కోరలు చాస్తున్న నేర సంస్కృతి

కోరలు చాస్తున్న నేర సంస్కృతి - Sakshi


హత్యలతో అట్టుడుకుతోన్న సింహపురి

నిఘా, దర్యాప్తుల్లో పోలీసు శాఖ వైఫల్యం

భయం గుప్పెట్లో ప్రజలు


జిల్లాలో నేరసంస్కృతి పడగ విప్పుతోంది. పోలీసు వ్యవస్థ మెతక వైఖరి, నిఘా, దర్యాప్తుల్లో వైఫల్యాలను ఆసరాగా చేసుకొని అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. దోపిడీలు, హత్యలు, కిడ్నాప్‌లతో అట్టడుకుతోంది. పొట్టపోసుకొనే వృత్తుల్లాగే ప్రాణాలు తీసే నేర ప్రవృత్తి సమాజంలో వెళ్లూనుకుపోతోంది. దుండగులు నేరాలు చేసి సునాయాసంగా తప్పించుకొంటున్నారు. వీరిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. కొన్ని ఘటనల్లో కొందరు నిందితులు వారికి వారే పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.



నెల్లూరు(క్రైమ్‌) : జిల్లాలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు భద్రత కరువైందన్న విషయం స్పష్టమవుతోంది. మారుమూల పల్లెలో శాంతిభద్రతల పరిరక్షణ సంగతి దేవుడెరుగు..హైటెక్‌ వసతులు..అధికార యంత్రాగంమంతా కేంద్రీకృతమైన నెల్లూరు నగరం, పట్టణాల్లో సైతం శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. పాతకక్షలు, వివాహేతర సంబంధాలు, ఆస్థి తగాదాలు, సులభంగా డబ్బు సంపాదించాలనే తృష్ణతో హత్యలు చోటుచేసుకుంటున్నాయి.


డబ్బుకోసం అయిన వారిని, స్నేహితులను కిడ్నాప్‌ చేసి కడతేర్చిన సంఘటనలు మానవీయ విలువల దిగజారుడు తనానికి పరాకాష్ణగా నిలుస్తున్నాయి. ఇక మహిళల భద్రత మిథ్యగా మారిందనే చెప్పాలి. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దుండగులు పెట్రేగిపోతున్నారు. వారిని కిరాతకంగా హతమార్చి ఒంటిపైనున్న నగలను దోచుకెళ్లిన ఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రికెట్‌  బెట్టింగ్‌లు, మద్యానికి బానిసైన యువకులు నగదు కోసం వ్యక్తులను కిడ్నాప్‌ చేసి హత్యలకు తెగబడుతున్నారు. గడిచిన నెలన్నర రోజుల వ్యవధిలో 10కి పైగా హత్యలు, 32కు పైగా హత్యాయత్నాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.



దిగజారిన మానవీయ విలువలు

కడుపున పుట్టినవారు, జీవితాంతం బాసటగా ఉంటానన్నవారే తమ వారిని అతి కిరాతకంగా హత్యచేస్తున్నారు. విహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్యే ప్రియునితో కలిసి దారుణంగా హత్యచేసిన సంఘటన మానవీయ విలువల పతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముదిగేడు గ్రామంలో డబ్బుల కోసం యానాదిరెడ్డిని భార్య లీలమ్మ, కొడుకు శేఖర్‌రెడ్డి దారుణంగా హత్యచేశారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఆటోడ్రైవర్‌ నాగార్జునను భార్య కామేశ్వరి ఆమె ప్రియుడు వినోద్‌ దారుణంగా హత్యచేశారు. ఇక మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు, దాడియత్నాలు సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నాయి.



పెరుగుతోన్న కిరాయి సంస్కృతి 

కిరాయి హత్యలు రోజురోజుకూ పెరుగుతోన్నాయి. ఆర్థిక విబేధాలు, పాతకక్షల నేపథ్యంలో చిల్లకూరు మండలం ఉడతావారి పార్లపల్లికి చెందిన గొడ్డటి కోటేశ్వరరావును అదే గ్రామానికి చెందిన గొడ్డటి భరత్‌ కిరాయి హంతకులచే హత్యచేయించాడు. జలదంకి మండలం కమ్మవారిపాలెంకు చెందిన పరిమితి నాయుడుబాబును బ్రాహ్మణక్రాకకు చెందిన ఆదెమ్మ కిరాయి వ్యక్తులచే కిడ్నాప్‌ చేయించి డబ్బులు డిమాండ్‌ చేసింది. అతికష్టంపై నాయుడుబాబు వారినుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌ 26వ తేదిన సైదాపురానికి చెందిన కొప్పు వెంకటేశ్వర్లును అదే ప్రాంతానికి చెందిన యువకులు కిడ్నాప్‌చేశారు.


అదే రోజు వెంకటేశ్వర్లు భార్య సుప్రజ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే అతను ప్రాణాలతో బయటపడి ఉండేవాడు. వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెంకు చెందిన శ్రీనివాసులును పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్ధులు కిడ్నాప్‌చేసి దారుణంగా హత్యచేశారు. నెల్లూరు రూరల్‌ మండలం చింతారెడ్డిపాలెం డొంకకు చెందిన టి. నాగార్జునను దుండగులు కిడ్నాప్‌ చేసి దగతర్తి మండలం కొత్తపల్లికౌరుగుంట సమీపంలోని గ్రావెల్‌ క్వారీ సమీపంలో దారుణంగా హత్యచేశారు. ఆర్థికలావాదేవీల నేపథ్యంలో బంగ్లాతోటకు చెందిన  ఆటోడ్రైవర్‌రాజేషన్‌ను స్నేహితులే మట్టుబెట్టారు.



కునుకేసిన నిఘా..

అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాలు, నేరగాళ్లు జిల్లాలో పాగావేసి తమ నేరసామ్రాజ్యాన్ని విస్తృతం చేస్తున్నారు. నేరగాళ్ల కదలికలను పసిగట్టడంలో నిఘా వ్యవస్థ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు పోలీసులు కేసు విచారణలో నిమగ్నమై ఉండగానే మరో వైపు దుండగులు పెట్రేగిపోతూ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు. నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో విశ్రాంత అధ్యాపకురాలిని దుండగులు దారుణంగా హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకొని వెళ్లారు. తడ మండలం తడకండ్రిగలో పట్టపగలు సావిత్రమ్మ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు నిఘా వ్యవస్థును మరింత పటిష్టం చేస్తే నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top