ఫోను పిచ్చి మీకేనా.. నాకూ ఉంది
‘ఫోను పిచ్చి మీకేనా.. నాకూ ఉంది. రింగ్ టోన్లతో.. సినిమా పాటలతో ఎంజాయ్ చేసేది మీరేనా? నేనూ చేయగలను’ అంటూ ఓ వానరం సెల్‌ఫోన్‌ను సింపుల్‌గా ఆపరేట్ చేసింది. బటన్ నొక్కగానే నోకియా టోన్ మోగడంతో పళ్లు ఇకిలించింది. మరో బటన్ నొక్కగానే ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ అనే పాట రావడంతో అలాగే వింటూ ఆస్వాదించింది. ఇష్టమైన మ్యూజిక్ వచ్చినప్పుడు ఫోన్‌కు ముద్దు పెట్టింది. ‘ఎంతైనా నా నుంచి వచ్చిన మనుషులేగా.. మీరు చేయగలిగింది నేను చేయలేనా’ అని పోజిచ్చింది. ఈ కోతి చేష్టలు చూసినవారు కడుపుబ్బా నవ్వుకున్నారు. అక్కడ చేరిన పిల్లలు ‘కోతిమామా ఫోను ఇచ్చేయ్’ అని రంకెలేశారు. ఇంతకీ ఈ మొబైల్‌ని బేస్తవారిపేటలోని పాపాయిపల్లెలో నివాసం ఉండే రంస్వామి ఇంట్లోకి వెళ్లి తస్కరించింది. దానితో మోజు తీరాక అక్కడే పడేసి చెట్టుకొమ్మ ఎక్కింది. ‘ఓరినీ కోతులు కూడా ఫోన్లకు బానిసలైతే ఇంకేం చేస్తాం’ అంటూ అక్కడ చేరినవారు ఫక్కున నవ్వారు.
– బేస్తవారిపేట