పాపం పసివాళ్లు.. దూప చావు

పాపం పసివాళ్లు.. దూప చావు


అడవిలో మండుటెండలో నీళ్ల కోసం అల్లాడి ప్రాణాలు విడిచిన అన్నదమ్ములు

ఎక్కడా చుక్కనీరు దొరక్క గొంతెండి మృత్యువాత

రోజంతా ఎండలోనే చిన్నారుల మృతదేహాలు

వాళ్లకు నీటికోసం వెళ్లి వడదెబ్బతో స్పృహ  తప్పిన తల్లి

 తెల్లారితే అక్క పెళ్లి.. తమ్ముళ్ల మృతితో ఆగిన వైనం

 ఆదిలాబాద్ జిల్లాలో దారుణం


 

చెన్నూర్ రూరల్:  ‘అమ్మా.. దూపైతందమ్మా..!’

ఆ మాటలకు కన్నపేగు కదిలింది..  కానల్లోకి వెళ్లింది..

 గంటైంది.. రెండు గంటలైంది..!

 అమ్మ రాలేదు.. గొంతు తడవలేదు..

 ‘అన్నా.. అమ్మేది..? దూపైతంది..!’



 తమ్ముడి చేయిపట్టి నడిపించాడు అన్న.. తడారిన గొంతులతో ఇద్దరూ కలసి నీటిచుక్క కోసం అడవిలోని వాగులువంకలు వెతికారు.. ఎక్కడా దొరకలేదు. ఆ చిన్నారులకేం తెలుసు..? నీళ్లకోసం వెళ్లిన అమ్మ ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయిందని..! మృత్యువుకేం తెలుసు? పాలుగారే ఆ పసివాళ్లపై యమపాశం విసరొద్దని..! అక్క పెళ్లి కోసం ఆనందంగా వెళ్తున్న ఆ అన్నదమ్ముల్ని తనతో తీసుకెళ్లొద్దని..!! తెల్లారాకే తెలిసింది.. నీటికోసం అల్లాడి.. నడి అడవిలో తండ్లాడి.. మండే ఇసుక దిబ్బల్లో పొర్లాడి.. పోరాడి.. ఆ చిన్నారులు ప్రాణం వదిలారని!! ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన కరువు రక్కసికి దర్పణం పడుతోంది.

 

 మండుటెండలో.. కాలినడకన..

 ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలంలోని లింగంపల్లికి చెందిన ఏలాది లచ్చుకు ఇద్దరు కూతుళ్లు మంజుల, సునీత. ఇద్దరు కుమారులు మధుకర్(12), అశోక్(8). ఆమె భర్త లస్మయ్య పిల్లలు చిన్నతనంలో ఉండగానే మృతి చెందాడు. వీరిది నిరుపేద కుటుంబం. కూలీ పనులు చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. మధుకర్ ఐదో తరగతి, అశోక్ రెండో తరగతి చదువుతున్నారు. పెద్ద కుమార్తె మంజుల వివాహం లింగంపల్లికి సమీపంలోని బుద్దారం గ్రామానికి చెందిన వ్యక్తితో నిశ్చయమైంది. పెళ్లి కుమారుని ఇంటి వద్దే వివాహానికి ఏర్పాట్లు చేశారు. సోమవారమే పెళ్లి. ఆనవాయితీ ప్రకారం మంజులను ముందుగానే పెళ్లి కొడుకు ఇంటికి తీసుకెళ్లారు. చిన్న కూతురు సునీతను ఇంటి వద్దే ఉంచి తల్లి లచ్చు.. ఆదివారం ఉదయం 10 గంటలకు తన కొడుకులు మధుకర్, అశోక్‌లను తీసుకొని లింగంపల్లి నుంచి కిష్టంపేట మీదుగా గుట్ట దారిలో బయల్దేరింది.



11 గంటల ప్రాంతంలో బుద్దారం అటవీ ప్రాంతంలో దాహం వేస్తోందని కొడుకులు అనడంతో తల్లి తాగేందుకు నీరు తీసుకొస్తానని చెప్పి అటవీ ప్రాంతంలోకి వెళ్లి దారి తప్పింది. మండుటెండలో నీటికోసం అటూఇటూ తిరిగిన లచ్చు వడదెబ్బ తాకి ఓచోట సృ్పహ తప్పిపడిపోయింది. ఇటు ఇద్దరు చిన్నారులకూ వడదెబ్బ తాకింది. నీటి చుక్క కోసం వారు కూడా అడవంతా వెతికారు. కానీ లాభం లేకపోయింది. చివరికి ఎక్కడా నీటిజాడ దొరక్క ఎర్రటి ఎండలో విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు.

 

 రోజంతా మండుటెండలోనే..: మండుతున్న ఎండ పైన.. కాలిపోతున్న ఇసుక కింద.. ఈ పరిస్థితి మధ్య రోజంతా చిన్నారుల మృతదేహాలు అడవిలోనే పడిఉన్నాయి. మరుసటి రోజుకుగానీ ఈ దారుణం వెలుగుచూడలేదు. సోమవారం ఉదయం ఉద్దారం గ్రామస్తులు పండ్ల సేకరణ కోసం అడవిలోకి వెళ్లగా స్పృహ తప్పిన లచ్చు కనిపించింది. నీరు తాగించడంతో కొన ప్రాణాలతో ఉన్న ఆమె మృత్యువు నుంచి బయటపడింది. కన్నీళ్లు పెట్టుకుంటూ తన కుమారుల కోసం వెతకగా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వారిని చూడగానే ఆమె గుండెలవిసేలా రోదించింది. ఉద్దారం గ్రామస్తులు బంధువులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి వె ళ్లి లచ్చును తీసుకొచ్చారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను లింగంపల్లికి తరలించారు.

 

 ఆగిన పెళ్లి..: తమ్ముళ్లు ఇద్దరూ వడదెబ్బతో మృత్యువాతపడటంతో మంజుల వివాహం నిలిచిపోయింది. అప్పటికే ఇంటి ముందు పెళ్లి పందిరితోపాటు వివాహానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. అభం, శుభం తెలియని ఇద్దరు చిన్నారుల మృతితో ఇటు లింగంపల్లిలో అటు బుద్దారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ఓదెలు

వడదెబ్బతో చనిపోయిన చిన్నారుల కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు చెప్పారు. సోమవారం ఆయన లింగంపల్లి వెళ్లి లచ్చు కుటుంబాన్ని పరామర్శించారు. ఆర్థికసాయం కింద రూ.10వేలు అందజేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేసినట్లు చెప్పారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top