అమ్మో... ఒకటో తారీఖు!


 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇదొక్క చోటే కాదు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన మొబైల్ ఏటీఎంలో సేవలు నాలుగు రోజులకే పరిమితమయ్యాయి. జిల్లా కేంద్రంలోనే వీటి పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో నగదు సమస్యను ఊహించుకోవచ్చు. ఈ నెల 8వ తేదీన పెద్ద నోట్లను రద్దు చేసింది మొదలు ఇప్పటివరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పకతప్పదు. ఇకపై ఈ నగదు కష్టాలు ప్రజలకు రెట్టింపు కానున్నాయి. ఒకటో తేదీ వచ్చేసింది... ఇక జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరాల్సిన పరిస్థితి.

 

  మరోవైపు జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ నగదు కొరత తీరలేదు. రూ.500, రూ.100 డినామినేషన్ నోట్లు తొలివిడతలో రూ.150 కోట్లు నగదు వస్తుందని జిల్లా ఉన్నతాధికారులు పది రోజులుగా చెబుతున్నా ఒక్క నోట్ల కట్ట కూడా జిల్లాకు రాలేదు. కొన్నిచోట్ల ఎస్‌బీఐ ఏటీఎంలు పనిచేస్తున్నా రూ.2000 నోట్లు తప్ప మరో నోటు కనిపించట్లేదు. ఇవి చేతికొచ్చినా చిల్లర నోట్లు లేక అవసరానికి అక్కరకురాని పరిస్థితి. ఇక పింఛనుదారులకూ కష్టాలు తప్పేట్లు లేవు. 

 

 నగదురహిత లావాదేవీలు సాధ్యమేనా?

 రేషన్ మొదలుకొని పింఛను వరకూ, కూరగాయలు మొదలు కిరాణా వరకూ, చిల్లర కొట్టు నుంచి సూపర్ మార్కెట్ల వరకూ... ఇలా ప్రతి లావాదేవీని నగదు రహితంగా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అందుకనుగుణంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను అధికారులు ముమ్మరం చేశారు. అంతవరకూ బాగానే ఉన్నా నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా సాగాలంటే కనీసం 5 వేల స్వైప్ మిషన్లు అవసరం ఉంటుందని అధికారులే అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి ఆరొందలకు మించవు. అవీ పెద్ద నోట్ల రద్దు ప్రకటనకు ముందు వచ్చినవే. ఇటీవల 150 వరకూ వచ్చినా అవి సరిగా పనిచేయట్లేదు. 

 

 కాగితం మీదే వేతనం...

 జిల్లాలో టీచర్లు 17 వేల మంది వరకూ ఉన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు ఎనిమిది వేల మంది ఉన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు 20 వేల మంది వరకూ ఉన్నారు. చిరుద్యోగులు మరో ఐదు వేల మంది ఉన్నారు. వీరందరికీ బ్యాంకు ఖాతాల ద్వారానే జీతాలు, వేతనాల చెల్లింపు జరుగుతోంది. వీరందరూ నెల ప్రారంభ వారంలోనే ఏటీఎంలు, బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా చేయడం అలవాటు. అందుకే ఆ వారం రోజులు జిల్లాలోని ఏటీఎంలన్నీ కిటకిటలాడేవి. ఈనెల 8వ తేదీన పెద్ద నోట్ల రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొనేటప్పటికే వారిలో చాలామంది నగదు విత్‌డ్రా చేశారు.

 

 అప్పటికే వివిధ చెల్లింపులకు నగదు పోను మిగిలిన రూ.1000, రూ.500 నోట్లు తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు. కొంతమంది మార్పిడి చేసుకున్నారు. అయితే ఈసారి జీతాలు ఆన్‌లైన్‌లోనే చెల్లింపు ఉంటుందని ఆర్థిక శాఖ ప్రకటించింది. అంటే ఒకటో తేదీన కాగితం (ఖాతాలో) మీద జీతం పడినట్లు కనిపిస్తున్నా చేతికి నగదు చెల్లింపులు ఉండవు. ఒకవైపు నగదు చేతిరాకపోగా, చెల్లింపు అవసరాలకు తగినట్లు స్వైప్ మిషన్లు లేవు. దీంతో 1వ తేదీ నుంచి ఏటీఎంలు, బ్యాంకుల ముందు బారులు తీరినా నగదు చేతికొస్తుందో లేదోనని అప్పుడే ఆందోళనలు మొదలయ్యాయి. 

 

 పెద్ద నోట్లు ‘పని’కి రావట్లేదు:బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఎక్కువగా రూ.2000 నోట్లే ఇస్తున్నారు. అక్కడక్కడా రూ.100 నోట్లు ఇస్తున్నా అవన్నీ ఎక్కడికక్కడ స్తంభించిపోతున్నాయి. మిగతా రూ.50, రూ.20 నోట్లు పరిస్థితీ అంతే.  చిల్లర లభ్యత పూర్తిగా తగ్గిపోవడంతో జిల్లాలో వ్యాపారాల పరిస్థితి రోజురోజుకు దీనావస్థకు చేరుతోంది. రూ.2000 నోట్లు తీసుకోవడానికి చిల్లర సమస్య కారణంగా వ్యాపారులు నిరాకరిస్తున్నారు. ఈ సమస్య దృష్ట్యా ఎవ్వరికివారు రూ.100, రూ.50 నోట్లను తమవద్దే ఉంచేసుకుంటున్నారు. 

 

 పింఛనుదారులకు ఇక్కట్లే...

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు జిల్లాలో 14వేల మంది ఉన్నారు. వారందరికీ 1వ తేదీనే బ్యాంకు ఖాతాల్లో పింఛను పడుతోంది. నిత్యావసర సరుకులు, మందులు, ఆసుపత్రికి వెళ్లడానికి ఈ డబ్బే ఎక్కువ మందికి ఆధారం. వారిపై ఆధారపడినవారూ కుటుంబాల్లో ఉంటారు. ఇప్పుడు పింఛను నగదు చేతికొచ్చే అవకాశం లేకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కోనున్నారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top