రూ.433 కోట్ల మనీ స్కీం.. మింగింది కష్టార్జితం

రూ.433 కోట్ల మనీ స్కీం.. మింగింది కష్టార్జితం - Sakshi


2 లక్షల మంది నుంచి రూ.433 కోట్లు వసూళ్లు

కేసులు పెడుతున్నా.. ప్రయోజనం శూన్యం

సొమ్ము తిరిగి రాక ఇబ్బందులు పడుతున్న జనం

నివాసాల్లో వీధికో మనీ సర్క్యులేషన్ స్కీంలు




కేవలం రోజుకు రూ.50 కడితే మూడేళ్లు దాటక ముందే రూ.లక్ష ఇస్తాం. రోజూ సంపాదించే సొమ్ములో రూ.50 లెక్కకాదు.  తక్కువ కట్టండి.. ఎక్కువ తీసుకోండి.. అంటూ పలు గొలుసు స్కీంల నిర్వాహకులు పేద, మధ్య, చిన్న, సన్నకారు రైతు కుటుంబాల వద్దకెళ్లి నమ్మించి నట్టేట ముంచుతున్నారు. ఇలాంటి స్కీంలను నమ్మి మోసపోయిన వేలాది మంది జనం పోలీసులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. పోలీసులు విచారిస్తున్నా.. మరో పక్క వీధికో మనీ స్కీంలు పుట్టుకొస్తునే ఉన్నాయి. వసూళ్లు చేసుకున్న వారు నిర్ణీత సమయంలో ఇవ్వకపోగా.. కనిపించకుండా మాయమతున్నారు.



నెల్లూరు: జిల్లావ్యాప్తంగా తొమ్మిది మనీ చైన్ స్కీంలు మాత్రమే వెలుగులోకి వస్తే.. మిగిలినవి గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు బోగస్ సంస్థల పేరుతో కార్యాలయాలు ప్రారంభించి రూ.కోట్లు వసూళ్లు చేసుకుని పారిపోతున్నారు. గొలుసుకట్టు మోసాలపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసినా ప్రయోజనం కనిపించలేదు. తాజాగా వెల్ఫేర్ సంస్థ ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ.50 చొప్పున వసూలు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. వారికి మూడేళ్లలో రూ.75 వేలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే ఆరునెలలుపైనే గడుస్తున్నా.. ఒక్కరూపాయి కూడా రాకపోవటంతో అనేకమంది బాధితులు వెల్ఫేర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అదే విధంగా రిచ్‌ఇండియా సంస్థ, మైల్యాండ్ ఎస్టేట్ ప్రైవేట్‌ లిమిటెడ్, కుబేరా కంపెనీల బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ముకోసం తిరుగుతున్న వారిలో ఉన్నారు.



2 లక్షల మంది నుంచి రూ.433 కోట్లు

నెల్లూరు జిల్లాలో సుమారు 2 లక్షల మందికిపైగా గొలుసుకట్టు సంస్థలో డబ్బుకట్టి మోసపోయినట్లు తెలుస్తోంది. వీరి నుంచి సుమారు రూ. 433 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. అందులో భారత్ ప్రేమ్‌సదన్, న్యూవిజన్ ఫౌండేషన్, యూత్ అండ్ స్ట్రెంత్, ట్రోగాఫోన్ ఫార్మర్స్ సొసైటీ, హిమ్, యూత్ అలైవ్ క్రిష్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, గోల్డ్‌క్విస్ట్ సంస్థలతో పాటు వీధుల్లో నివాసాల్లో చిన్నచిన్న స్కీంలు నడుపుతున్న వారు అనేకమంది ఉన్నారు. వారు ఏజెంట్ల ద్వారా అమాయకులకు ఫోన్లు చేసి మచ్చిక చేసుకుంటున్నారు. వారి నివాసానికి రెండు, మూడు పర్యాయాలు వెళ్లి స్కీంలో సభ్యులుగా చేర్చుకుంటున్నారు. ఆ నగదుతో ఇళ్లస్థలాలు, భూములు కొనుగోలు చేశారు. మరికొందరు పేర్లు మార్చి రియల్‌ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు.



రియల్‌ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందని కొన్నిసంస్థల ప్రతినిధులు జనాన్ని నేడు, రేపు అంటూ మభ్యపెడుతుంటే.. మరికొందరు బోర్డు తిప్పేసి కనిపించకుండా పోతున్నారు. గొలుసుకట్టు సంస్థలపై సీఐడీ అధికారులు జిల్లాలో 8 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొంత నగదును, కొంత మందిని అరెస్ట్ చేశారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో వివిధ గొలుసుకట్టు సంస్థలు ప్రజల నుంచి రూ.172 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుండగా.. అనధికారికంగా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. హిమ్ సంస్థ జిల్లాలో 18 వేలమంది ద్వారా రూ. 70 కోట్లు వసూలు చేసింది. భారత్‌ప్రేమ్ సదన్ సంస్థ 8,500 మంది ద్వారా రూ. 48కోట్లు, ట్రోగాఫాన్‌ఫార్మర్స్ సొసైటీ సంస్థ 2,120 మంది వద్ద నుంచి రూ. 12కోట్లు, యూత్ అండ్ స్ట్రెంత్ క్రిష్టియన్ వెల్ఫేర్ సంస్థ రూ. 11కోట్లు, న్యూవిజన్ ఫౌండేషన్ రూ. 21కోట్లు వసూళ్లకు పాల్పడింది. మరికొన్ని సంస్థలు మరో రూ 10కోట్లు వసూళ్లు చేశాయి.



అదే విధంగా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు మరో రూ. 261కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. దాంతో పాటు అగ్రిగోల్డ్ సంస్థ  1.15లక్షల మంది నుంచి రూ. 246 కోట్ల డిపాజిట్లను వసూలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అగ్రిగోల్డ్ నుంచి డబ్బులు తిరిగి రాకపోవటంతో బాధితులు సోమవారం రోడ్డెక్కారు. వీరికి వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్ మద్దతు తెలియజేసి జాతీయ రహదారిపై బాధితులతో కలిసి ధర్నాకు దిగారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top