాబత్తుల అప్పడు రైల్వేలో క్లర్క్‌గా చేశారని, ఆయన పింఛన్‌ తనకు ఇప్పుడొస్తోందని చెప్పారు. పింఛన్‌ తేదీ ప్రకారం తనకు 105 సంవత్సరాలని స్పష్టం చేశారు. తనకు 8మంది పిల్లలు కాగా, పెద్ద అమ్మాయి బి.అన్నపూర్ణమ్మకు 91 ఏళ్లు వయసని తెలిపారు. ఆ కాలనీకి చెందిన వారణాశి వెంకటరమణ, బంకురు సూరిబాబు, పతివాడ దుర్గాప్రసాద్, సుబుద్ధి రవిపాత్రో తదితరులు ఈ నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని శతాధిక వృద్ధురాలితో వేడుక జరుపుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా వారు నారాయణమ్మకు దుశ్శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top