ఏఎస్సై బినామీలకు తాఖీదులు

ఏఎస్సై బినామీలకు తాఖీదులు - Sakshi


♦ సీఐడీ అదుపులో మోహన్‌రెడ్డి కుమారుడు

♦ కీలకమైన డైరీల స్వాధీనం

♦ సీఐడీ విచారణలోనే అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి

♦ కేసు నీరుగార్చేందుకు ప్రయత్నాలు!

♦ అధికార పార్టీ నేత ద్వారా ప్రయత్నాలు

 

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: ఏఎస్సై మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందాలో పెట్టుబడులు పెట్టిన పోలీసులకు ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. సీఐడీ విచారణ సందర్భంగా తన అక్రమ ఫైనాన్స్ వ్యవహారంలో పెట్టుబడి పెట్టినవారి వివరాలను మోహన్‌రెడ్డి చెప్పిన నేపథ్యంలో వారికి నోటీసులు పంపారు. అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు రంగరాజు భాస్కర్, సాయి మనోహర్, సీఐలు ఆర్.ప్రకాశ్, సీహెచ్.మల్లయ్య, ఎస్‌ఐబీ బుచ్చిరాములు, హెడ్ కానిస్టేబుల్ శంకర్‌సింగ్‌తోపాటు పలువురు ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, డాక్టర్లు కూడా నోటీసు లు అందుకున్నవారిలో ఉన్నట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. వారం రోజుల్లో ఆధారాలతో సహా సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఏఎస్సై మోహన్‌రెడ్డి ఉదంతంలో ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా 40 కేసులు నమోదు చేశారు.  



 ఏఎస్పీపై రహస్య విచారణ

 మోహన్‌రెడ్డి దందాకు పెట్టుబడులు పెట్టడమే కాకుండా అండగా నిలిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ జనార్దన్‌రెడ్డి నాలుగు రోజులుగా జిల్లా పోలీసు కార్యాలయంలోనే ఉన్నారు. రెండు రోజు లుగా జిల్లాలోనే మకాం వేసిన సీఐడీ డీఐజీ ర్యాంక్ అధికారి, ఎస్పీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో జనార్దన్‌రెడ్డితోపాటు మోహన్‌రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను విచారిస్తున్నట్లు తెలి సింది.  విచారణలో వెల్లడైన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలి సింది. మరోవైపు జనార్దన్‌రెడ్డిని నేడో రేపో   అరెస్టు చేయవచ్చనే ప్రచారం పోలీసువర్గాల్లో జరుగుతోంది. పైస్థాయి నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసే అంశంపై స్పష్టత వస్తుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.



 నేటితో పూర్మ శ్రీధర్‌రెడ్డి కస్టడీ పూర్తి

 మోహన్‌రెడ్డి బినామీల్లో కీలక వ్యక్తుల్లో ఒకరైన పూర్మ శ్రీధర్‌రెడ్డి కస్టడీ శుక్రవారం పూర్తి కానుంది.  శుక్రవారంతో శ్రీధర్‌రెడ్డి కస్టడీ పూర్తవడంతో విచారణలో వెల్లడైన అంశాలను సీఐడీ అధికారులు నివేదిక రూ పంలో కోర్టుకు సమర్పించనున్నట్లు తెలిసింది.  



 మోహన్‌రెడ్డి కేసులో దర్యాప్తు వేగవంతం

 వేములవాడ:  ఏఎస్సై మోహన్‌రెడ్డి వడ్డీ వ్యా పారం, పోలీసు అధికారుల ప్రమేయం కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు నార్త్‌జోన్ ఐజీ నవీన్‌చంద్ స్పష్టం చేశారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని బుధవారం ఆయన కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. మోహన్‌రెడ్డి కేసులో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని అన్నారు.  

 

 కేసు నీరుగార్చే ప్రయత్నం?

 మోహన్‌రెడ్డి కేసును పకడ్బందీగా విచారి స్తున్న సీఐడీ అధికారులపై తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలిసింది. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో పలువురు డాక్టర్లు, వ్యాపారులు కూడా ఉండటంతో కేసును నీరుగార్చేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగా అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతకు ఆఫర్ పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో మోహన్‌రెడ్డి బాధితులు ఆందోళన చెందుతున్నారు. కేసు విచారణ ముగిసే దశకు చేరుకునేవేళ ఇలా ప్రచారం జరుగుతుండడంతో బాధితులు సీఐడీ కార్యాలయాలకు, పోలీస్‌స్టేషన్లకు  వెళ్తూ మోహన్‌రెడ్డి కేసుల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

 

 సీఐడీ అదుపులో మోహన్‌రెడ్డి కుమారుడు!

 మోహన్‌రెడ్డి అరెస్టు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన అతడి కుమారుడు అక్షయ్‌రెడ్డిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మోహన్‌రెడ్డి అక్రమ ఫైనాన్స్ దందా, పెట్టుబడిదారుల వివరాలతో కూడిన పలు కీలక డైరీలు, డాక్యుమెంట్లుతోపాటు ఓ బ్యాగును కూడా స్వాధీ నం చేసుకున్నట్లు సమాచారం. వీటిలో పలువురి అప్పులు, అధికారులకు ఇచ్చిన నగదు వివరాలు ఉన్నాయని, సీఐడీ దాఖలు చేసిన కేసులకు సంబంధించి బలమైన ఆధారాలు లభించాయని పోలీసులు భావిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top